Telugu Global
Sports

15 సెంచరీలు బాదినా విమర్శలా...విరాట్ రుసరుస!

విదేశీ టెస్టు సిరీస్ ల్లో 15 సెంచరీలు సాధించినా తన పైన విమర్శలేనా అంటూ భారత క్రికెట్ రన్ మెషీన్ విరాట్ కొహ్లీ మండి పడుతున్నాడు.

15 సెంచరీలు బాదినా విమర్శలా...విరాట్ రుసరుస!
X

విదేశీ టెస్టు సిరీస్ ల్లో 15 సెంచరీలు సాధించినా తన పైన విమర్శలేనా అంటూ భారత క్రికెట్ రన్ మెషీన్ విరాట్ కొహ్లీ మండి పడుతున్నాడు....

విదేశీగడ్డపై ఐదేళ్ల విరామం తర్వాత శతకం బాదిన సంతృప్తి స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీకి లేకుండాపోయింది. ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా పోర్ట్ ఆఫ్ స్పెయిన్ క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న రెండోటెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో విరాట్ 121 పరుగులతో ఓ కీలక శతకం సాధించాడు.

12 సంవత్సరాల తన టెస్టు జీవితంలో 110 టెస్టులు ఆడిన విరాట్ సాధించిన మొత్తం 29 సెంచరీలలో 15 విదేశీ గడ్డపైన, 14 స్వదేశంలోనూ ఉన్నాయి. అయితే..విదేశీగడ్డపై తన చిట్టచివరి సెంచరీని 2018 ఆస్ట్ర్రేలియా సిరీస్ లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన టెస్టులో విరాట్ సాధించాడు. ఆ తర్వాత ఐదేళ్లపాటు విదేశీగడ్డపైన విరాట్ కు టెస్టు శతకమే లేకుండాపోవడం విమర్శలకు తావిచ్చింది.

చిరస్మరణీయ సెంచరీ సాధించినా....!

విదేశీ టెస్టు సిరీస్ ల్లో శతకం కోసం గత ఐదేళ్లుగా ఎదురుచూసిన విరాట్..ఎట్టకేలకు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా సెంచరీ సాధించడం ద్వారా ఆలోటును తీర్చుకోగలిగాడు.

విదేశీగడ్డపై తన 15వ సెంచరీతో టెస్టు శతకాల సంఖ్యను 29కి పెంచుకోగలిగాడు. అయినా తనపైన విమర్శలు రావటాన్ని విరాట్ జీర్ణించుకోలేకపోతున్నాడు.

విదేశీ సిరీస్ ల్లో సెంచరీలు సాధించలేకపోతున్నానంటూ తనపైన విమర్శలు రావటాన్ని ఏమాత్రం భరించలేకపోతున్నాడు.

తాను సాధించిన టెస్టు శతకాలలో అత్యధికం విదేశీగడ్డపైనే ఉన్నాయని, తాను 50 పరుగులు చేసిన ప్రతిసారీ సెంచరీలు చేయాలని కోరుకొంటున్నారని, తాను 121 పరుగులు మాత్రమే సాధిస్తే డబుల్ సెంచరీ చేయలేకపోయానని అనుకొంటే చేయగలిగిందేమీలేదని, తన శక్తిమేరకు, జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ఆడుతూ వస్తున్నట్లు విరాట్ వివరించాడు.

విదేశీగడ్డపై అత్యధిక పరుగులు సాధించిన భారత కెప్టెన్ గా సౌరవ్ గంగూలీ పేరుతో ఉన్న రికార్డును విరాట్ గతంలోనే అధిగమించాడు. 19 టెస్టుల్లోనే 1731 పరుగులు సాధించడం ద్వారా ఈ ఘనతను సొంతం చేసుకోగలిగాడు.

110 టెస్టులు- 29 సెంచరీలు...

2011లో జమైకాలోని కింగ్స్ టన్ వేదికగా వెస్టిండీస్ ప్రత్యర్థిగా తన తొలిటెస్టుమ్యాచ్ ఆడిన విరాట్..గత 12 సంవత్సరాల కాలంలో 110 టెస్టులు ఆడి 29 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలతో సహా 8వేల 555 పరుగులు సాధించాడు.

మొత్తం 29 టెస్టు శతకాలలో 14 స్వదేశీ సిరీస్ లు, 15 విదేశీ సిరీస్ ల్లో సాధించినవే కావడం విశేషం.

ప్రస్తుతసిరీస్ లోని ఆఖరి టెస్టుమ్యాచ్ విరాట్ కెరియర్ లో 500వ అంత్జాతీయ మ్యాచ్ గా రికార్డుల్లో చేరింది. మొత్తం 500 మ్యాచ్ ల్లో 76 శతకాలు, 25వేల 582 పరుగులు నమోదు చేశాడు.

500 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో భాగంగా ఆడిన 559 ఇన్నింగ్స్ లో 76 శతకాలు, 131 అర్థశతకాలతో సహా 25వేల 582 పరుగులు సాధించాడు. 254 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరుతో 53. 63 సగటు నమోదు చేశాడు.

వచ్చే రెండు లేదా మూడేళ్లపాటు భారత్ కు విరాట్ సేవలు అందించే అవకాశం ఉంది. ఇప్పటికే 76 అంతర్జాతీయ శతకాలు బాదిన విరాట్ వచ్చే రెండేళ్ల కాలంలో మరో 25 శతకాలు సాధించగలిగితేనే..మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న 100 సెంచరీల ప్రపంచ రికార్డును అధిగమించగలుగుతాడు.

First Published:  23 July 2023 9:15 AM GMT
Next Story