Telugu Global
Sports

ప్రపంచకప్ లో నేడు భారత్ కు అఫ్ఘన్ 'స్పిన్ సవాల్'!

ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో ఆతిథ్య భారత్ వరుసగా రెండో విజయానికి ఉరకలేస్తోంది. న్యూఢిల్లీ వేదికగా ఈరోజు జరిగే రెండోరౌండ్లో అఫ్ఘనిస్థాన్ పనిపట్టడానికి సిద్ధమయ్యింది.

ప్రపంచకప్ లో నేడు భారత్ కు అఫ్ఘన్ స్పిన్ సవాల్!
X

ప్రపంచకప్ లో నేడు భారత్ కు అఫ్ఘన్ 'స్పిన్ సవాల్'!

ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో ఆతిథ్య భారత్ వరుసగా రెండో విజయానికి ఉరకలేస్తోంది. న్యూఢిల్లీ వేదికగా ఈరోజు జరిగే రెండోరౌండ్లో అఫ్ఘనిస్థాన్ పనిపట్టడానికి సిద్ధమయ్యింది.

భారతగడ్డపై నాలుగోసారి జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ పోటీలు రికార్డుల మోతతో సాగిపోతున్నాయి. ఆస్ట్ర్రేలియాతో జరిగిన లోస్కోరింగ్ వార్ లో 6 వికెట్లతో నెగ్గడం ద్వారా శుభారంభం చేసిన భారత్ వరుసగా రెండో విజయానికి తహతహలాడుతోంది.

న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ రోజు జరిగే రెండోరౌండ్ పోరులో అప్ఘనిస్థాన్ తో భారత్ తలపడనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ పోటీ ప్రారంభంకానుంది.

శుభ్ మన్ గిల్ లేకుండానే.....

ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ భారత్ ..డాషింగ్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ లేకుండానే వరుసగా రెండోమ్యాచ్ కు సిద్ధమయ్యింది. డెంగ్యూజ్వరంతో చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శుభ్ మన్ గిల్ స్థానంలో మరో యువఓపెనర్ ఇషాన్ కిషన్ బ్యాటింగ్ కు దిగనున్నాడు. ఆస్ట్ర్రేలియాతో ముగిసిన ప్రారంభమ్యాచ్ లో డకౌట్ గా వెనుదిరిగిన ఇషాన్ నేటి ఈ మ్యాచ్ లో భారీస్కోరు సాధించే అవకాశం ఉంది.

తుదిజట్టులో మహ్మద్ షమీ?

ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్ల వ్యూహంతో టైటిల్ వేటకు దిగిన భారత్..రొటేషన్ పాలసీ ప్రకారం తొలిమ్యాచ్ లో సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి విశ్రాంతి నిచ్చింది. అయితే..ఢిల్లీ పిచ్ పైన షమీకి తిరుగులేని రికార్డు ఉండడంతో తుదిజట్టులోకి తీసుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మహ్మద్ షమీకి చోటు కల్పించాలంటే జాదూ స్పిన్నర్ అశ్విన్ లేదా..బ్యాటర్లలో ఒక స్పెషలిస్ట్ ను పక్కన పెట్టక తప్పదు. అశ్విన్ స్థానంలో షమీ లేదా పేస్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ను సైతం తుదిజట్టులోకి తీసుకొనే అవకాశాలు లేకపోలేదు ప్రారంభమ్యాచ్ లో 2 పరుగులకే ఇషాన్, రోహిత్, శ్రేయస్ అయ్యర్ వికెట్లు నష్టపోయిన భారత టాపార్డర్ త్రయం సైతం భారీస్కోర్లు సాధించాలన్న పట్టుదలతో ఉంది.

నలుగురు స్పిన్నర్లతో అప్ఘన్ ఆర్మీ...

రౌండ్ రాబిన్ లీగ్ ప్రారంభమ్యాచ్ లో బంగ్లాదేశ్ చేతిలో పరాజయం పొందిన అప్ఘన్ జట్టు రెండోరౌండ్లో పవర్ ఫుల్ భారత్ కు షాక్ ఇవ్వాలని భావిస్తోంది. లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్, ఆఫ్ స్పిన్ జోడీ ముజీబుర్ రెహ్మాన్, మహ్మద్ నబీ, లెఫ్టామ్ చైనామన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ లతో భారత టాపార్డర్ కు సవాలు విసురుతోంది.

టీ-20 ఫార్మాట్లో మ్యాజిక్ స్పిన్నర్ గా పేరున్న రషీద్ ఖాన్ 10 ఓవర్ల వన్డే ఫార్మాట్లో ఏస్థాయిలో రాణించగలడన్నది ఆసక్తికరంగా మారింది.

తక్కువ నిడివి కలిగిన బౌండ్రీ లైన్ కు తోడు బ్యాటింగ్ కు అత్యంత అనువుగా ఉన్న ఢిల్లీ పిచ్ పైన భారతజట్టు సైతం 400కు పైగా స్కోరు సాధించినా ఆశ్చర్యం లేదు.

ఇదే వేదికగా శ్రీలంక- దక్షిణాఫ్రికాజట్ల నడుమ జరిగిన తొలిరౌండ్ పోరులో 700కు పైగా పరుగుల స్కోరు నమోదు కావడం విశేషం.

అఫ్ఘన్ కెప్టెన్ హస్మతుల్లా షాహీదీ, ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రంహీం జడ్రాన్, రియాజ్ హుస్సేన్, రహ్మద్ షా, నజీబుల్లా, మహ్మద్ నబీలతో కూడిన అప్ఘన్ బ్యాటింగ్ ఆర్డర్ భారత బౌలింగ్ ఎటాక్ ను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్న అంశంపైనే మ్యాచ్ తుదిఫలితం ఆధారపడి ఉంది.

భారత్ దే పైచేయి...

భారత్- అప్ఘన్ జట్లు ఇప్పటి వరకూ మూడుసార్లు మాత్రమే 50 ఓవర్ల వన్డే పోరులో తలపడితే భారత్ 2 విజయాలతో పైచేయి సాధించింది. మరో మ్యాచ్ టైగా ముగిసింది.టాస్ నెగ్గిన జట్టు మరో ఆలోచన లేకుండా ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని భారీస్కోరుతో ప్రత్యర్థిని ఒత్తిడికి గురిచేసే వ్యూహాన్ని అనుసరించవచ్చు.

అప్ఘన్ చిన్నజట్టేనన్న భావనతో పోటీకి దిగితే మాత్రం రోహిత్ సేనకు కష్టాలు తప్పవు.

First Published:  11 Oct 2023 11:02 AM IST
Next Story