Telugu Global
Sports

సిరాజ్ కు చేదుఅనుభవంగా హైదరాబాద్ టెస్ట్'!

హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కు హోంగ్రౌండ్ రాజీవ్ స్టేడియం వేదికగా జరిగిన టెస్టుమ్యాచ్ ఓ చేదుఅనుభవంగా మిగిలిపోయింది.

సిరాజ్ కు చేదుఅనుభవంగా హైదరాబాద్ టెస్ట్!
X

హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కు హోంగ్రౌండ్ రాజీవ్ స్టేడియం వేదికగా జరిగిన టెస్టుమ్యాచ్ ఓ చేదుఅనుభవంగా మిగిలిపోయింది.

వ్యక్తిగతంగా సిరాజ్ కు, జట్టుగా భారత్ కు తీవ్రనిరాశను మిగిల్చింది.

అంతర్జాతీయ క్రికెట్ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన మహ్మద్ సిరాజ్ కు సొంతగడ్డ హైదరాబాద్ వేదికగా ఆడిన టెస్టుమ్యాచ్ ఓ చేదుఅనుభవంగా మిగిలింది.

మెల్బోర్న్ టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన 29 సంవత్సరాల సిరాజ్..సొంతగడ్డ హైదరాబాద్ వేదికగా తన తొలిటెస్టుమ్యాచ్ ఆడటానికి 23 టెస్టుల పాటు వేచిచూడాల్సి వచ్చింది.

తన 24వ టెస్టుమ్యాచ్ ను హైదరాబాద్ వేదికగా ఆడే అవకాశం సిరాజ్ కు దక్కింది.

11 ఓవర్లకే సిరాజ్ బౌలింగ్ పరిమితం...

తాను పుట్టిపెరిగిన హైదరాబాద్ గడ్డపై, తన స్నేహితులు, బంధువులు, అభిమానుల సమక్షంలో ఓ టెస్టుమ్యాచ్ ఆడే అవకాశాన్ని సిరాజ్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

సిరాజ్ రెండు ఇన్నింగ్స్ లోనూ కలిపి 11 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసినా కనీసం ఒక వికెట్టు పడగొట్టలేకపోయాడు. మరో ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు సాధించాడు. అయితే ..సిరాజ్ తన హోంగ్రౌండ్లో, తనకు అత్యంత సుపరిచితమైన హైదరాబాద్ పిచ్ పైన ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. పేలవమైన బౌలింగ్ తో తేలిపోయాడు.

ప్రస్తుత హైదరాబాద్ టెస్టు వరకూ తన కెరియర్ లో ఆడిన మొత్తం 24 టెస్టుల్లో సిరాజ్ కు 68 వికెట్లు పడగొట్టిన రికార్డు ఉంది. 2023 ఆసియాకప్ ఫైనల్లో శ్రీలంకపై 21 పరుగులకే 6 వికెట్లు, కేప్ టౌన్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండోటెస్టులో 15 పరుగులకే 6 వికెట్లు పడగొట్టిన తిరుగులేని రికార్డులు సిరాజ్ పేరుతోనే ఉన్నాయి.

భారత్ ఓటమితో సిరాజ్ పై ఒత్తిడి...

ఐదుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ తో హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన తొలిటెస్టుమ్యాచ్ లో భారత్ 28 పరుగులతో పరాజయం పాలుకావడంతో తుదిజట్టులో సిరాజ్ చోటుకు ఎసరు వచ్చేలా కనిపిస్తోంది.

విశాఖ వేదికగా ఫిబ్రవరి 2న ప్రారంభమయ్యే రెండోటెస్టు తుదిజట్టులో సిరాజ్ కు చోటు దక్కకపోయినా ఆశ్చర్యపోనక్కరలేదు. స్పిన్నర్లకు అనుకూలించే భారత టెస్టు వేదికల్లో సిరాజ్ లాంటి మెరుపుఫాస్ట్ బౌలర్ కు ఏమాత్రం చోటు లేదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. సిరాజ్ ను పక్కనపెట్టి తుదిజట్టులోకి మరో అదనపు బ్యాటర్ ను తీసుకోవాలంటూ క్రికెట్ వ్యాఖ్యాత పార్థివ్ పటేల్ సూచించాడు.

ఇంగ్లండ్ దెబ్బతో భారత్ విలవిల...

స్పిన్నర్ల షోగా సాగిన హైదరాబాద్ టెస్టు మ్యాచ్ మొదటి మూడురోజులఆటలో భారత్ ఆధిపత్యమే కొనసాగింది. అయితే..నాలుగోరోజు ఆటలో ఇంగ్లండ్ ఓపెనర్ ఓలీ పోపే 196 పరుగుల స్కోరుతో మ్యాచ్ ను మలుపు తిప్పాడు.

ఆఖరి ఇన్నింగ్స్ లో భారత్ 231 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించలేక ఓటమి పాలయ్యింది. గత ఆరుదశాబ్దాల కాలం హైదరాబాద్ వేదికగా జరిగిన టెస్టుమ్యాచ్ ల్లో

భారత్ ను కంగుతినిపించిన ఒకే ఒక్కజట్టుగా ఇంగ్లండ్ నిలిచింది.

2021 సిరీస్ లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పొందిన భారత్..ఆ తర్వాత జరిగిన 16 స్వదేశీ సిరీస్ ల్లో తిరుగులేని విజయాలు సాధిస్తూ వచ్చింది. అయితే..2024 సిరీస్ తొలిమ్యాచ్ లోనే తిరిగి ఇంగ్లండ్ జట్టు చేతిలోనే పరాజయంపాలు కావాల్సి వచ్చింది.

హోంగ్రౌండ్లో సిరాజ్ తో పాటు భారత్ సైతం విఫలం కావడంతో హైదరాబాద్ క్రికెట్ అభిమానులు తీవ్రనిరాశలో కూరుకుపోయారు. సొంతగ్రౌండ్లో ఓ టెస్టుమ్యాచ్ ఆడటానికి సిరాజ్ 23 మ్యాచ్ ల పాటు ఎదురుచూస్తే...సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ వేదిక తన ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లన్నీ ఆడిన వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం 116 టెస్టుల పాటు వేచిచూడాల్సి వచ్చింది.

మొత్తం మీద హైదరాబాద్ టెస్టు మహ్మద్ సిరాజ్ కు చేదుఅనుభవాన్ని మిలిల్చినట్లయ్యింది.

First Published:  31 Jan 2024 11:39 AM IST
Next Story