ప్రపంచ నంబర్ వన్ బౌలర్ కు ఇదేమి శాపం!
ప్రపంచ నంబర్ వన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ను కీలకమ్యాచ్ ల్లో పక్కన పెడుతూ భారతజట్టు భారీమూల్యమే చెల్లిస్తూ వస్తోంది.
ప్రపంచ నంబర్ వన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ను కీలకమ్యాచ్ ల్లో పక్కన పెడుతూ భారతజట్టు భారీమూల్యమే చెల్లిస్తూ వస్తోంది. కెప్టెన్, కోచ్ లు మారినా చేసిన తప్పే చేస్తూ తెల్లమొకం వేస్తున్నారు....
ఇంగ్లండ్ లోని ఓవల్ వేదికగా కొద్దిరోజుల క్రితమే ముగిసిన ఐసీసీ ప్రపంచ టెస్టు లీగ్ ఫైనల్లో భారత ఘోరపరాజయంపై పోస్ట్ మార్టం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
కీలక టాస్ నెగ్గినా భారత్ సద్వినియోగం చేసుకోలేకపోడాన్ని, చేసిన తప్పులే చేయటాన్ని పలువురు మాజీ దిగ్గజాలు ఎండగడుతున్నారు. ఓటమి తెచ్చిపెట్టుకొన్నదేనని అభిప్రాయపడుతున్నారు.
గ్రహపాటుగా మారిన పొరపాటు అంచనా...
టెస్టుమ్యాచ్ ప్రారంభం రోజున ఓవల్ స్టేడియంలోని వాతావరణం, పరిస్థితులను భారత కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తప్పుగా అంచనా వేయటంతో జట్టు వ్యూహాం తలకిందులైపోయింది. తుదిజట్టు కూర్పు సైతం జట్టును బాగా దెబ్బతీసింది.
లీగ్ ఫైనల్ జరిగే జూన్ 7 నుంచి 11వరకూ ఆకాశం మేఘావృతంగా ఉంటూ..పేస్ , స్వింగ్ బౌలర్లకు వాతావరణం అనువుగా ఉంటుందని భావించిన భారత టీమ్ మేనేజ్ మెంట్..తుదిజట్టులో అదనపు స్పిన్నర్ ( అశ్విన్) ను కాకుండా అదనపు పేసర్ ( ఉమేశ్ యాదవ్ ) చేర్చుకొని ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది. పైగా..
మ్యాచ్ ఐదురోజులూ ఎండకాయటంతో పిచ్ స్పిన్ బౌలింగ్ కు అనుకూలంగా మారటం, పేసర్లకు ఏమాత్రం అనువుగా లేకపోడం భారత అంచనాలను దెబ్బతీసింది.
అశ్విన్ లేకపోడం పెద్ద దెబ్బే...!
స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్ ..టెస్టు క్రికెట్లోనే టాప్ ర్యాంక్ బౌలర్. ఐసీసీ టెస్టు లీగ్ ( 2023 )లో భాగంగా 13 మ్యాచ్ లు ఆడి 61 వికెట్లతో నిలిచిన నంబర్ వన్ బౌలర్.
భారతజట్టు టెస్టు లీగ్ ఫైనల్స్ కు వరుసగా రెండోసారి చేరడంలో ప్రధానపాత్ర వహించిన బౌలర్ గా కూడా అశ్విన్ కు రికార్డు ఉంది. అయితే..అలాంటి కీలక బౌలర్ ను టైటిల్ మ్యాచ్ సమయంలో పక్కన పెట్టడం భారత్ పాలిటశాపంగా మారింది.
ఓవల్ శీతలవాతావరణంలో రెండో స్పిన్నర్ కు చోటు లేదని భారత టీమ్ మేనేజ్ మెంట్ పొరపాటుగా అంచనావేసింది. అశ్విన్ లాంటి తెలివైన, అపారఅనుభవం కలిగిన స్పిన్నర్ కు వాతావరణంతోనూ, పిచ్ లతోనూ పనేలేదని, తన బౌలింగ్ లోని వైవిద్యంతోనే వికెట్లు పడగొట్టే నేర్పు ఉందన్నది అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని భారత మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్ సైతం చెబుతూనే ఉన్నారు.
