Telugu Global
Sports

చేసిన తప్పులే చేస్తుంటే గెలిచేదెలా-ముంబై కోచ్ గరంగరం!

నెగ్గితీరాల్సిన మ్యాచ్ లో చేజేతులా ఓడామంటూ ముంబై బౌలింగ్ కోచ్ లబోదిబో అంటున్నారు. ఈ ఓటమి బౌలర్ల వైఫల్యమే అంటూ మండిపడుతున్నారు.

చేసిన తప్పులే చేస్తుంటే గెలిచేదెలా-ముంబై కోచ్ గరంగరం!
X

నెగ్గితీరాల్సిన మ్యాచ్ లో చేజేతులా ఓడామంటూ ముంబై బౌలింగ్ కోచ్ లబోదిబో అంటున్నారు. ఈ ఓటమి బౌలర్ల వైఫల్యమే అంటూ మండిపడుతున్నారు....

ఐపీఎల్ -16వ సీజన్ లీగ్ లో మాజీ చాంపియన్ ముంబై బౌలింగ్ వైఫల్యంతో అల్లాడిపోతోంది. కేవలం బ్యాటింగ్ పవర్ తో నెట్టుకొంటూ వస్తున్న ముంబై..కీలక మ్యాచ్ ల్లో పసలేని బౌలింగ్ తో తేలిపోతోంది.

బుమ్రా లేని లోటుతో.....

టీ-20 టాప్ ర్యాంక్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా వెన్నెముక గాయం ముంబై ఇండియన్స్ బౌలింగ్ ను తీవ్రంగా బలహీన పరచింది. బుమ్రా అందుబాటులో లేకపోడంతో డెత్ బౌలింగ్ లో ముంబై అత్యంత బలహీనంగా మారింది.

ప్రస్తుత లీగ్ లో ప్రత్యర్థిజట్లకు అత్యధికసార్లు 200కు పైగా స్కోర్లు చేసే అవకాశం కల్పించిన ఏకైకజట్టు ముంబై ఇండియన్స్ మాత్రమే. ప్రత్యర్థిజట్లకు 190నుంచి 200కు పైగా పరుగులు సమర్పించుకోడం..భారీలక్ష్యాలను తన బ్యాటింగ్ పవర్ తో అధిగమిస్తూ రావడం ముంబై ఓ అలవాటుగా చేసుకొంది. అయితే..వికెట్లో ఏమాత్రం తేడా ఉన్నా, కీలక సమయాలలో బౌలర్లు విఫలమైనా ఈ వ్యూహం బెడిసి కొట్టి అసలుకే మోసం తెస్తోంది.

లక్నోపై ముంబైని ముంచిన జోర్డాన్..

లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా సూపర్ జెయింట్స్ తో జరిగిన కీలక 13వ రౌండ్ పోరులో ముంబై 5 పరుగుల ఓటమితో ప్లే-ఆఫ్ బెర్త్ ను మరింత క్లిష్టంగా మార్చుకొంది.

ప్రత్యర్థి లక్నోని మొదటి 17 ఓవర్లలో 3 వికెట్లకు 123 పరుగులకే కట్టడి చేసిన ముంబై బౌలర్లు..చివరి మూడు ఓవర్లలో 54 పరుగులు సమర్పించుకొని తమజట్టు ఓటమికి కారకులయ్యారు. ప్రధానంగా ..డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్ గా పేరుపొందిన క్రిస్ జోర్డాన్ ఇన్నింగ్స్ 18 వ ఓవర్ ఆరు బంతుల్లో 24 పరుగులివ్వడం మ్యాచ్ స్వరూపాన్నే మార్చి వేసింది. 150 స్కోరుకే పరిమితం కావాల్సిన లక్నో చివరకు 177 పరుగుల మ్యాచ్ విన్నింగ్ స్కోరు చేయగలిగింది.

బౌలింగ్ కోచ్ అసహనం..

