Telugu Global
Sports

నేటినుంచే మహిళా టీ-20 ప్రపంచకప్!

2023- ఐసీసీ మహిళా టీ-20 ప్రపంచకప్ కు దక్షిణాఫ్రికాలో రంగం సిద్ధమయ్యింది.

ICC Womens T20 world cup
X

ICC Women's T20 world cup

2023- ఐసీసీ మహిళా టీ-20 ప్రపంచకప్ కు దక్షిణాఫ్రికాలో రంగం సిద్ధమయ్యింది. గత టోర్నీ రన్నరప్ భారత్ ఈసారైనా టైటిల్ సాధించాలన్న పట్టుదలతో పోటీకి దిగుతోంది....

ఐసీసీ 8వ మహిళా టీ-20 ప్రపంచకప్ సమరానికి సఫారీల్యాండ్ దక్షిణాఫ్రికా ముస్తాబయ్యింది. ఫిబ్రవరి 10 నుంచి 26 వరకూ కేప్ టౌన్, పార్ల్, గెబ్రెతా వేదికలుగా జరిగేఈ టోర్నీలో పది అత్యుత్తమ జట్లు ఢీకొనబోతున్నాయి.

హాట్ ఫేవరెట్ గా ఆస్ట్ర్రేలియా

2009 నుంచి 2020 వరకూ జరిగిన మొదటి ఏడు ప్రపంచకప్ టోర్నీలలో ఐదుసార్లు విజేతగా నిలిచిన ప్రపంచ నంబర్ వన్ జట్టు ఆస్ట్ర్రేలియా మరోసారి టైటిల్ ఫేవరెట్ గా బరిలో నిలిచింది.

2010, 2012, 2014, 2018, 2020 ప్రపంచకప్ టోర్నీలలో విజేతగా నిలిచిన ఆస్ట్ర్రేలియా మహిళా టీ-20 ప్రపంచకప్ కే మరో పేరుగా నిలిచింది.

2009లో ఇంగ్లండ్, 2016లో వెస్టిండీస్ జట్లు విశ్వవిజేతలుగా నిలిస్తే..2009, 2010 టోర్నీలలో న్యూజిలాండ్, 2020 ప్రపంచకప్ లో భారత్ రన్నరప్ స్థానాలతో సరిపెట్టుకొన్నాయి.

గత టోర్నీ ఫైనలిస్ట్ భారత్ తొలిటైటిల్ కోసం తహతహలాడుతోంది. హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టులో స్మృతి మంధానా, షెఫాలీవర్మ, జెమీమా రోడ్రిగేజ్ లాంటి పలువురు ప్రతిభావంతులైన బ్యాటర్లున్నారు.

గత ఏడు ప్రపంచకప్ టోర్నీలలో భారత్ మూడుసార్లు సెమీఫైనల్స్ ( 2009, 2010, 2016 ), ఓసారి (2020 ) ఫైనల్స్ కు అర్హత సంపాదించగలిగింది.

మాజీ చాంపియన్లు ఇంగ్లండ్, వెస్టిండీస్ తో పాటు న్యూజిలాండ్ సైతం అత్యంత ప్రమాదకరమైన ప్రత్యర్థిగా కనిపిస్తోంది. ఆతిథ్య దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక ఐర్లాండ్ జట్లు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నాయి.

గ్రూపు-బీలో భారత్ పోటీ..

టోర్నీలో తలపడుతున్న మొత్తం 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించి లీగ్ దశ పోటీలు నిర్వహిస్తారు. గ్రూపు-ఏ లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్ర్రేలియా, ఆతిథ్య దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడుతుంటే..గ్రూప్ -బీలో భారత్, పాకిస్థాన్, వెస్టిండీస్, ఐర్లాండ్, ఇంగ్లండ్ జట్లు ఢీ కొంటున్నాయి.

మొత్తం 10 జట్లలో ర్యాంకింగ్స్ ఆధారంగా మొదటి ఏడు ( ఆస్ట్ర్రేలియా, భారత్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంక, పాకిస్థాన్ )జట్లు నేరుగా టోర్నీలో పాల్గొంటున్నాయి. ఆతిథ్య దేశం హోదాలో దక్షిణాఫ్రికా 8వ జట్టుగా నిలిచింది. మిగిలిన రెండు బెర్త్ ల కోసం నిర్వహించిన క్వాలిఫైయింగ్ టోర్నీలో ఐదు ఖండాలకు చెందిన మొత్తం 37 జట్లు తలపడ్డాయి.

