Telugu Global
Sports

పారిస్ ఒలింపిక్స్ కు నలుగురు తెలుగమ్మాయిలు!

పారిస్ ఒలింపిక్స్ లో తొలిసారిగా నలుగురు తెలుగమ్మాయిలు పాల్గొనబోతున్నారు. 125 మంది సభ్యుల భారత బృందంలో ఆరుగురు తెలుగు రాష్ట్ర్రాల క్రీడాకారులకు చోటు దక్కింది.

పారిస్ ఒలింపిక్స్ కు నలుగురు తెలుగమ్మాయిలు!
X

పారిస్ ఒలింపిక్స్ లో తొలిసారిగా నలుగురు తెలుగమ్మాయిలు పాల్గొనబోతున్నారు. 125 మంది సభ్యుల భారత బృందంలో ఆరుగురు తెలుగు రాష్ట్ర్రాల క్రీడాకారులకు చోటు దక్కింది.

ప్రపంచ క్రీడల పండుగ 2024- ఒలింపిక్స్ కు పారిస్ వేదికగా సన్నాహాలు పూర్తయ్యాయి. జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకూ జరిగే ఈ క్రీడాసంరంభంలో 204 దేశాలకు చెందిన 10వేల మంది అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. భారత్ నుంచి 125మందికి పైగా అథ్లెట్లు బరిలో నిలువనున్నారు.

ఇద్దరు పురుషులు..నలుగురు మహిళలు!

వివిధ క్రీడాంశాలలో పాల్గొనటానికి అర్హత సాధించిన భారత అథ్లెట్లలో అరడజనుమంది తెలుగు రాష్ట్ర్రాల అథ్లెట్లు ఉండటం విశేషం. పురుషుల, మహిళల బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ విభాగాలలో నలుగురు, బాక్సింగ్, అథ్లెటిక్స్ విభాగాలలో ఒక్కొక్కరు పోటీకి దిగబోతున్నారు.

మొత్తం ఆరుగురు తెలుగు అథ్లెట్లలో నలుగురు ఏదో ఒక పతకంతో తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో మహారాష్ట్ర్రకు చెందిన చిరాగ్ షెట్టితో జంటగా పోటీకి దిగబోతున్న సాత్విక్ సాయిరాజ్ పతకంతో తిరిగరావడం ఖాయమని భావిస్తున్నారు.

గత రెండేళ్లకాలంలో ప్రపంచ బ్యాడ్మింటన్ కాంస్యం, కామన్వెల్త్ గేమ్స్, ఆసియాక్రీడల బంగారు పతకాలతో పాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను సతం సాధించిన సాత్విక్ సాయిరాజ్ జోడీ కాస్త అదృష్టంతో పాటు స్థాయికి తగ్గట్టుగా ఆడితే బంగారు పతకం సాధించడం ఏమాత్రం కష్టం కాబోదు. ప్రస్తుతం ప్రపంచ 3వ ర్యాంక్ జోడీగా ఉన్న సాత్విక్- చిరాగ్ ల జోడీ గత ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్స్ చేరడంలో విఫలమయ్యారు.

మూడో పతకానికి సింధు తహతహ....

ఒలింపిక్స్ బరిలో నిలవడం, పతకాలు సాధించడం తెలుగుతేజం పీవీ సింధుకు కొత్తేమీ కాదు. తన క్రీడాజీవితంలో చివరిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగుతున్న సింధుకు 2016 రియో ఒలింపిక్స్ లో రజత, 2020 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన ఘనత ఉంది. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో రెండు పతకాలు సాధించిన తొలి, ఏకైక భారత మహిళగా నిలిచిన సింధు మరో పతకంతో తన ఒలింపిక్ ప్రస్థానానికి స్వస్తి పలకాలని ఆశపడుతోంది.

స్వర్ణానికి నిఖత్ జరీన్ గురి...

మహిళల బాక్సింగ్ లో తెలంగాణా థండర్ బాక్సర్ నిఖత్ జరీన్ 50 కిలోల విభాగంలో స్వర్ణపతకం సాధించడం ఖాయమని భారత బృందం భావిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు ప్రపంచ చాంపియన్ టైటిల్స్ సంపాదించిన నిఖత్ ప్రస్తుతం జర్మనీలోని సార్ బ్రూకెన్ శిక్షణ శిబిరంలో గత నెలరోజులుగా సాధన చేస్తోంది. ఒలింపిక్స్ పతకంతో తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న నిఖత్ ను ఏదో ఒక పతకం తప్పక సాధించే భారత అథ్లెట్లలో ఒకరిగా పరిగణిస్తున్నారు.

ఒకే ఒక్క తెలుగు అథ్లెట్!

