అమ్మానాన్నలదే ఈ ఏషియాడ్ గోల్డ్- తిలక్ వర్మ!
హాంగ్జు ఆసియాక్రీడల్లో భాగంగా జరిగిన క్రికెట్లో తాను సాధించిన బంగారు పతకం అమ్మానాన్నలదేనని హైదరాబాద్ యువబ్యాటర్ తిలక్ వర్మ ప్రకటించాడు.
హాంగ్జు ఆసియాక్రీడల్లో భాగంగా జరిగిన క్రికెట్లో తాను సాధించిన బంగారు పతకం అమ్మానాన్నలదేనని హైదరాబాద్ యువబ్యాటర్ తిలక్ వర్మ ప్రకటించాడు.
చైనాలోని హాంగ్జు వేదికగా కొద్దిరోజుల క్రితమే ముగిసిన 19వ ఆసియాక్రీడల్లో భాగంగా నిర్వహించిన క్రికెట్ విభాగంలో భారత్ రెండుకు రెండు బంగారు పతకాలు సాధించడం ద్వారా..భారత్ రికార్డుస్థాయిలో 28 స్వర్ణాలు గెలుచుకోడంలో భారత క్రికెట్ జట్లు తమవంతు పాత్ర పోషించాయి.
రుతురాజ్ గయక్వాడ్ నాయకత్వంలో బరిలో నిలిచిన భారతజట్టు..బంగారు పతకం కోసం అఫ్ఘనిస్థాన్ తో జరిగిన పోరు లో విజేతగా నిలిచింది. వర్షం దెబ్బతో మ్యాచ్ పూర్తిగా జరుగకపోడంతో మెరుగైన ర్యాంక్ ప్రాతిపదికన భారత్ ను టైటిల్ విజేతగా నిర్వాహక సంఘం ప్రకటించింది.
తిలక్ వర్మ ఆల్ రౌండ్ షో...
నేపాల్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో నెగ్గిన భారత్..సెమీస్ లో బంగ్లాదేశ్ ను అధిగమించడంలో హైదరాబాదీ యువ బ్యాటర్ తిలక్ వర్మ ఆల్ రౌండర్ గా కీలక పాత్ర పోషించాడు.
బౌలర్ గా ఓ వికెట్ పడగొట్టడంతో పాటు..బ్యాటర్ గా అజేయ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అప్ఘనిస్థాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ 18.2 ఓవర్ల అనంతరం వానదెబ్బతో రద్దు కావడంతో భారత్ బంగారు పతకం ఖాయం చేసుకోగలిగింది.
భారతజట్టులో సభ్యుడిగా బంగారు పతకం అందుకొన్న తిలక్ వర్మ..హాంగ్జు నుంచి హైదరాబాద్ కు తిరిగి వచ్చిన వెంటనే..అమ్మానాన్నలకు స్వర్ణం అందించడం ద్వారా మురిసిపోయాడు.
మధురానుభవం.. చిరస్మరణీయం....
ఆసియాక్రీడల క్రికెట్లో తాను సాధించిన బంగారు పతకం తమ కుటుంబానికే చిరస్మరణీయమంటూ తిలక్ వర్మ ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించాడు. తన తల్లిదండ్రుల మెడలో బంగారు పతకం వేసి మరీ పొంగిపోయాడు.
క్రికెటర్ గా తన జీవితంలో ఇదో మధురానుభవమని, తనకోసం ఎంతో చేసి, ఎన్నో త్యాగాలు చేసిన తల్లిదండ్రులకు తాను ఇవ్వగలిగిన అమూల్యమైన కానుక ఇదే నంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకొన్నాడు.
హైదరాబాద్ లో స్థిరనివాసం ఏర్పరచుకొన్న ఓ ఆంధ్ర కుటుంబానికి చెందిన తిలక్ వర్మ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించడం ద్వారా..భారత వన్డే, టీ-20 జట్లలో చోటు సంపాదించాడు.
దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన తిలక్ వర్మ తండ్రి ఓ ఎలక్ట్ర్రీషియన్ కాగా..తల్లి గృహిణి. ఐపీఎల్ ద్వారా ఏడాదికి కోటీ 90 లక్షల రూపాయలు ఆర్జిస్తున్న తిలక్ వర్మ ఇటీవలే సొంతింటి కలను నెరవేర్చుకోగలిగాడు.తన తమ్ముడిని ఉన్నతచదువులు చదివించే బాధ్యత సైతం తనదేనని చెప్పాడు.
దేశంలోని అత్యంత ప్రతిభావంతులైన టీనేజ్ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు సంపాదించిన తిలక్ వర్మ..రానున్న కాలంలో భారత క్రికెట్ సూపర్ స్టార్ కానున్నాడు.
రకరకాల క్రికెట్ ట్రోఫీల కంటే ఆసియాక్రీడల్లో సాధించిన బంగారు పతకం తిలక్ వర్మకు, కుటుంబానికి మధురం, చిరస్మరణీయమే మరి.