గత టోర్నీలో పాల్గొన్న థాయ్ లాండ్ స్థానంలో ఐర్లాండ్ తొలిసారిగా ప్రపంచకప్ బెర్త్ సంపాదించింది.

ఫిబ్రవరి 12న గ్రూప్-బీ లీగ్ లో భారత్ తన తొలిపోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో పోటీపడుతుంది. ఫిబ్రవరి 15న వెస్టిండీస్, 18న ఇంగ్లండ్, 20న ఐర్లాండ్ జట్లతో భారత్ తలపడనుంది.

గ్రూపులీగ్ లో మొదటి రెండుస్థానాలలో నిలిచినజట్లు సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్లో ఢీ కొంటాయి. ఫిబ్రవరి 23న తొలిసెమీఫైనల్స్, 24న రెండో సెమీఫైనల్స్, 26న టైటిల్ సమరం నిర్వహిస్తారు.

మూడు నాకౌట్ మ్యాచ్ లను కేప్ టౌన్ లోని న్యూల్యాండ్ క్రికెట్ గ్రౌండ్ లో నిర్వహిస్తారు.

మహిళల కోసం తక్కువ నిడివి బౌండ్రీలు..

పురుషులతో సమానంగా మ్యాచ్ ఫీజులు అందుకొంటున్న మహిళలు ఆడేమ్యాచ్ ల్లో బౌండ్రీల నిడివి చాలా తక్కువగా ఉండటం చర్చనీయాశంగా మారింది. మిగిలిన క్రీడల్లో లేని మినహాయింపు క్రికెట్లోనే ఎందుకు అని ప్రశ్నించేవారు లేకపోలేదు.

పురుషుల మ్యాచ్ ల్లో 70 నుంచి 80 మీటర్ల బౌండ్రీ లైన్లు ఉంటే..మహిళలకు కేవలం 50 నుంచి 50 మీటర్ల బౌండ్రీ లైన్లే ఉంచి మ్యాచ్ లు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

మహిళా ప్రపంచకప్ లో 20 ఓవర్లలో ఓ జట్టు సాధించిన అత్యధిక స్కోరు 3 వికెట్లకు 195 ( దక్షిణాఫ్రికా ) పరుగులు కాగా..అత్యల్పస్కోరు 14.4 ఓవర్లలో 46 పరుగులకు ఆలౌట్ (బంగ్లాదేశ్ )గా రికార్డులు ఉన్నాయి.

అత్యధిక వ్యక్తిగత స్కోరు ఆస్ట్ర్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ ( 65 బంతుల్లో 126 పరుగులు ) పేరుతో ఉంది. టీ-20 ప్రపంచకప్ లో శతకం బాదిన భారత ఏకైక బ్యాటర్ హర్మన్ ప్రీత్ కౌర్ (2018 ప్రపంచకప్ ) మాత్రమే.

మరింత పెరిగిన ప్రైజ్ మనీ

2018 ప్రపంచకప్ తో పోల్చిచూస్తే..ప్రస్తుత ప్రపంచకప్ విజేతగా నిలిచిన జట్టుకు భారీమొత్తం ప్రైజ్ మనీ అందచేయనున్నారు. 320 శాతం అధికంగా ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు నిర్వాహక సంఘం ప్రకటించింది.

స్పాన్సర్ల నుంచి వచ్చే ఆదాయం గణనీయంగా పెరగడంతో ప్రైజ్ మనీని 26 లక్షల డాలర్లకు పెంచారు. విశ్వవిజేతగా నిలిచిన జట్టుకు 10 లక్షల డాలర్లతో పాటు ట్రోఫీని బహుకరిస్తారు. రన్నరప్ గా నిలిచిన జట్టు 5 లక్షల డాలర్లు నజరానాగా అందుకోనుంది. టోర్నీలో తలపడుతున్న మొత్తం 10 జట్లకూ గ్యారెంటీ మనీ చెల్లించనున్నారు.

ఐసీసీ వందలకోట్ల రూపాయలు వ్యయం చేస్తూ మహిళా క్రికెట్ ను ప్రోత్సహిస్తూ వస్తోంది. అయితే ప్రమాణాలు మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటున్నాయి.

ఫాస్ట్ , బౌన్సీ పిచ్ లకు మరో పేరైన దక్షిణాఫ్రికా వేదికగా రెండున్నరవారాలపాటు సాగే ఈటోర్నీ మెరుగైన ప్రమాణాలతో, సరికొత్త రికార్డుతో ముగియాలని, హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టు విశ్వవిజేతగా తిరిగిరావాలని కోరుకొందాం.

First Published:  10 Feb 2023 11:05 AM IST
Next Story