రోహిత్ వారసుడుగా హార్థిక్ పాండ్యా?
రోహిత్ వారసుడిగా భారతజట్టు పగ్గాలు హార్ధిక్ చేపట్టడం ఖాయమని క్రికెట్ వర్గాలు అంటున్నాయి...
వైట్ బాల్ క్రికెట్లో భారత తదుపరి కెప్టెన్ గా డాషింగ్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా పేరు గట్టిగా వినిపిస్తోంది. రోహిత్ వారసుడిగా భారతజట్టు పగ్గాలు హార్ధిక్ చేపట్టడం ఖాయమని క్రికెట్ వర్గాలు అంటున్నాయి...
భారత క్రికెట్లో మరోసారి కెప్టెన్సీ మార్పు గురించి చర్చ జరుగుతోంది. ప్రధానంగా టీ-20, వన్డే ఫార్మాట్లలో నాయకత్వం మార్పుపై గట్టిగానే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ వారసుడిగా హార్ధిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించే అవకాశం ఉందని బోర్డు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
వచ్చే ఏడాది భారత్ వేదికగా జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్, ఆ తర్వాత జరిగే టీ-20 ప్రపంచకప్ టోర్నీలలో పాల్గొనే భారతజట్టుకు నాయకత్వ మార్పు తప్పదని బోర్డువర్గాలు అంటున్నాయి.
ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన 2022 టీ-20 ప్రపంచకప్ సెమీస్ లో భారత్ దారుణంగా విఫలం కావడం, ఇటీవలే బంగ్లాతో జరిగిన వన్డే సిరీస్ లో భారత్ 1-2తో ఓటమి పొందటంతో కెప్టెన్ గా రోహిత్ శర్మను పక్కన పెట్టాలన్న వాదన బలం పుంజుకొంది.
హార్థిక్ పాండ్యా వైపే చూపు..
కేవలం తన నాయకత్వ ప్రతిభ, ఆల్ రౌండ్ నైపుణ్యంతో గుజరాత్ టైటాన్స్ ను విజేతగా నిలిపిన పేస్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా పైనే బీసీసీఐ దృష్టి కేంద్రీకరించింది. 2022 ఐపీఎల్ లో పాండ్యా 15 మ్యాచ్ లు ఆడి 44.27 సగటుతో 487 పరుగులు సాధించాడు. 4 హాఫ్ సెంచరీలతో పాటు 8 వికెట్లు పడగొట్టడం ద్వారా తనజట్టు విజయంలో ప్రధానపాత్ర వహించాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన స్వదేశీ సిరీస్ లో భారత్ కు వైస్ కెప్టెన్ గా కూడా పాండ్యా బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ తర్వాత ఐర్లాండ్ తో జరిగిన రెండుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో నాయకత్వం వహించడమే కాదు 2-0తో సిరీస్ విజయం అందించాడు.
వెస్టిండీస్ తో జరిగిన ఐదుమ్యాచ్ ల సిరీస్ లో వైస్ కెప్టెన్ గా నిలిచాడు. న్యూజిలాండ్ తో జరిగిన టీ-20 సిరీస్ లో కెప్టెన్ గా 1-0తో విజయం అందించిన ఘనత హార్ధిక్ పాండ్యాకు ఉంది. ప్రపంచకప్ లోనూ పాండ్యా ఆల్ రౌండర్ గా తన సత్తా చాటుకోగలిగాడు.
2022 సీజన్లో పాండ్యా షో....
ప్రస్తుత 2022 సీజన్లో పాండ్యా మొత్తం 27 మ్యాచ్ ల్లో 25 ఇన్నింగ్స్ ఆడి 33.72 సగటుతో 607 పరుగులు సాధించాడు. ఇందులో 71 పరుగుల నాటౌట్ స్కోరుతో సహా మూడు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. మొత్తం 20 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 6 వికెట్లు సాధించాడు.
హార్ధిక్ పాండ్యా గణాంకాలు, ఆల్ రౌండర్ గా పోషిస్తున్న పాత్ర, వయసును దృష్టిలో ఉంచుకొని నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పాలని బోర్డు భావిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే పాండ్యాతో బోర్డు ప్రతినిధులు సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే..పాండ్యా మాత్రం ఆలోచించి తన నిర్ణయం చెబుతానన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుత భారత్ క్రికెట్లో ..ప్రధానంగా వన్డే, టీ-20 ఫార్మాట్లలో హార్ధిక్ పాండ్యాను మించిన నాయకుడు మరొకరు లేరంటే ఆశ్చర్యం లేదు. అయితే..2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు రోహిత్ ను కాదని పాండ్యాకు కెప్టెన్సీ ఎంత వరకూ ఇస్తారన్నది అనుమానమే.