15 ఏళ్లుగా అదే చేస్తున్నా...విరాట్ కొహ్లీ!
మూడురోజుల్లో రెండు వన్డే మ్యాచ్ లు ఆడటం తనకు అలవాటేనని భారత సూపర్ ఫిట్ స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ చెప్పాడు.
మూడురోజుల్లో రెండు వన్డే మ్యాచ్ లు ఆడటం తనకు అలవాటేనని భారత సూపర్ ఫిట్ స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ చెప్పాడు. వన్డే ఫార్మాట్లో 47వ శతకంతో పాటు..అత్యంత వేగంగా 13వేల పరుగుల రికార్డు సాధించిన మొనగాడిగా విరాట్ నిలిచాడు.
కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన ఆసియాకప్ సూపర్ -4 రౌండ్ పోరులో భారత పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ పరుగుల హోరుతో రికార్డుల జోరు కొనసాగించాడు. 122 పరుగుల నాటౌట్ స్కోరుతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
పాకిస్థాన్ పై విజయం సాధించిన 12 గంటల విరామంలోనే శ్రీలంకతో పోటీపడాల్సి రావడం మిగిలిన ఆటగాళ్లకు కష్టమేనని కొందరు భావిస్తుంటే...విరాట్ కొహ్లీ మాత్రం అందులో కష్టం ఏమీలేదని, గత 15 సంవత్సరాలుగా తాను అదే చేస్తున్నానని చెప్పాడు.
సాంప్రదాయ టెస్టు క్రికెట్ ఆడుతుంటే..వరుసగా ఐదురోజులపాటు ఫీల్డ్ లో ఉండాల్సి వస్తుందని, టెస్టులు ఆడేవారికి మూడురోజుల్లో రెండు వన్డే మ్యాచ్ లు ఆడే సత్తా, ఓపిక ఉంటాయని విరాట్ వివరించాడు.
విరాట్ విలక్షణ శతకం....
విరాట్ కొహ్లీ బ్యాట్ పట్టుకొని క్రీజులోకి దిగితే పరుగులు సాధించడానికి ఇంతగా శ్రమించాలా అనిపిస్తుంది. వన్డే క్రికెట్లో విరాట్ సాధించిన 47 శతకాల తీరు ఒకేలా ఉంటుంది. ఫోర్లు, సిక్సర్లు తక్కువగానూ..సింగిల్స్, డబుల్స్ ఎక్కువగానూ ఉంటాయి.
తన పార్ట్నర్ తో కలసి స్ట్ర్రయిక్ రొటేట్ చేస్తూ..వికెట్ల మధ్య చురుకుగా పరుగెడుతూ స్కోరుబోర్డును పరుగులెత్తించడం విరాట్ కు బ్యాట్ తో అబ్బినవిద్య. వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 13వేల పరుగుల మైలురాయిని చేరిన మొనగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పిన విరాట్ ..తన 47వ శతకం పూర్తి చేయటానికి 94 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. 122 పరుగుల స్కోరుతో నాటౌట్ గా నిలిచాడు.
తాను ఎదుర్కొన్న మొదటి 55 బంతుల్లో 50 పరుగులు సాధించిన విరాట్..ఆ తర్వాతి 39 బంతుల్లోనే 72 పరుగులు జమ చేశాడు. మొత్తం 122 పరుగుల నాటౌట్ స్కోరుతో తన వన్డే కెరియర్ లో 47వ శతకాన్ని సాధించగలిగాడు.
ఇప్పటి వరకూ మాస్టర్ సచిన్ పేరుతో ఉన్న అత్యంతవేగంగా 13వేల పరుగుల ప్రపంచ రికార్డును విరాట్ అధిగమించాడు. మరో మూడు శతకాలు బాదగలిగితే..
సచిన్ పేరుతోనే ఉన్న 49 సెంచరీల ప్రపంచ రికార్డును తెరమరుగు చేయగలుగుతాడు.
గాయంతో గత ఐదుమాసాలుగా క్రికెట్ కు దూరంగా ఉన్న కెఎల్ రాహుల్ తన పునరాగమన మ్యాచ్ లోనే 111 పరుగులతో మెరుపుశతకం సాధించాడు. విరాట్ తో కలసి 3వ వికెట్ కు అజేయ డబుల్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు. భారత్ 2 వికెట్ల నష్టానికే 356 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. పాకిస్థాన్ ప్రత్యర్థిగా వన్డేలలో భారత్ కు అదే అత్యధికస్కోరు కావడం విశేషం.
భారత బౌలర్లలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు పడగొట్టడంతో పాకిస్థాన్ కుప్పకూలి..228 పరుగుల ఘోరపరాజయం చవిచూసింది.