ముంబైజట్టుకు గత 9 సీజన్లుగా తాను బౌలింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్నానని..ప్రస్తుత సీజన్లో తమ బౌలర్లు దారుణంగా విఫలం కావడం తనను తీవ్రనిరాశకు గురి చేసిందని బౌలింగ్ శిక్షకుడు షేన్ బాండ్ వాపోతున్నారు.

చేసిన తప్పులే చేస్తూ జట్టు ఓటమికి బౌలర్లే కారణమైతే విజయాలు ఎలా సాధించగలమని ప్రశ్నించారు. లక్నోతో మ్యాచ్ ముగిసిన వెంటనే షేన్ బాండ్ మీడియాతో మాట్లాడుతూ తమ బౌలింగ్ తీరు పట్ల తీవ్రఅసహనం వ్యక్తం చేశారు.

లక్నోజట్టును అదుపు చేయటానికి తాము పక్కా వ్యూహాం అమలు చేశామనీ, తమ బౌలర్లు మొదటి 17 ఓవర్ల వరకూ పక్కాగా ప్రణాళికను అమలు చేయగలిగారని, ఆ తర్వాతే గతి తప్పారని, దాని ఫలితమే ప్రస్తుత ఈ మ్యాచ్ లో ఓటమి అని వివరణ ఇచ్చారు.

స్టోయినిస్ లాంటి అత్యంత ప్రమాదకరమైన హిట్టర్ క్రీజులో ఉంటే..పక్కాగా వ్యూహంతో బౌల్ చేయకుంటే భారీమూల్యం చెల్లించుకోక తప్పదని, తమ జట్టులోని ఓ బౌలర్ 24 పరుగులివ్వడంతో మ్యాచ్ చేజారిపోయిందని వాపోయారు.

సుదూర బౌండ్రీల వైపు షాట్లు ఆడేలా బౌలింగ్ వేయమంటే..కురచ బౌండ్రీలైన్ ఉన్న ప్రాంతంలో బంతులు వేస్తే పరుగులు వెల్లువెత్తక మరేమవుతుందని బాండ్ ప్రశ్నించారు. లక్నో ఆల్ రౌండర్ స్టోయినిస్ 47 బంతుల్లో 89 పరుగులు చేయడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

మొన్న రషీద్ ఖాన్..నిన్న స్టోయినిస్..

గుజరాత్ టైటాన్స్ తో జరిగిన పోరులో రషీద్ ఖాన్ చెలరేగిపోయేలా అవకాశమిచ్చిన తమ బౌలర్లు..లక్నో మ్యాచ్ లో స్టోయినిస్ కు అనుకూలంగా బంతులు వేయడం

తమ బలహీనతను తేటతెల్లం చేసిందని, వరుసగా రెండుమ్యాచ్ ల్లో చేసిన తప్పే చేస్తే ప్రత్యర్థి బ్యాటర్లు వీరబాదుడు బాదక మరేం చేస్తారని మండిపడ్డారు.

మరోవైపు..మ్యాచ్ నెగ్గాలంటే ఆఖరి ఓవర్లో 11 పరుగులు చేయాల్సిన ముంబై బ్యాటర్లు టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్ లను లక్నో పేసర్ మొహిసిన్ ఖాన్ పక్కా యార్కర్లతో కట్టడి చేయడంతో పాటు కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి..తమజట్టుకు 5 పరుగుల కీలక విజయం అందించగలిగాడు.

12వ రౌండ్ వరకూ లీగ్ టేబుల్ మూడోస్థానంలో కొనసాగుతూ వచ్చిన ముంబై..13వ రౌండ్ ఓటమితో 4వ స్థానానికి పడిపోయింది. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుతో జరిగే తన ఆఖరి రౌండ్ మ్యాచ్ లో ముంబై భారీవిజయం సాధించగలిగితేనే ప్లే-ఆఫ్ రౌండ్ చేరే అవకాశాలు మెరుగవుతాయి.

ముంబై మొత్తం 13 రౌండ్లలో 7 విజయాలు, 6 పరాజయాలతో 14 పాయింట్లు సాధించింది.

First Published:  17 May 2023 5:29 PM IST
Next Story