Telugu Global
Sports

ఆసియాక్రీడల చెస్ జట్టులో తెలుగుతేజాలు!

చైనా వేదికగా జరిగే ఆసియాక్రీడల చదరంగంలో పాల్గొనే భారతజట్టులో నలుగురు తెలుగు గ్రాండ్ మాస్టర్లకు చోటు దక్కింది.

కోనేరు హంపి మరియు ద్రోణవల్లి హారిక
X

కోనేరు హంపి మరియు ద్రోణవల్లి హారిక

చైనా వేదికగా జరిగే ఆసియాక్రీడల చదరంగంలో పాల్గొనే భారతజట్టులో నలుగురు తెలుగు గ్రాండ్ మాస్టర్లకు చోటు దక్కింది. 10 మంది సభ్యులజట్లను భారత చెస్ సమాఖ్య ప్రకటించింది..

చైనాలోని హాంగ్జు వేదికగా సెప్టెంబర్ 23 న ప్రారంభంకానున్న 2022 ఆసియా క్రీడలలో పాల్గొనే భారతజట్లను వివిధ క్రీడాసంఘాలు ఒకదాని తర్వాత ఒకటిగా ప్రకటిస్తూ వస్తున్నాయి.

సుదీర్ఘ విరామం తర్వాత ఆసియా క్రీడల అంశాలలో ఒకటిగా ప్రవేశపెడుతున్న పురాణక్రీడ చదరంగం పురుషుల, మహిళల టీమ్ విభాగాలలో భారత్ బలమైన జట్లతో పోటీకి దిగుతోంది.

పురుషుల, మహిళల విభాగాలలో ఐదుగురు గ్రాండ్ మాస్టర్లతో కూడిన జట్లను ఎంపిక చేసింది. భారత పురుషుల, మహిళల విభాగాలలో తెలుగు రాష్ట్ర్రాలకు చెందిన మొత్తం నలుగురు గ్రాండ్ మాస్టర్లు చోటు సంపాదించగలిగారు.

ఒకే ఒక్కడు అర్జున్....

ఐదుగురు సభ్యుల భారత మహిళాజట్టులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన గ్రాండ్ మాస్టర్ల జోడీ కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలకు చోటు దక్కింది. ఐదుగురు సభ్యుల పురుషుల జట్టులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణతో పాటు..తెలంగాణా గ్రాండ్ మాస్టర్ ఇరగేసి అర్జున్ స్థానం సంపాదించాడు.

ఆసియాక్రీడల చదరంగంలో పాల్గొంటున్న తెలంగాణా తొలి ప్లేయర్ గా, గ్రాండ్ మాస్టర్ గా అర్జున్ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. గత రెండేళ్లుగా అంతర్జాతీయ చెస్ టోర్నీలలో పాల్గొంటూ నిలకడగా రాణిస్తు వస్తున్న అర్జున్ చెస్ ఒలింపియాడ్ లో సైతం భారత్ కు ప్రాతినిథ్యం వహించాడు.



13 సంవత్సరాల తర్వాత చెస్ కు చోటు..

ఇతిహాస క్రీడ చదరంగానికి ఆసియాక్రీడల్లో 13 సంవత్సరాల విరామం తర్వాత ఓ ప్రధాన క్రీడాంశంగా చోటు కల్పించారు. 2010 ఆసియాక్రీడల్లో చివరిసారిగా చదరంగానికి చోటు కల్పించారు. అయితే 2014, 2018 క్రీడల్లో మాత్రం చెస్ క్రీడకు అవకాశం దక్కలేదు.

2010 గ్వాంగ్జూ ఆసియా క్రీడల బరిలో నిలిచిన భారతజట్లు చెస్ పతకాలు అందుకోగలిగాయి.

చెస్‌ క్రీడకు అధికప్రాధాన్యమిచ్చే చైనా ఆతిథ్యంలో ఈ క్రీడలు జరుగుతున్న కారణంగా తిరిగి చదరంగానికి ఓ పతకం అంశంగా చోటు కల్పించారు.

పురుషుల టీమ్ విభాగంలో తలపడే భారతజట్టులో పెంటేల హరికృష్ణ, ఇరగేసి అర్జున్, విదిత్ గుజరాతీ, గుకేశ్, ప్రజ్ఞానంద్ సభ్యులుగా ఉన్నారు. మహిళల జట్టులో

కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, రమేశ్ వైశాలి, వంతికా అగర్వాల్, సవితా శ్రీ చోటు సాధించారు.

కోనేరు హంపి అరుదైన రికార్డు..

ఆసియాక్రీడల చదరంగంలో రెండు బంగారు పతకాలు సాధించిన అరుదైన రికార్డు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి పేరుతో ఉంది. ద్రోణవల్లి హారిక కాంస్య పతక విజేతగా మాత్రమే ఉంది.

2006 ఆసియాక్రీడల వ్యక్తిగత, మిక్సిడ్ టీమ్ అంశాలలో కోనేరు హంపి బంగారు పతకాలు సాధించింది. గాంగ్డు వేదికగా 2010లో జరిగే ఆసియాక్రీడల్లో ద్రోణవల్లి హారిక కాంస్య పతకం సాధించింది. ఆసియాక్రీడల చెస్‌ వ్యక్తిగత విభాగం పోటీలను ర్యాపిడ్ ఫార్మాట్లో నిర్వహిస్తారు.

వాస్తవానికి గత ఏడాది జరగాల్సిన ఈ క్రీడలను కరోనా దెబ్బతో సంవత్సరం ఆలస్యంగా నిర్వహించనున్నారు. చెస్ తో పాటు క్రికెట్ ను సైతం ఆసియాక్రీడల్లో భాగంగా తిరిగి ప్రధాన అంశాలుగా నిర్వహించడానికి రంగం సిద్ధం చేశారు.

First Published:  10 July 2023 9:30 AM GMT
Next Story