Telugu Global
Sports

ప్రపంచహాకీ ఫైనల్లో జర్మనీ, బెల్జియం!

హాకీ పురుషుల ప్రపంచకప్ టైటిల్ సమరానికి డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం, మాజీ చాంపియన్ జర్మనీ అర్హత సంపాదించాయి. మూడుసార్లు విజేత, హాట్ ఫేవరెట్ పోరు సెమీఫైనల్లోనే ముగిసింది.

ప్రపంచహాకీ ఫైనల్లో జర్మనీ, బెల్జియం!
X

హాకీ పురుషుల ప్రపంచకప్ టైటిల్ సమరానికి డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం, మాజీ చాంపియన్ జర్మనీ అర్హత సంపాదించాయి. మూడుసార్లు విజేత, హాట్ ఫేవరెట్ పోరు సెమీఫైనల్లోనే ముగిసింది.

భారత్ వేదికగా నాలుగోసారి జరుగుతున్న ప్రపంచకప్ హాకీ ( 2023 ) సమరం ముగింపు దశకు చేరింది. నాలుగు అగ్రశ్రేణిజట్ల సెమీఫైనల్స్ నాకౌట్ సమరం సైతం ముగియటంతో టైటిల్ సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

ఆస్ట్ర్రేలియాకు జర్మనీ షాక్....

భువనేశ్వర్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన సెమీఫైనల్స్ అంచనాలకు అందని విధంగా హోరాహోరీగా సాగాయి. డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం స్థాయికి తగ్గట్టుగా ఆడి వరుసగా ఫైనల్స్ కు అర్హత సంపాదించగా..మూడుసార్లు విజేత, 12సార్లు సెమీఫైనలిస్ట్ ఆస్ట్ర్రేలియా సెమీఫైనల్లోనే విఫలమయ్యింది.

లీగ్ దశలో అర్జెంటీనా, క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ జట్లను ఓడించడానికి నానాపాట్లు పడిన ఆస్ట్ర్రేలియాను తొలిసెమీఫైనల్లో జర్మనీ 4-3 గోల్స్ తేడాతో కంగుతినిపించింది.

గతంలో రెండుసార్లు ప్రపంచ టైటిల్ నెగ్గిన జర్మనీ 13 సంవత్సరాల సుదీర్ఘవిరామం తర్వాత తిరిగి టైటిల్ సమరానికి అర్హత సంపాదించగలిగింది.

జర్మన్ గోంజాలో పిల్లాట్ హ్యాట్రిక్ సాధించడం ద్వారా సంచలన సృష్టించాడు. జర్మనీలో పుట్టి గతంలో అర్జెంటీనాకు ఆడిన గోంజాలో ఇటీవలే జర్మన్ పౌరసత్వం స్వీకరించడం ద్వారా జాతీయజట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

బెల్జియం షూట్..నెదర్లాండ్స్ అవుట్..

హోరాహోరీగా సాగిన రెండో సెమీఫైనల్లో నెదర్లాండ్స్ ను పెనాల్టీషూటౌట్ ద్వారా డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం కంగుతినిపించింది. ఆట నిర్ణితసమయంలో రెండుజట్లు చెరో రెండుగోల్సు చేయటంతో మ్యాచ్ 2-2తో ముగిసింది.

విజేతను నిర్ణయించటానికి పెనాల్టీ షూటౌట్ పాటించారు. బెల్జియం గోల్ కీపర్ వాంచ్ అసాధారణంగా రాణించి డచ్ పెనాల్టీలను అడ్డుకొన్నాడు. చివరకు బెల్జియం 3-2 గోల్స్ తో నెదర్లాండ్స్ ను అధిగమించడం ద్వారా వరుసగా రెండోసారి ప్రపంచకప్ ఫైనల్స్ కు చేరుకోగలిగింది.

ఆదివారం భువనేశ్వర్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగే టైటిల్ సమరంలో బెల్జియం, జర్మనీ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

మూడు, నాలుగుస్థానాల కోసం జరిగే పోరులో నెదర్లాండ్స్ , ఆస్ట్ర్ర్రేలియా తలపడతాయి.

ఆతిథ్య భారతజట్టు 9 నుంచి 12 స్థానాల వర్గీకరణ పోరులో దక్షిణాఫ్రికాతో పోటీపడనుంది.

First Published:  28 Jan 2023 2:52 PM IST
Next Story