Telugu Global
Sports

ప్రపంచ వన్డే బౌలర్ నంబర్ వన్ సిరాజ్!

హైదరాబాదీ ఎక్స్ ప్రెస్, భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్..వన్డే క్రికెట్లో ప్రపంచ టాప్ ర్యాంక్ బౌలర్ గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి హైదరాబాదీగా అరుదైన ఘనత సొంతం చేసుకొన్నాడు.

Hyderabad: Mohammed Siraj becomes world number one ODI bowler
X

ప్రపంచ వన్డే బౌలర్ నంబర్ వన్ సిరాజ్!

హైదరాబాదీ ఎక్స్ ప్రెస్, భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్..వన్డే క్రికెట్లో ప్రపంచ టాప్ ర్యాంక్ బౌలర్ గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి హైదరాబాదీగా అరుదైన ఘనత సొంతం చేసుకొన్నాడు.

మేడిన్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కష్టానికి ఫలితం దక్కింది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ ఆటో డ్రైవర్ కుమారుడిగా బాల్యం నుంచి పేదరికంతో పోరాడటం ద్వారా రాటు దేలిన సిరాజ్ చురుకైన ఫాస్ట్ బౌలర్ గా రూపుదిద్దుకొన్నాడు.

దేశవాళీ రంజీ క్రికెట్ నుంచి ఐపీఎల్ వరకూ నిలకడగా రాణించడం ద్వారా అంచెలంచెలుగా ఎదుగుతూ భారతజట్టులో చోటు సంపాదించాడు. క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ సత్తా చాటుకొన్నా..వన్డే ఫార్మాట్లో స్పెషలిస్ట్ బౌలర్ గా గుర్తింపు సంపాదించాడు.

2023 సీజన్లో టాప్ గేర్....

ఆస్ట్ర్రేలియాతో ఆస్ట్ర్రేలియా గడ్డపై జరిగిన టెస్టు సిరీస్ లో సంచలన బౌలింగ్ తో చెలరేగిన మహ్మద్ సిరాజ్..2023 సీజన్ వన్డే సిరీస్ ల్లో భారత స్టార్ బౌలర్ గా అవతరించాడు.

శ్రీలంకతో ముగిసిన తీన్మార్ వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ లో సిరాజ్ 9 వికెట్లతో ప్రధానపాత్ర వహించాడు.

అంతేకాదు..ప్రపంచ నంబర్ వన్ టీమ్ న్యూజిలాండ్ తో జరిగిన మూడుమ్యాచ్ ల సిరీస్ లో రెండుమ్యాచ్ లు మాత్రమే ఆడినా 6 వికెట్లు పడగొట్టడం ద్వారా వన్డే ఫార్మాట్ లో బౌలర్ నెంబర్ వన్ గా నిలిచాడు.

ఇప్పటి వరకూ వన్డే క్రికెట్ లో అగ్రశ్రేణి బౌలర్లుగా ఓ వెలుగువెలిగిన ట్రెంట్ బౌల్ట్ ( న్యూజిలాండ్ ), జోష్ హేజిల్ వుడ్ ( ఆస్ట్ర్రేలియా) లను అధిగమించి టాప్ ర్యాంక్ ను కైవసం చేసుకొన్నాడు.

భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే పర్యవేక్షణలో గత 12 మాసాలుగా ప్రత్యేక శిక్షణ పొందిన సిరాజ్ తన బౌలింగ్ కు మరింతగా మెరుగులు దిద్దుకొన్నాడు.

మొత్తం 729 పాయింట్లతో బౌల్ట్, హేజిల్ వుడ్ లను మించిపోయాడు. సిరాజ్ కంటే బౌల్ట్, హేజిల్ వుడ్ రెండేసి పాయింట్ల తక్కువగా దిగువన ఉన్నారు.

న్యూజిలాండ్ తో హైదరాబాద్ వేదికగా ముగిసిన తొలివన్డేలో సిరాజ్ ఏకంగా 4 వికెట్లు పడగొట్టి తన నగరవాసులను అలరించాడు.

11 స్థానాలు మెరుగుపరచుకొన్న షమీ..

రాయ్ పూర్ వేదికగా జరిగిన రెండోవన్డేలో న్యూజిలాండ్ కు పట్టపగలే చుక్కలు చూపించిన సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ 11 స్థానాలు మెరుగు పరచుకొని 32వ ర్యాంకులో నిలిచాడు. గాయాలతో గత కొంతకాలంగా వన్డే జట్టుకు దూరమైన షమీ తిరిగి గాడిలో పడ్డాడు.

పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ నంబర్ వన్ బ్యాటర్ స్థానం నిలుపుకోగా..భారత యువఓపెనర్ శుభ్ మన్ గిల్ మూడుమ్యాచ్ ల్లో 360 పరుగులు, ఓ డబుల్ సెంచరీ, ఓ శతకం సాధించడం ద్వారా 20 స్థానాల మేర తన ర్యాంక్ ను మెరుగు పరచుకొని 6వ స్థానం సంపాదించాడు. విరాట్ కొహ్లీ 7వ ర్యాంకులో ఉంటే..కెప్టెన్ రోహిత్ రెండుస్థానాల మేర తన ర్యాంకును మెరుగు పరచుకొని 8వ స్థానంలో నిలిచాడు.

భారత్ కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు టాప్ టెన్ ర్యాంకులు సాధించడం విశేషం.

వన్డే క్రికెట్ టాప్ ర్యాంకర్ భారత్..

వన్డే టీమ్ ర్యాంకింగ్స్ లో భారత్ తిరిగి టాప్ ర్యాంక్ ను సంపాదించింది. శ్రీలంక, న్యూజిలాండ్ జట్లతో ముగిసిన తీన్మార్ సిరీస్ ల్లో క్లీన్ స్వీప్ విజయాలు సాధించడం ద్వారా 114 ర్యాంకింగ్ పాయింట్లతో నంబర్ వన్ ర్యాంక్ అందుకొంది.

113 పాయింట్లతో ఆస్ట్ర్రేలియా రెండు, 112 పాయింట్లతో ఇంగ్లండ్ మూడు, 111 పాయింట్ల న్యూజిలాండ్ నాలుగు, 110 పాయింట్లతో పాకిస్థాన్ ఐదుర్యాంకుల్లో కొనసాగుతున్నాయి.

ఐదు అగ్రశ్రేణిజట్ల నడుమ కేవలం ఒక్కో పాయింటు మాత్రమే ర్యాంకుల్లో అంతరం ఉండటం విశేషం.

ప్రపంచకప్ కు సన్నాహకంగా జరుగనున్న రానున్న సిరీస్ ల్లో ఆస్ట్రేలియాతో భారత్, దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్ జట్లు తలపడాల్సి ఉంది.

First Published:  25 Jan 2023 6:30 PM IST
Next Story