వారేవ్వా! హైదరాబాద్ సన్ రైజర్స్!
ఐపీఎల్ -16 వ సీజన్ లీగ్ మొదటి 20 మ్యాచ్ ల్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టు ఘనతను మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ దక్కించుకొంది.
ఐపీఎల్ -16 వ సీజన్ లీగ్ మొదటి 20 మ్యాచ్ ల్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టు ఘనతను మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ దక్కించుకొంది...
ఐపీఎల్ అంటే బౌండ్రీల హోరు, సిక్సర్లజోరు. ఐపీఎల్ అంటే పరుగుల వెల్లువ. బండబాదుడు, చితక్కొట్టుడు, దంచుడే దంచుడు అన్న మాటలకు మరోపేరు.
20 ఓవర్లు..60 థ్రిల్స్ గా ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠతో సాగిపోయే ఐపీఎల్ మ్యాచ్ ల్లో 200..ఆ పైన స్కోర్లు అతితక్కువగానే నమోదవుతూ ఉంటాయి.
2008 ప్రారంభ ఐపీఎల్ నుంచి ప్రస్తుత 18వ సీజన్ లీగ్ 19వ మ్యాచ్ వరకూ పలు మార్లు మాత్రమే 200కు పైగా స్కోర్లు నమోదయ్యాయి.
లేటుగా అయినా..లేటెస్టుగా...
ప్రస్తుత సీజన్ మొదటి రెండురౌండ్ల మ్యాచ్ ల్లో ఘోరపరాజయాలు పొందిన మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్..మూడు, నాలుగు రౌండ్ల మ్యాచ్ ల్లో చెలరేగి ఆడింది.
హోంగ్రౌండ్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా ముగిసిన మూడోరౌండ్లో బౌలింగ్ పవర్ తో పంజాబ్ కింగ్స్ ను కట్టడి చేసి అలవోక విజయం సాధించింది.
ఇక..కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన 4వ రౌండ్ హైస్కోరింగ్ పోరులో సన్ రైజర్స్ తన బ్యాటింగ్ పవర్ ఏంటో ప్రత్యర్థికి రుచిచూపించింది.
ఓపెనర్ హ్యారీ బ్రూక్ 55 బంతుల్లోనే సెంచరీ బాదడంతో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 228 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసింది. ప్రత్యర్థి కోల్ కతా నైట్ రైడర్స్ ను 205 పరుగులకే కట్టడి చేయడం ద్వారా 23 పరుగుల విజయం సొంతం చేసుకొంది.
కోల్ కతాతో 24సార్లు తలపడిన సన్ రైజర్స్ కు ఇది కేవలం 9వ గెలుపు మాత్రమే. అయితే..ప్రస్తుత సీజన్లో లేటుగా ఫామ్ లోకి వచ్చిన సన్ రైజర్స్ లేటెస్టుగా అన్నట్లుగా..228 పరుగుల భారీస్కోరు సాధించిన తొలిజట్టుగా నిలిచింది.
2023 సీజన్లో తొలి శతకం బాదిన ఘనత సైతం సన్ రైజర్స్ ఓపెనర్ హ్యారీ బ్రూక్ కే దక్కింది. సన్ రైజర్స్ పై హైదరాబాద్ వేదికగా ముగిసిన మూడోరౌండ్ పోరులో పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధావన్ సాధించిన 99 పరుగుల అత్యధిక స్కోరును 100 పరుగులతో బ్రూక్ అధిగమించడం ద్వారా టాప్ స్కోరర్ గా రికార్డుల్లో చేరాడు.
భారీస్కోర్లకు మరోపేరు బెంగళూరు..
ఐపీఎల్ గత 15 సీజన్ల చరిత్రలో అత్యధిక స్కోర్లు సాధించిన జట్టు ఘనతను బెంగళూరు రాయల్ చాలెంజర్స్ దక్కించుకొంది. ఒకసారి కాదు రెండుసార్లు 248కి పైగా స్కోర్లు సాధించిన తొలి, ఏకైకజట్టు బెంగళూరు మాత్రమే.
2013 సీజన్లో పూణే సూపర్ జెయింట్స్ తో జరిగిన పోరులో విరాట్ కొహ్లీ నాయకత్వంలోని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ సాధించిన 5 వికెట్లకు 263 పరుగులే నాటికి..నేటికి అత్యధిక ఐపీఎల్ స్కోరుగా కొనసాగుతోంది.
2016 సీజన్లో గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరుజట్టు సాధించిన 3 వికెట్లకు 248 పరుగులు రెండో అతిపెద్ద స్కోరుగా నిలిచింది.
2010 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ప్రత్యర్థిగా మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్లకు 246 పరుగుల స్కోరు నమోదు చేసింది. ఇది ..ఐపీఎల్ లో మూడో అతిపెద్ద స్కోరుగా ఉంది.
2018 సీజన్లో కింగ్స్ పంజాబ్ పై కోల్ కతా నైట్ రైడర్స్ 6 వికెట్లకు 245 పరుగులు నాలుగో అత్యుత్తమ స్కోరుగా నమోదయ్యింది.
2008 ప్రారంభ ఐపీఎల్ లో కింగ్స్ లెవన్ పంజాబ్ పై చెన్నై సూపర్ కింగ్స్ చేసిన 5 వికెట్లకు 240 పరుగులు ఐదో అత్యుత్తమస్కోరుగా ఉంది.
ప్రస్తుత ఐపీఎల్ లీగ్ దశలోని మిగిలిన 50 మ్యాచ్ లతో పాటు..నాకౌట్ రౌండ్లలోని మూడుమ్యాచ్ ల్లో సరికొత్త అత్యధిక స్కోరు నమోదవుతుందా? వేచిచూడాల్సిందే.