Telugu Global
Sports

20 జట్లతో ఇక టీ-20 ప్రపంచకప్!

వచ్చే ఏడాది జరుగనున్న 2024 టీ-20 ప్రపంచకప్ కు ముహూర్తం ఖరారయ్యింది. 20 జట్లతో టోర్నీ నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది.

20 జట్లతో ఇక టీ-20 ప్రపంచకప్!
X

వచ్చే ఏడాది జరుగనున్న 2024 టీ-20 ప్రపంచకప్ కు ముహూర్తం ఖరారయ్యింది. 20 జట్లతో టోర్నీ నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది.

ధూమ్ ధామ్ టీ-20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారిగా 20 జట్లతో పోరు నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. వెస్టిండీస్, అమెరికా దేశాల సంయుక్త ఆతిథ్యంలో జరుగనున్న ఈ టోర్నీ తేదీలను సైతం అంతర్జాతీయ క్రికెట్ మండలి ఖరారు చేసింది.

జూన్ 4 నుంచి 30 వరకూ సమరం...

వెస్టిండీస్‌-అమెరికా సంయుక్త ఆతిథ్యంలో మొత్తం పది వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. ప్రపంచకప్ షెడ్యూల్‌ ను అధికారికంగా ప్రకటించకపోయినా.. 2024, జూన్‌ 4 నుంచి 30 వరకు టోర్నీ జరుగనుందని తెలిపింది. ఈ చిట్టిపొట్టి ప్రపంచకప్ కోసం పాపువా న్యూగినియా, స్కాట్లాండ్, ఐర్లాండ్ తో సహా మొత్తం 20 జట్లు పోటీపడనున్నాయి. ఇప్పటికే 17 జట్లు అర్హత సాధించాయి. మరో 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం క్వాలిఫయింగ్‌ మ్యాచులు జరుగుతుండటంతో మరో మూడు జట్లు ఏవనేది త్వరలో తేలనుంది.

4 గ్రూపులు- 20 జట్లు...

ప్రపంచకప్ లో తలపడే మొత్తం 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి లీగ్ కమ్ సూపర్ -8 కమ్ నాకౌట్ తరహాలో పోటీలు నిర్వహిస్తారు. ఒక్కో గ్రూప్‌లో 5 జట్లకు స్థానం కల్పిస్తారు. ప్రతి గ్రూప్‌లో టాపర్లుగా నిలిచిన రెండు జట్లు సూపర్‌ 8 రౌండ్ కు చేరుకోగలుగుతాయి. మొత్తం 8 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. వివిధ గ్రూపుల్లో టాపర్లుగా నిలిచిన నాలుగుజట్లు సెమీ ఫైనల్స్‌ నాకౌట్ పోరులో ఢీ కొంటాయి.

భార‌త్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్‌, న్యూజిలాండ్, పాకిస్థాన్, ద‌క్షిణాఫ్రికా, శ్రీ‌లంక‌, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్‌, నెద‌ర్లాండ్స్, అమెరికా జ‌ట్లు పోటీల‌కు ఇప్పటికే అర్హత సాధించాయి. పిల్లజట్లు ఐర్లండ్‌, పపువా న్యూగినియా, స్కాట్‌లాండ్‌లు సైతం అర్హత సంపాదించాయి. మరో మూడు జట్లు ఏవో త్వరలో తేలనున్నాయి. 2022లో జరిగిన టీ-20 ప్రపంచకప్ లో ఇంగ్లండ్‌, పాకిస్థాన్ విన్నర్ ,రన్నరప్ స్థానాలు కైవసం చేసుకొన్నాయి.

అమెరికాలోని 5 వేదికల్లో పోటీలు...

అమెరికా, వెస్టిండీస్ క్రికెట్ బోర్డుల సంయుక్త ఆతిథ్యంలో జరిగే ఈ పోటీలను మొత్తం 10 స్టేడియాలు వేదికలుగా నిర్వహిస్తారు. వాటిలో అమెరికాలోని డాలస్ (గ్రాండ్‌ ప్రైరీ స్టేడియం), మోరిస్‌విల్లే (చర్చ్‌ స్ట్రీట్‌ పార్క్‌), న్యూయార్క్‌ (వాన్‌ కార్ట్‌ల్యాండ్‌ పార్క్‌)తోపాటు ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌ స్టేడియంలో మ్యాచ్ లు నిర్వహించనున్నారు. అయితే ఈ స్టేడియాలకు ఇంకా అంతర్జాతీయ హోదా ప్రకటించాల్సి ఉంది. ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే వేదికలకు ఇంటర్నేషనల్‌ హోదా తప్పనిసరి. ప్రస్తుతం ఐసీసీ బృందం ఈ స్టేడియాల్లో ఉన్న సదుపాయాలను పరిశీలిస్తోంది.

క్రికెట్ ను విశ్వవ్యాప్తం చేయటం కోసం ఐసీసీ...టీ-20 ప్రపంచకప్ నే ఆయుధంగా చేసుకొంది. తూర్పు ఆసియా- పసిఫిక్ రీజియన్ క్వాలిఫైయర్స్ నుంచి పాపువా న్యూగినియా, యూరోపియన్ రీజియన్ నుంచి స్కాట్లాండ్, ఐర్లాండ్ బెర్త్ లు సాధించాయి.

అమెరికా రీజియన్ నుంచి ఓ జట్టు, ఆఫ్రికా రీజియన్, ఆసియా రీజియన్ అర్హత రౌండ్ల నుంచి రెండేసి జట్లకు ప్రపంచకప్ అవకాశం కల్పించారు.

First Published:  29 July 2023 3:00 PM IST
Next Story