పారిస్ ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలలో పాల్గొనే 28 మంది సభ్యుల భారతజట్టులో సాధించిన ఏకైక తెలుగు మహిళగా విశాఖరన్నర్ జ్యోతి యర్రాజీ రికార్డు నెలకొల్పింది. మహిళల 100 మీటర్ల హర్డల్స్ రేస్ లో భారత్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న తొలి మహిళా అథ్లెట్ గా జ్యోతి చరిత్ర సృష్టించనుంది.

ఒలింపిక్స్ ట్రాక్ లోకి దిగుతున్న 11 మంది భారత మహిళా అథ్లెట్లలో 23 ఏళ్ల జ్యోతి యర్రాజీ సైతం ఒకరిగా నిలిచింది.

ఉక్కునగరం విశాఖపట్నం నుంచి భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ లోకి దూసుకొచ్చిన జ్యోతి తన ప్రపంచ ర్యాంకింగ్ ఆధారంగా పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనటానికి అర్హత సంపాదించింది. భువనేశ్వర్ లోని రిలయన్స్ అథ్లెటిక్స్ అకాడమీలో విదేశీ శిక్షకుల పర్యవేక్షణలో సాధన చేసిన జ్యోతికి పతకం అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

టేబుల్ టెన్నిస్ లో శ్రీజ ఆకుల...

భారత మహిళా టేబుల్ టెన్నిస్ లో అత్యుత్తమ ర్యాంకర్ గా నిలిచిన హైదరాబాదీ ప్లేయర్ శ్రీజ ఆకుల తొలిసారిగా పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనటానికి అర్హత సాధించడం ద్వారా గాల్లో తేలిపోతోంది.

వ్యక్తిగత, టీమ్ అంశాలలో శ్రీజ తన అదృష్టం పరీక్షించుకోనుంది. ప్రపంచ టేబుల్ టెన్నిస్ సమాఖ్య తాజా ర్యాంకింగ్స్ ప్రకారం 24వ స్థానంలో నిలిచిన 25 ఏళ్ల శ్రీజకు గతంలోనే కామన్వెల్త్ గేమ్స్ లో మిక్సిడ్ డబుల్స్ లో బంగారు పతకం సాధించిన రికార్డు ఉంది. గత కొద్దిమాసాలుగా పలు అంతర్జాతీయ టోర్నీలలో పాల్గొని సంచలన విజయాలు సాధించిన శ్రీజ భారీఅంచనాలతో ఒలింపిక్స్ పతకం వేటకు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యింది.

శరత్ కమల్ కు అరుదైన గౌరవం...

పారిస్ వేదికగా జరిగే ఒలింపిక్స్ ప్రారంభవేడుకల్లో పాల్గొనే భారత బృందానికి పీవీ సింధుతో కలసి ఆచంట శరత్ కమల్ పతాకధారిగా వ్యవహరించనున్నాడు. 41 ఏళ్ల వయసులో ఈ అరుదైన గౌరవం దక్కించుకొన్నాడు....

తన క్రీడాజీవితంలో ఆఖరి ఒలింపిక్స్ లో పాల్గొంటున్న 41 ఏళ్ల శరత్ కమల్ కు ఒలింపిక్స్ లో పాల్గొనడం ఇది ఆరోసారి.పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించినా వృత్తిరీత్యా చెన్నైలో స్థిరపడిన శరత్ కమల్ కు గత రెండుదశాబ్దాలుగా భారత్ కు పలు అంతర్జాతీయ క్రీడల్లో ప్రాతినిథ్యం వహించిన ఘనమైన రికార్డు ఉంది.

2004 నుంచి 2024 వరకూ...

2004 ఏథెన్స్ ఒలింపిక్స్ కు తొలిసారిగా అర్హత సాధించిన శరత్.. గత రెండు దశాబ్దాలుగా 2008 బీజింగ్, 2016 రియో ఒలింపిక్స్, 2020 టోక్యో ఒలింపిక్స్ల్ లో సైతం భారత్ కు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పుడు నాలుగు పదుల వయసులో పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనడం ద్వారా ఐదు వేర్వేరు ఒలింపిక్స్ లో పాల్గొన్న క్రీడాకారుడిగా అరుదైన గౌరవాన్ని దక్కించుకోబోతున్నాడు.

పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనబోతున్న ఆరుగురు తెలుగు రాష్ట్ర్రాల అథ్లెట్లు అత్యుత్తమంగా రాణించడం ద్వారా దేశానికి పతకాలు అందించడంతో పాటు ఉభయ తెలుగు రాష్ట్ర్రాలకు గర్వకారణంగా నిలవాలన్న పట్టుదలతో ఉన్నారు.

First Published:  13 July 2024 6:04 PM IST
Next Story