Telugu Global
Sports

ఇంగ్లండ్ అవుట్, సెమీఫైనల్లో ఫ్రాన్స్!

ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ వరుసగా రెండోసారి చేరుకొంది. ఆఖరి క్వార్టర్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్ ను 2-1 గోల్స్ తో అధిగమించింది.

FIFA World Cup 2022: England out, France in the semifinals!
X

ఇంగ్లండ్ అవుట్, సెమీఫైనల్లో ఫ్రాన్స్!

ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ వరుసగా రెండోసారి చేరుకొంది. ఆఖరి క్వార్టర్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్ ను 2-1 గోల్స్ తో అధిగమించింది.

ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో వరుసగా రెండుసార్లు టైటిల్స్ నెగ్గిన రెండోజట్టుగా నిలవాలని ప్రస్తుత చాంపియన్ ఫ్రాన్స్ తహతహలాడుతోంది. ఆఖరి క్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొని 2-1 గోల్స్ తో సెమీఫైనల్లో అడుగుపెట్టింది.

ఫ్రెంచ్ హీరో గిరౌడ్...

ఖతర్ రాజధాని దోహాలోని అల్ బైట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ సమఉజ్జీల సమరంలో రెండుజట్లు యూరోపియన్ శైలి పవర్ సాకర్ తో అభిమానులను అలరించాయి.

అయితే..అందివచ్చిన అవకాశాలను ఫ్రాన్స్ జట్టు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోగా..ఇంగ్లండ్ మాత్రం విఫలమయ్యింది. పోటీ మొత్తం ఇంగ్లండ్ ఆధిపత్యమే కొనసాగినా..చివరకు ఫ్రెంచ్ జట్టే విజేతగా నిలువగలిగింది.

ఆట మొదటి భాగంలోనే ఫ్రెంచ్ ఆటగాడు అరులియన్ తనజట్టుకు తొలిగోల్ తో 1-0 ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ కు హారి కేన్ ఈక్వలైజర్ గోల్ సాధించాడు.

ఆట మరో 11 నిముషాలలో ముగుస్తుందనగా ఫ్రెంచ్ వెటరన్ ఆటగాడు గిరౌడ్ మ్యాచ్ విన్నింగ్ గోల్ సాధించాడు. ఇంగ్లండ్ కు లభించిన పెనాల్టీని హారీ కేన్ గోల్ గా మలచడంలో విఫలం కావడంతో చివరకు ప్రాన్స్ 2-1తో మ్యాచ్ నెగ్గి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోగలిగింది.

నాలుగేళ్ల క్రితం రష్యా వేదికగా జరిగిన 2018 ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన ఫ్రాన్స్ వరుసగా రెండోసారి టైటిల్ కు గురిపెట్టింది. మరోసారి ఫ్రెంచ్ జట్టు విజేత కాగలిగితే..ఆరు దశాబ్దాల క్రితం బ్రెజిల్ నెలకొల్పిన రికార్డును సమం చేయగలుగుతుంది. ప్రపంచకప్ ఫుట్ బాల్ చరిత్రలో బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ నెగ్గిన ఏకైకజట్టు ఇప్పటి వరకూ బ్రెజిల్ మాత్రమే కావడం విశేషం.

1966లో ప్రపంచకప్ సాధించిన ఇంగ్లండ్ ఆ తర్వాత నుంచి మరో టైటిల్ కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తోంది.

ఫైనల్లో చోటు కోసం జరిగే సెమీఫైనల్లో సంచలనాల మొరాకోతో ఫ్రాన్స్ ఢీకొననుంది.

First Published:  11 Dec 2022 12:51 PM IST
Next Story