Telugu Global
Sports

ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ రేసులో నలుగురు భారత గ్రాండ్మాస్టర్లు!

ప్రపంచ క్యాండిడేట్స్ పురుషుల, మహిళల చదరంగ పోరులో తొలిసారిగా భారత్ కు చెందిన నలుగురు యువగ్రాండ్మాస్టర్లు బరిలోకి దిగబోతున్నారు.

ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ రేసులో నలుగురు భారత గ్రాండ్మాస్టర్లు!
X

ప్రపంచ క్యాండిడేట్స్ పురుషుల, మహిళల చదరంగ పోరులో తొలిసారిగా భారత్ కు చెందిన నలుగురు యువగ్రాండ్మాస్టర్లు బరిలోకి దిగబోతున్నారు.

ప్రపంచ చదరగం పురుషుల, మహిళా చాంపియన్లతో జరిగే టైటిల్ పోరుకు అర్హతగా...అంతర్జాతీయ చదరంగ సమాఖ్య నిర్వహించే 2024- ప్రపంచ క్యాండిడేట్స్ పోరుకు భారత్ కు చెందిన నలుగురు యువగ్రాండ్మాస్టర్లు అర్హత సాధించారు. భారత చదరంగ చరిత్రలో నలుగురు గ్రాండ్మాస్టర్లు క్యాండిడేట్స్ పోరుకు అర్హత సాధించడం ఇదే మొదటిసారి.

క్యాండిడేట్స్ రేస్ లో లేని కార్ల్ సన్....

నార్వేకు చెందిన ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ చదరంగ ఆటగాడు మాగ్నుస్ కార్ల్ సన్...టొరాంటో వేదికగా జరిగే 2024 ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో పాల్గొనబోనని అధికారికంగా ప్రకటించాడు.

గతేడాది జరిగిన ప్రపంచకప్ చెస్ టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా టాప్ ర్యాంకర్ కార్ల్ సన్ ...క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సంపాదించాడు. అయితే...క్యాండిడేట్స్ టోర్నీలో పాల్గొనాలన్న కోరిక తనకు లేదని, క్యాండిడేట్స్ రేస్ నుంచి తాను వైదొలగుతున్నట్లు ప్రకటించాడు.

దీంతో..కార్ల్ సన్ కు బదులుగా గ్రాండ్మాస్టర్ నిజత్ అబసోవ్ పోటీకి దిగుతాడని అంతర్జాతీయ చెస్ సమాఖ్య ప్రకటించింది. క్యాండిడేట్స్ టోర్నీలో తలపడే మొత్తం ఎనిమిది మంది గ్రాండ్మాస్టర్ల జాబితాను విడుదల చేసింది.

8 మందిలో ముగ్గురు భారత గ్రాండ్మాస్టర్లు...

ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే ) ప్రకటించిన 8 మంది క్యాండిడేట్స్ పురుషుల ఫైనల్స్ జాబితాలో తొలిసారిగా ముగ్గురు భారత యువగ్రాండ్ మాస్టర్లు చోటు సంపాదించారు.

వీరిలో 2023 ప్రపంచకప్ రన్నరప్ ప్రజ్ఞానంద్, స్విస్ గ్రాండ్ మాస్టర్ టోర్నీ విన్నర్ విదిత్ గుజరాతీ, ఫిడే సర్క్యూట్ విన్నర్ గుకేశ్ ఉన్నారు. భారత చదరంగ చరిత్రలో ఒకేసారి ముగ్గురు గ్రాండ్ మాస్టర్లు ప్రపంచ క్యాండిడేట్స్ టోర్నీ ఫైనల్స్ కు అర్హత సాధించడం ఇదే మొదటిసారి.

మిగిలిన ఐదుగురు విదేశీ గ్రాండ్ మాస్టర్లలో ఇయాన్ నెపోమినియాచ్చీ, ప్రపంచకప్ లో మూడో స్థానంలో నిలిచిన ఫేబియానో కరూనా, 4వ స్థానం సాధించిన నిజత్ అబ్సోవ్, గ్రాండ్ స్విస్ టోర్నీ రన్నరప్ హికారు నకామురా, బెస్ట్ రేటింగ్ ప్లేయర్ అలీరెజా ఫిరోజా ఉన్నారు.

ఈ ఎనిమిదిమంది గ్రాండ్మాస్టర్ల నడుమ జరిగే క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచిన ఆటగాడికి ప్రస్తుత ప్రపంచ చాంపియన్, చైనా సూపర్ గ్రాండ్మాస్టర్ డింగ్ లీరెన్ తో తలపడే అవకాశం దక్కుతుంది. 2024 ప్రపంచ చెస్ టైటిల్ పోరు ఏప్రిల్ లో జరుగనుంది.

మహిళల క్యాండిడేట్స్ ఫైనల్స్ కు అర్హత సాధించిన వారిలో భారత మహిళా గ్రాండ్మాస్టర్ వైశాలీ రమేశ్ బాబు సైతం ఉంది. సీనియర్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపికి సైతం రేటింగ్ ప్రకారం పోటీపడే అవకాశం లేకపోలేదు.

మొత్తం మీద..పురుషుల, మహిళల విభాగాలలో భారత్ కు చెందిన నలుగురు యువగ్రాండ్మాస్టర్లు ప్రపంచ క్యాండిడేట్స్ పురుషుల, మహిళల టోర్నీలలో తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నారు.

First Published:  15 Jan 2024 3:32 PM IST
Next Story