Telugu Global
Sports

బంగ్లాపై భారత్‌ ఘన విజయం

సెంచరీతో బ్యాటింగ్‌లో.... ఆరు వికెట్లు తీసి బౌలింగ్‌లో అదరగొట్టిన అశ్విన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌

బంగ్లాపై భారత్‌ ఘన విజయం
X

బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 515 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన బంగ్లాదేశ్‌ 234 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌ 280 పరుగుల తేడాతో గెలుపొందింది. నజ్ముల్‌ హుస్సేన్‌ శాంటో 82 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో అశ్విన్‌ 6, జడేజా 3, బూమ్రా 1 వికెట్‌ తీశారు. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 376, బంగ్లాదేశ్‌ 149 పరుగులు, రెండో ఇన్సింగ్స్‌లో భారత్‌ 287 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

లోకల్‌ బాయ్‌ ఎంట్రీతో మారిన సీన్‌

అంతకుముందు ఓవర్‌నైట్‌ 158 /4 స్కోర్‌తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్‌ను కెప్టెన్‌ షాంటోతో కలిసి షకిబ్‌ అల్‌ హసన (25) కొద్దిసేపు అడ్డుకోగలిగారు. వీరిద్దరూ ఐదో వికెట్‌ 48 రన్స్‌ జోడించారు. లోకల్‌బాయ్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ రంగంలోకి దిగడంతో భారత్‌కు వికెట్లు పడటం మొదలైంది. షకిబ్‌ను ఔట్‌ చేసిన అశ్విన్‌ నాలుగోరోజు వికెట్ల వేటలో విజృంభించాడు. జడేజా అద్భుతమైన బాల్‌కు లిటన్‌ దాస్‌ (1)ను బోల్తా కొట్టించాడు. చివరి ఆరు వికెట్లలో అశ్విన్‌, జడేజా తలో మూడు వికెట్లు తీశారు. లంచ్‌ బ్రేక్‌ లోపే బంగ్లాను ఆలౌట్‌ చేశారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌ నిలిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీతో పాటు ఆరు వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఘనత సాధించాడు. అశ్విన్‌ ఇప్పటివరకు టెస్టుల్లో 37 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.

రెండో టెస్ట్‌కూ ఇదే జట్టు: బీసీసీఐ

తాజా విజయంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టెస్ట్‌ సెప్టెంబర్‌ 27 నుంచి కాన్పూర్‌ వేదిగా ప్రారంభం కానున్నది. మరోవైపు రెండోటెస్ట్‌లోనూ ఎలాంటి మార్పులు లేకుండా ఇదే జట్టుతో టీమిండియా బరిలోకి దిగుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు 'ఎక్స్‌' లో పోస్టు చేసింది.

First Published:  22 Sept 2024 1:13 PM IST
Next Story