టెస్ లీగ్ ఫైనల్స్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందే..తుదిజట్టులోకి ఇద్దరు స్పిన్నర్లను తప్పక తీసుకోవాలని, అశ్విన్ జట్టులో ఉండితీరాలని సునీల్ గవాస్కర్ భారత టీమ్ మేనేజ్ మెంట్ కు సలహా ఇచ్చారు. మాస్టర్ సచిన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
అశ్విన్ లాంటి బౌలర్ లేకుండా భారతజట్టు ఎలా అంటూ సచిన్ ప్రశ్నించాడు. ఆస్ట్ర్రేలియా బ్యాటింగ్ లైనప్ లో ఐదుగురు లెఫ్ట్ హ్యాడర్లు ఉన్నారని, ఎడమచేతి వాటం బ్యాటర్లను పడగొట్టడంలో అశ్విన్ రికార్డు అమోఘమని..ఈ అంశాలను సైతం భారత టీమ్ మేనేజ్ మెంట్ పరిగణలోకి తీసుకోకపోడం ఆశ్చర్యం కలిగించిందని గవాస్కర్ వాపోయారు.
అశ్విన్ అంటే అంత చిన్నచూపా!
భారతజట్టు ఇంగ్లండ్ వేదికగా టెస్టుమ్యాచ్ లు ఆడిన సమయంలో..అక్కడి పిచ్ లు, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అశ్విన్ ను పక్కనపెట్టడం, తుదిజట్టులో చోటు కల్పించకపోడం భారత టీమ్ మేనేజ్ మెంట్ కు ఓ అలవాటుగా మారింది.
తన కెరియర్ లో ఇప్పటికే వందకు పైగా టెస్టులు ఆడి 470 వికెట్లతో పాటు శతాబ్దపు మేటి బౌలర్ గా నిలిచిన అశ్విన్ ను..ఇంగ్లండ్ పర్యటనలకు ఎంపిక చేయటం, రెండో స్పిన్నర్ గా పరిగణించి పక్కనపెట్టేయడం ఆనవాయితీగా వస్తోంది.
గతంలో రవిశాస్త్రి చీఫ్ కోచ్ గా, విరాట్ కొహ్లీ కెప్టెన్ గా ఉన్న సమయంలో 2021 ఇంగ్లండ్ పర్యటనలో ఏకంగా ఐదుటెస్టులు ఆడకుండా బెంచ్ కే పరిమితం చేశారు. రవీంద్ర జడేజాకు ఇస్తున్న ప్రాధాన్యం అశ్విన్ కు ఇవ్వకపోడం చర్చనీయాంశంగా మారింది.
రవిశాస్త్ర్రి, విరాట్ కొహ్లీల తర్వాత..చీఫ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టిన తరువాత కూడా...ఇంగ్లండ్ గడ్డపై భారత తుదిజట్టులో అశ్విన్ కు చోటు లేకుండాపోయింది.
గతంలో రవిశాస్త్ర్రి, విరాట్ కొహ్లీ చేసిన పొరపాటునే ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ పునరావృతం చేయటం తనకు అర్థంకాలేదని, అశ్విన్ లాంటి మేటి బౌలర్ ను కూరలో కరివేపాకులా పరిగణిస్తారా? అంటూ సునీల్ గవాస్కర్ మండిపడుతున్నారు.
టెస్టు లీగ్ ఫైనల్లో కంగారూ బ్యాటింగ్ ఆర్డర్లోని ఎడమచేతి వాటం పేసర్ అలెక్స్ కేరీ తొలి ఇన్నింగ్స్ లో 48, రెండో ఇన్నింగ్స్ లో 66 పరుగుల నాటౌట్ స్కోరు, మిషెల్ స్టార్క్
93 పరుగుల భాగస్వామ్యం జోడించడం భారత్ ను దెబ్బతీసిందని, అదే అశ్విన్ తుదిజట్టులో ఉండి ఉంటే కంగారూ లెఫ్ట్ హ్యాండర్ల జోరు కొనసాగి ఉండేది కాదని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
బ్యాటింగ్ లోనూ అశ్విన్ కు పలు ఫైటింగ్ సెంచరీలు ఉన్నాయని, భారతజట్టుకు తన బౌలింగ్ తో తిరుగులేన విజయాలు అందించిన అశ్విన్ కేవలం తన బ్యాటింగ్ తో పలుమార్లు ఓటమి ప్రమాదం నుంచి తప్పించిన విషయాన్ని టీమ్ మేనేజ్ మెంట్ మర్చిపోయిందంటూ గవాస్కర్ చురకలు అంటించారు.
ఇంగ్లండ్ వేదికగా అశ్విన్ ఆడిన 7 టెస్టుల్లో 18 వికెట్లు సాధించిన రికార్డును అందరూ గుర్తుంచుకోవాలని, అశ్విన్ ను అసలు ఎందుకు రెండో స్పిన్నర్ గా పరిగణిస్తున్నారంటూ నిలదీశారు.
ఐసీసీ టెస్టు లీగ్ టైటిల్ సమరం ముగిసిన కొద్దిరోజులకే ప్రకటించిన టెస్టు బౌలర్ ర్యాంకింగ్స్ లో అశ్వినే ప్రపంచ నంబర్ వన్ బౌలర్ గా నిలవడం కొసమెరుపు.