Telugu Global
Sports

నేటినుంచే ఐసీసీ వన్డే ప్రపంచకప్ సంబరం!

యాభై ఓవర్ల వన్డే క్రికెట్లో మరో ప్రపంచకప్ భారత్ వేదికగా ఈరోజు ప్రారంభంకానుంది.

నేటినుంచే ఐసీసీ వన్డే ప్రపంచకప్ సంబరం!
X

యాభై ఓవర్ల వన్డే క్రికెట్లో మరో ప్రపంచకప్ భారత్ వేదికగా ఈరోజు ప్రారంభంకానుంది.

ఇన్ స్టంట్ వన్డే క్రికెట్లో మరో ప్రపంచకప్ సమరానికి అంతర్జాతీయ క్రికెట్లోని అగ్రశ్రేణి జట్లన్నీ సకల అస్త్రశస్త్ర్రాలతో సై అంటున్నాయి. భారతగడ్డపై పుష్కరకాల విరామం తరువాత జరుగనున్న 2023 సమరానికి దేశంలోని 10 వేదికలు ఆతిథ్యమివ్వనున్నాయి.

అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకూ జరిగే ఈ 10 జట్ల సమరానికి...రెండుసార్లు విజేత, ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ భారత్ సిద్ధమయ్యింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని 15 మంది సభ్యుల భారత జట్టు మూడోసారి విశ్వవిజేతగా నిలవాలన్న పట్టుదలతో టైటిల్ వేటకు సిద్ధమయ్యింది......

అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకూ.. మొత్తం 46 రోజులపాటు 48 మ్యాచ్ లుగా ప్రపంచకప్ ను నిర్వహించడానికి నిర్వాహక సంఘం విస్త్రుతస్థాయిలో ఏర్పాట్లు చేసింది.

భారత గడ్డపై నాలుగోసారి.....

ఈ భూఖండంలో అత్యధికమంది క్రికెట్ అభిమానులున్న ఏకైక దేశం భారత్ నాలుగోసారి ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు ఆతిథ్యమిస్తోంది. గతంలో 1987, 1996, 2011 సంవత్సరాలలో ప్రపంచకప్ ను విజయవంతంగా నిర్వహించిన బీసీసీఐ తిరిగి 12 సంవత్సరాల విరామం తర్వాత మరోసారి ఆతిథ్య దేశంగా బాధ్యతలు స్వీకరించింది.

ఈ 48 మ్యాచ్ ల సమరంలో వెస్టిండీస్, జింబాబ్వే మినహా మిగిలిన ప్రముఖ జట్లన్నీ ఢీ కొనబోతున్నాయి.

వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ విజేత ఆస్ట్రేలియా, రెండుసార్లు విన్నర్ భారత్ , ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, అప్ఘనిస్థాన్, సౌతాఫ్రికా, పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు టైటిల్ వేటకు దిగుతున్నాయి.

తొలిదశ 10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో ఒక్కోజట్టు తొమ్మిది మ్యాచ్ లు చొప్పున ఆడనుంది. రౌండ్ రాబిన్ లీగ్ మొదటి నాలుగుస్థానాలలో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్లో పోటీపడతాయి.

నవంబర్ 15న ముంబై వేదికగా తొలి సెమీఫైనల్స్, నవంబర్ 16న కోల్ కతా వేదికగా రెండో సెమీఫైనల్స్ నిర్వహిస్తారు. నవంబర్ 19న అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టైటిల్ సమరం నిర్వహించనున్నారు. సెమీఫైనల్స్ నుంచి ప్రతి మ్యాచ్ కూ రిజర్వ్ డే సదుపాయం కల్పించారు.

అత్యంత పటిష్టంగా భారత్.....

