Telugu Global
Sports

టీ-20 సిరీస్ లో నేడు హాట్ హాట్ ఫైట్!

భారత్- శ్రీలంకజట్ల తీన్మార్ టీ-20 సిరీస్ రెండోమ్యాచ్ కే వేడెక్కింది.

టీ-20 సిరీస్ లో నేడు హాట్ హాట్ ఫైట్!
X

భారత్- శ్రీలంకజట్ల తీన్మార్ టీ-20 సిరీస్ రెండోమ్యాచ్ కే వేడెక్కింది. వరుసగా రెండోమ్యాచ్ నెగ్గడం ద్వారా సిరీస్ సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఆతిథ్య భారత్ ఉంది. ఆసియా చాంపియన్ శ్రీలంక మాత్రం ఈరోజు జరిగే రెండోమ్యాచ్ నెగ్గి సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలని భావిస్తోంది...

టీ-20 ప్రపంచ నంబర్ వన్ టీమ్ భారత్, ఆసియా చాంపియన్ శ్రీలంకజట్ల తీన్మార్ టీ-20 సిరీస్ షో ..ముంబై నుంచి పూణే నగరానికి చేరింది. వాంఖడే స్టేడియం వేదికగా ముగిసిన తొలి టీ-20లో 2 పరుగుల తేడాతో ఆతిథ్య భారత్ నెగ్గడం ద్వారా సిరీస్ లో 1-0తో పైచేయి సాధించడంతో..ఈరోజు పూణే వేదికగా జరిగే రెండోమ్యాచ్ ఆతిథ్య భారత్ కు చెలగాటం, శ్రీలంకకు సిరీస్ సంకటంగా మారింది.

శ్రీలంకకు డూ ఆర్ డై....

ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన తొలి టీ-20లో విజయం అంచుల వరకూ వచ్చి 2 పరుగుల తేడాతో ఓడిన శ్రీలంక...సిరీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకోవాలంటే ఆరునూరైనా రెండోమ్యాచ్ లో నెగ్గితీరాల్సి ఉంది.

మహారాష్ట్ర్ర క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే కీలక పోరులో విజయమే లక్ష్యంగా శ్రీలంక సిద్ధమయ్యింది.

ఆల్ రౌండర్ దాసున్ షనక నాయకత్వంలోని శ్రీలంకజట్టు పలువురు ఆల్ రౌండర్లు, ఇద్దరు మిస్టరీ స్పిన్నర్లతో అత్యంత సమతూకంతో ఉంది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని భారతజట్టుకు అడుగడుగునా పోటీ ఇవ్వనుంది.

భారతజట్టులో పలు మార్పులు?

ముంబైవేదికగా ముగిసిన తొలి టీ-20లో పాల్గొన్న వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ మోకాలిగాయంతో సిరీస్ కే దూరమయ్యాడు. మెరుపు ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఫిట్ నైస్ సైతం డౌటుగా మారడంతో...ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ ను సిద్ధం చేశారు. ఐపీఎల్ లో అదరగొడుతున్న రాహుల్ త్రిపాఠీ ఈరోజు మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసే అవకాశం ఉంది.

పూణే పిచ్ బ్యాటింగ్ కు, స్ట్రోక్ మేకర్లకు అనువుగా ఉండడంతో..భారీస్కోరింగ్ మ్యాచ్ ఖాయమని క్యూరేటర్ అంటున్నారు. 200కు పైగా స్కోర్లు నమోదైనా ఆశ్చర్యం లేదని ధీమాగా చెబుతున్నారు. తొలిమ్యాచ్ లో విఫలమైన మిస్టర్ 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ రెండోమ్యాచ్ లో భారీస్కోరు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

తొలి టీ-20లో టాపార్డర్ విఫలమైనా..మిడిలార్డర్ ఆటగాళ్లు దీపక్ హుడా- అక్షర్ పటేల్ 6వ వికెట్ కు అజేయ భాగస్వామ్యంతో నిలబడడంతో భారత్ 162 పరుగుల స్కోరు సాధించగలిగింది.

అయితే..ప్రస్తుత రెండో పోరులో ఓపెనింగ్ జోడీ ఇషాన్ కిషన్- శుభ్ మన్ గిల్ ఇచ్చే ఆరంభం పైనే భారత్ జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. బౌలింగ్ లో శివమ్ మావీ, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్ మరోసారి కీలకపాత్ర పోషించనున్నారు. లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ స్థాయికి తగ్గట్టుగా రాణించకపోతే భారత్ కష్టాలు తప్పవు.

శ్రీలంకపై భారత్ దే పైచేయి...

ఆసియా చాంపియన్, 8వ ర్యాంకర్ శ్రీలంక ప్రత్యర్థిగా భారత్ కు మెరుగైన రికార్డే ఉంది. ప్రస్తుత సిరీస్ లోని తొలిపోరు వరకూ 15 మ్యాచ్ ల్లో ఈ రెండుజట్లూ తలపడితే..భారత్ 12 విజయాలు, 2 పరాజయాలు చవిచూసింది. ఓ మ్యాచ్ రద్దుల పద్దులో చేరింది. స్వదేశీగడ్డపై శ్రీలంకతో 2016 నుంచి 2023 వరకూ ఆడిన మ్యాచ్ ల్లో భారత్ వరుసగా 11 విజయాలు సాధించడం మరో అరుదైన రికార్డుగా నిలిచిపోతుంది.

స్పిన్ బౌలర్లకు అనువుగా ఉండే పూణే స్టేడియంలో బ్యాటర్ల సత్తాకు అసలు పరీక్ష అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

First Published:  5 Jan 2023 10:36 AM IST
Next Story