Telugu Global
Sports

ప్రపంచకప్ లో నేటినుంచి ఆఖరిరౌండ్ సూపర్..ఫైట్స్!

టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ ఆఖరి రౌండ్ సమరం క్లైమాక్స్ దశకు చేరింది. టోర్నీ 15 సంవత్సరాల చరిత్రలోనే ఎన్నడూలేనంత ఉత్కంఠదశకు చేరింది.

ప్రపంచకప్ లో నేటినుంచి ఆఖరిరౌండ్ సూపర్..ఫైట్స్!
X

టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ ఆఖరి రౌండ్ సమరం క్లైమాక్స్ దశకు చేరింది. టోర్నీ 15 సంవత్సరాల చరిత్రలోనే ఎన్నడూలేనంత ఉత్కంఠదశకు చేరింది.

ప్రపంచ చాంపియన్, ఆతిథ్య ఆస్ట్ర్రేలియా, మాజీ చాంపియన్ పాక్ జట్లు సూపర్-12 రౌండ్ నుంచే నిష్క్ర్రమించే ప్రమాదంలో పడ్డాయి...

ప్రపంచక్రికెట్ అభిమానులను గత కొద్దివారాలుగా అలరిస్తూ వస్తున్న 2022 టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 సమరం పతాకస్థాయికి చేరింది. మొత్తం 12జట్ల సూపర్-12 గ్రూప్ పోరు ఆఖరిరౌండ్ దశకు చేరడంతో మరింత ఆసక్తికరంగా మారింది. గతంలో ఎన్నడూలేనంత ఉత్కంఠభరిత స్థితికి చేరింది.

ఒకేఒక జట్టు న్యూజిలాండ్...

ప్రస్తుత ప్రపంచకప్ సూపర్ -12 గ్రూప్ -1 నుంచి సెమీస్ కు అర్హత సాధించిన ఒకే ఒక్కజట్టు ఘనతను గత ఏడాది రన్నరప్ న్యూజిలాండ్ దక్కించుకొంది. ఇంగ్లండ్, ఆస్ట్ర్రేలియా, శ్రీలంక, అప్ఘనిస్థాన్, ఐర్లాండ్ జట్లతో కూడిన గ్రూపులో న్యూజిలాండ్ మూడు విజయాలు, ఓ ఓటమితో మొత్తం 7 పాయింట్లు సాధించడం ద్వారా నేరుగా సెమీస్ కు చేరుకొన్న తొలిజట్టుగా నిలిచింది.

ఆతిథ్య ఆస్ట్ర్రేలియా సైతం 5 రౌండ్లలో 7 పాయింట్లు సాధించినా..నెట్ రన్ రేట్ లో ఎంతగానో వెనుకబడి ఉంది. మరోవైపు మాజీ చాంపియన్లు ఇంగ్లండ్, శ్రీలంక సైతం సెమీస్ బెర్త్ ల రేస్ లో నిలిచాయి.

ఇప్పటి వరకూ 4 రౌండ్లు ఆడి 5 పాయింట్లతో ఇంగ్లండ్, 4 పాయింట్లతో శ్రీలంక నిలవడం ద్వారా...నేడు జరిగే ఆఖరిరౌండ్ పోరులో అమీతుమీకి సిద్ధమయ్యాయి.

ఇంగ్లండ్ నెగ్గితే ఆసీస్, శ్రీలంక అవుట్..

సిడ్నీ క్రికెట్ స్టేడియం వేదికగా ఈరోజు జరిగే డూ ఆర్ డై సమరంలో శ్రీలంకను ఇంగ్లండ్ ఓడించగలిగితే నేరుగా సెమీస్ చేరుకోగలుగుతుంది. మరో విజయం సాధించగలిగితే...ఇంగ్లండ్ సైతం 7 పాయింట్లతో న్యూజిలాండ్, ఆస్ట్ర్లేలియాజట్లతో సమఉజ్జీగా నిలువగలుగుతుంది. ఆస్ట్ర్రేలియా కంటే ఇప్పటికే నెట్ రన్ రేట్ లో మెరుగైన స్థితిలో ఉన్న ఇంగ్లండ్ సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోగలుగుతుంది.

ఒకవేళ శ్రీలంక సంచలన విజయం సాధిస్తే...ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్ర్రమించక తప్పదు. అప్పుడు ఆతిథ్య ఆస్ట్ర్రేలియా గ్రూప్ రన్నరప్ గా సెమీస్ బెర్త్ దక్కించుకోగలుగుతుంది.

గ్రూప్ -2లోనూ అదే సీన్...

మరోవైపు..భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ జట్లతో కూడిన గ్రూప్ -2 సూపర్-12 రౌండ్లో సైతం పరిస్థితి అదే విధంగా ఉంది. గ్రూపు మొదటి నాలుగు రౌండ్ మ్యాచ్ లు ముగిసే సమయానికి భారత్, దక్షిణాఫ్రికా, పాక్ జట్లు 6, 5, 4 పాయింట్ల చొప్పున సాధించి మొదటి మూడుస్థానాలలో కొనసాగుతున్నాయి.

ఆదివారం జరిగే ఆఖరిరౌండ్ మ్యాచ్ ల్లో జింబాబ్వేను భారత్, నెదర్లాండ్స్ ను దక్షిణాఫ్రికాజట్లు ఓడించగలిగితే...మాజీ చాంపియన్ పాకిస్థాన్ ఇంటిదారి పట్టక తప్పదు.

ఆఖరి రౌండ్ పోటీలలో భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాజట్లు తమతమ మ్యాచ్ ల్లో నెగ్గితీరక తప్పదు. బంగ్లాదేశ్ తో జరిగే తన ఆఖరిరౌండ్ పోరులో పాక్ జట్టు నెగ్గినా..గ్రూపులోని మగిలిన రెండు ఆఖరిరౌండ్ మ్యాచ్ ల ఫలితాలపైనే సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

ప్రస్తుత చాంపియన్ ఆస్ట్ర్రేలియా, మాజీ చాంపియన్ పాకిస్థాన్ సూపర్-12 రౌండ్ నుంచే నిష్క్ర్రమిస్తే...2022 ప్రపంచచకప్ కే అతిపెద్ద హైలైట్స్ గా మిగిలిపోతాయి..

First Published:  5 Nov 2022 5:48 AM GMT
Next Story