వన్డే క్రికెట్లో నంబర్ వన్ ర్యాంక్ జట్టుగా ఉన్న భారత్ సొంత గడ్డపై అత్యంత సమతూకంతో పటిష్టంగా కనిపిస్తోంది. డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ నాయకత్వంలోని

భారతజట్టు కు కుదురైన బ్యాటింగ్, పదునైన బౌలింగ్, చురుకైన ఫీల్డింగ్ ఉన్నాయి. ప్రపంచకప్ కు సన్నాహకంగా జరిగిన ఆసియాకప్ తో పాటు..ఆస్ట్ర్రేలియాతో జరిగిన తీన్మార్ సిరీస్ ను సైతం భారత్ అలవోకగా నెగ్గడం ద్వారా అసలుసిసలు సమరానికి సిద్ధమయ్యింది.

10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ దశలో భారత్ తన ప్రారంభమ్యాచ్ ను అక్టోబర్ 8న చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఐదుసార్లు విన్నర్ ఆస్ట్ర్రేలియాతో ఆడనుంది. అక్టోబర్ 11న అప్ఘనిస్థాన్, 14న పాకిస్థాన్, 19న బంగ్లాదేశ్, 22న న్యూజిలాండ్, 29న ఇంగ్లండ్, నవంబర్ 2న శ్రీలంక, 5న దక్షిణాఫ్రికా, నవంబర్ 12న నెదర్లాండ్స్ జట్లతో భారత్ పోటీపడ నుంది.

భారత ప్రపంచకప్ 'కల' నెరవేరేనా?

ఐసీసీ ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో భారత్ ఇప్పటి వరకూ 1983, 2011 వన్డే ప్రపంచకప్ లతో పాటు 2007 టీ-20 ప్రపంచకప్ ను మాత్రమే సాధించింది. గత దశాబ్దకాలంగా ఐసీసీ టోర్నీలలో దారుణంగా విఫలమవుతూ వస్తున్న ప్రపంచ నంబర్ వన్ భారతజట్టు ప్రస్తుత 2023 ప్రపంచకప్ ను గెలుచుకొని తీరాలన్న పట్టుదలతో ఉంది.

పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా లాంటి అపారఅనుభవం కలిగిన ఆటగాళ్లతో పాటు..శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, మహ్మద్ సిరాజ్ లాంటి యువ క్రికెటర్లు, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్ లాంటి సెమీ సీనియర్లతో భారతజట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. ఆరునూరైనా ప్రపంచకప్ ను మూడోసారి నెగ్గితీరాలన్న కసితో ఉంది.

విజేత జట్టుకు 33 కోట్ల రూపాయల నజరానా!

ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక మొత్తంలో ప్రైజ్ మనీని ప్రస్తుత టోర్నీలోనే అందచేయనున్నారు. విజేతగా నిలిచిన జట్టుకు ఐసీసీ ట్రోఫీతో పాటు 33 కోట్ల 25 లక్షల 84వేల( 40 లక్షల డాలర్లు ) రూపాయలు నజరానాగా ఇవ్వనున్నారు.

రన్నరప్ గా నిలిచిన జట్టుకు 16 కోట్ల 62 లక్షల 54వేల 200 రూపాయలు ( 2 మిలియన్ డాలర్లు ) అందచేస్తారు. సెమీఫైనల్స్ లో పరాజయం పొందిన రెండు జట్ల కు 6 కోట్ల 65 లక్షల రూపాయల చొప్పున. రౌండ్ రాబిన్ లీగ్ నుంచి నిష్క్ర్రమించిన 6 జట్లకు 83 లక్షల రూపాయల చొప్పున చెల్లిస్తారు.

రౌండ్ రాబిన్ లీగ్ దశలో నెగ్గిన ప్రతిమ్యాచ్ లోనూ విజేత జట్టుకు 66 లక్షల రూపాయల చొప్పున ఇస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మొత్తం 83 కోట్ల 13 లక్షల 10వేల 500 రూపాయల మొత్తాన్ని ప్రైజ్ మనీగా ఐసీసీ కేటాయించింది.

ఏడువారాలపాటు విశ్వక్రికెట్ అభిమానులను ఓలలాడించే ఈ ప్రపంచకప్ సమరంలో భారత్ విజేతగా నిలవాలని శతకోటి అభిమానులతో పాటు మనమూ కోరుకొందాం.!

First Published:  5 Oct 2023 8:14 AM IST
Next Story