హార్థిక్ పాండ్యాలో వాడివేడీ తగ్గిందా?
2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ దగ్గర పడుతున్నకొద్దీ భారత టీమ్ మేనేజ్ మెంట్ లో టెన్షన్ పెరిగిపోతోంది. ప్రధానంగా వైస్ కెప్టెన్ కమ్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా ఆటతీరు ఆందోళన కలిగిస్తోంది.
2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ దగ్గర పడుతున్నకొద్దీ భారత టీమ్ మేనేజ్ మెంట్ లో టెన్షన్ పెరిగిపోతోంది. ప్రధానంగా వైస్ కెప్టెన్ కమ్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా ఆటతీరు ఆందోళన కలిగిస్తోంది.....
ప్రపంచ క్రికెట్లో విజేతగా నిలవాలంటే ఆల్ రౌండర్లు అత్యుత్తమంగా రాణించడం అత్యంత ప్రధానం. భారత్ ఆతిథ్యంలో అక్టోబర్ లో జరిగే 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో విజేతగా నిలవాలని రోహిత్ సేన కలలు కంటోంది. 1983, 2011 వన్డే ప్రపంచకప్ టోర్నీలలో విజేతగా నిలిచిన తరువాత భారత్ మరో ప్రపంచకప్ విజయం కోసం ఎదురుచూస్తోంది.
స్వదేశీగడ్డపై జరిగే ప్రపంచకప్ లో విజేతగా నిలిచే సువర్ణఅవకాశం మరోసారి దక్కడంతో భారత టీమ్ మేనేజ్ మెంట్ పక్కాప్రణాళిలతో సిద్ధమవుతోంది. యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా, స్టార్ బ్యాటర్లు కెఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ లాంటి పలువురు కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరం కావడంతో ఇప్పుడు భారమంతా సీనియర్ స్టార్లు విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, హార్థిక్ పాండ్యాలపైన పడింది.
ప్రయోగాలే ప్రయోగాలు....
దీంతోపాటు ప్రతిభావంతులైన శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ , ముకేశ్ కుమార్ లాంటి పలువురు యువక్రికెటర్లకు సైతం తగిన అవకాశాలు కల్పిస్తూ వస్తోంది.
రెండోడౌన్ స్థానంలో కుదురైన బ్యాటర్ కోసం భారత టీమ్ మేనేజ్ మెంట్ ఇప్పటికే 10 మంది, మూడోడౌన్ ( నంబర్ 5 ) స్థానం లో 11 మంది వేర్వేరు బ్యాటర్లను ఆడించడం ద్వారా ప్రయోగాలు చేసినా ఫలితం లేకుండా పోయింది.
దీనికితోడు వైస్ కెప్టెన్ కమ్ పేస్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా ఆటతీరు అంతంత మాత్రంగానే తయారయ్యింది. పాండ్యా లాంటి కీలక ఆల్ రౌండర్ వరుస వైఫల్యాలు కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ల కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
వన్డే క్రికెట్లో వెలవెల......
గత రెండుసీజన్లుగా టీ-20 ఫార్మాట్లో గుజరాత్ టైటాన్స్ సారథిగా కళకళలాడిన హార్థిక్ పాండ్యా....వన్డే ఫార్మాట్లో మాత్రం వెలవెలబోతున్నాడు. ప్రస్తుత 2023 సీజన్లో కనీసం ఒక్కశతకమూ సాధించలేకపోయాడు.
వన్డేల్లో ఈ ఏడాది హార్థిక్ అత్యధిక సోరు 54 పరుగులు మాత్రమే. ప్రస్తుత వెస్టిండీస్ సిరీస్ లోని రెండోమ్యాచ్ వరకూ హార్దిక్ పాండ్యా ఆడిన 10 వన్డేలలో స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయాడు. పూనకం వచ్చినట్లు బ్యాటింగ్ చేస్తూ..బౌండ్రీలు, సిక్సర్లతో చెలరేగిపోయే హార్థిక్ 23.33 సగటుతో కేవలం 210 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
బార్బడోస్ వేదికగా వెస్టిండీస్ తో ఆడిన రెండుకు రెండు వన్డేలలోనూ హార్థిక్ 12 పరుగులకే పరిమితమయ్యాడు. మీడియా పేస్ బౌలర్ గా ఇప్పటికి 10 వికెట్లతో పర్వాలేదనిపించాడు.
గతంలో తనజట్టు ఎదురీదుతున్న తరుణంలో ఓర్పు, నేర్పుతో బ్యాటింగ్ చేస్తూ మ్యాచ్ విన్నర్ గా నిలిచిన హార్థిక్ గత ఏడాదిగా చెత్తషాట్లతో తక్కువ స్కోర్లకే అవుటవుతూ రావడం..మిడిలార్డర్లో భారత సమతూకాన్ని దారుణంగా దెబ్బతీస్తోంది.
76 వన్డేలలో 1596 పరుగులు...
ధర్మశాల వేదికగా ఏడేళ్ల క్రితం న్యూజిలాండ్ తో జరిగిన వన్డే ద్వారా అరంగేట్రం చేసిన హార్థిక్ ప్రస్తుత వెస్టిండీస్ సిరీస్ లోని రెండో వన్డే వరకూ 76 మ్యాచ్ లు ఆడి 1596 పరుగులు సాధించాడు. ఇందులో 9 హాఫ్ సెంచరీలు సైతం ఉన్నాయి.
అరంగేట్రం వన్డేలోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొన్న భారత నాలుగో క్రికెటర్ గా రికార్డుల్లో చోటు సంపాదించిన హార్థిక్ పాండ్యా త్వరలో జరిగే ఆసియాకప్ నాటికైనా ఫామ్ లోకి రాగలిగితే భారత వన్డే ప్రపంచకప్ విజయావకాశాలు మెరుగుపడతాయి.
భారత్ మూడోసారి వన్డే ప్రపంచకప్ విజేతగా నిలవాలంటే హార్థిక్ పాండ్యా టాప్ గేర్ లో రాణించక తప్పదు.