Telugu Global
Sports

ఐపీఎల్ లో సునామీ హాఫ్ సెంచరీల హీరోలు!

ఐపీఎల్ గత 16 సీజన్ల చరిత్రలో సుడిగాలి అర్థశతకాలు బాదిన మొనగాళ్లు అతికొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఆ జాబితాలో నికోలస్ పూరన్ వచ్చి చేరాడు.

ఐపీఎల్ లో సునామీ హాఫ్ సెంచరీల హీరోలు!
X

ఐపీఎల్ గత 16 సీజన్ల చరిత్రలో సుడిగాలి అర్థశతకాలు బాదిన మొనగాళ్లు అతికొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఆ జాబితాలో నికోలస్ పూరన్ వచ్చి చేరాడు...

ఐపీఎల్ అంటే సిక్సర్ల హోరు, బౌండ్రీల జోరు, పరుగుల సునామీ. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడే హీరో. వీరబాదుడు, దంచికొట్టుడు, బాదుడే బాదుడు లాంటి పదాలు కేవలం కొందరు బ్యాటర్లకు మాత్రమే అతికినట్లు సరిపోతాయి.

2008 ప్రారంభ ఐపీఎల్ నుంచి ప్రస్తుత 2023 ఐపీఎల్ వరకూ గత 16 సీజన్లలో..అతితక్కువ బంతుల్లో మెరుపు హాఫ్ సెంచరీలు సాధించిన బ్యాటర్లు కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు.

ఈ జాబితాలోకి ప్రస్తుత సీజన్ 15వ మ్యాచ్ ద్వారా లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ వచ్చి చేరాడు. కేవలం 15 బంతుల్లోనే సునామీ హాఫ్ సెంచరీతో..మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు.

మ్యాచ్ విన్నర్ నికోలస్ పూరన్...

వెస్టిండీస్ టీ-20 కెప్టెన్ నికోలస్ పూరన్ ను ప్రస్తుత సీజన్ వేలంలో లక్నో ఫ్రాంచైజీ 16 కోట్ల రూపాయల భారీ ధరకు సొంతం చేసుకొంది.తనదైన రోజున భారీషాట్లతో విరుచుకుపడే పూరన్..బెంగళూరు రాయల్ చాలెంజర్స్ బౌలర్లకు తన బ్యాట్ పవర్ ఏంటో చిన్నస్వామి స్టేడియంలో రుచి చూపించాడు.

213 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన లక్నో ఒక్క వికెట్ విజయంలో పూరన్ ప్రధానపాత్ర వహించాడు. లక్నోజట్టు 99 పరుగులకే 4 వికెట్లు నష్టపోయి ఎదురీదుతున్న స్థితిలో ఇన్నింగ్స్ 11వ ఓవర్లో క్రీజులోకి అడుగుపెట్టిన పూరన్ కేవలం 15 బంతుల్లోనే అరడజను బౌండ్రీలతో అర్థశతకం పూర్తి చేశాడు. ప్రస్తుత సీజన్లో

ఇప్పటి వరకూ జరిగిన 15 రౌండ్ల మ్యాచ్ ల్లో ఇదే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీగా నమోదయ్యింది.

చివరకు 19 బంతుల్లో 4 బౌండ్రీలు, 7 సిక్సర్లతో 62 పరుగుల స్కోరుకు ఆట 17వ ఓవర్లో పూరన్ అవుటైనా లక్నోజట్టు అనూహ్య విజయాన్ని సొంతం చేసుకోగలిగింది. పూరన్ 326.32 స్ట్ర్రయిక్ రేట్ తో శివమెత్తినట్లు ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

రాహుల్ పేరుతో ఐపీఎల్ రికార్డు...

ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా అర్థశతకం బాదిన బ్యాటర్ రికార్డు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కోల్ కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ పాట్ కమినస్ ల పేరుతో ఉంది.2018 సీజన్లో పంజాబ్ తరపున రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్రత్యర్థిగా 14 బంతుల్లోనే సునామీ హాఫ్ సెంచరీ సాధించాడు.

2022 సీజన్లో కోల్ కతా ఆల్ ఆల్ రౌండర్ పాట్ కమిన్స్ సైతం ముంబై పైన 14 బంతుల్లోనే మెరుపు అర్థశతకం సాధించి రాహుల్ తో సమఉజ్జీగా నిలిచాడు.

15 బంతుల్లో 50 పరుగులతో రెండో అత్యంత వేగవంతమైన అర్థశతకాలు బాదిన బ్యాటర్లలో యూసుఫ్ పఠాన్ ( 2014లో సన్ రైజర్స్ పైన), సునీల్ నరైన్ ( 2017 సీజన్లో బెంగళూరు పైన ), నికోలస్ పూరన్ ( 2023 సీజన్లో బెంగళూరు పైన ) ఉన్నారు.

ప్రస్తుత సీజన్ మిగిలిన 55 లీగ్, మూడు నాకౌట్ మ్యాచ్ ల్లో ఏ బ్యాటరైనా 13 బంతుల్లోనే అర్థశతకం సాధించగలడేమో వేచి చూడాల్సిందే.

First Published:  11 April 2023 10:31 AM IST
Next Story