ప్రపంచకప్ లో కన్నీటి పర్వం!
ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడాసంబరం ఫిఫా ప్రపంచకప్ నవరసాలతో సాగిపోతోంది. సమరం సెమీఫైనల్ దశకు చేరుకోడంతో ఇప్పటికే పలు ఫేవరెట్ జట్లు నిష్క్ర్రమించడం, ఆయాజట్లకు చెందిన దిగ్గజ ఆటగాళ్లు కన్నీరుమున్నీరు కావడం జరిగిపోయాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడాసంబరం ఫిఫా ప్రపంచకప్ నవరసాలతో సాగిపోతోంది. సమరం సెమీఫైనల్ దశకు చేరుకోడంతో ఇప్పటికే పలు ఫేవరెట్ జట్లు నిష్క్ర్రమించడం, ఆయాజట్లకు చెందిన దిగ్గజ ఆటగాళ్లు కన్నీరుమున్నీరు కావడం జరిగిపోయాయి....
2022 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ పోటీలు ముగింపుదశకు చేరాయి. క్వార్టర్ ఫైనల్లోనే ప్రపంచ నంబర్ వన్ బ్రెజిల్, పోర్చుగల్, ఇంగ్లండ్, నెదర్లాండ్స్ లాంటి మేటిజట్లు
పరాజయాలు పొందటం, అర్జెంటీనా, ఫ్రాన్స్, మొరాకో, క్రొయేషియాజట్లు సెమీఫైనల్స్ కు చేరుకోడంతో సమరం నాలుగు స్తంభాలాటగా మారింది.
అయితే..టైటిల్ నెగ్గితీరాలన్న పట్టుదలతో బరిలోకి దిగిన ఐదుసార్లు విజేత, హాట్ ఫేవరెట్ బ్రెజిల్ పోటీ క్వార్టర్ ఫైనల్లోనే గత టోర్నీ రన్నరప్ క్రొయేషియా చేతిలో పెనాల్టీ షూటౌట్ ఓటమితో ముగిసింది. దీంతో బ్రెజిల్ అభిమానులు మాత్రమే కాదు..స్టార్ ప్లేయర్ నైమర్ తో సహా జట్టు సభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు.
కల చెదిరిన నైమర్...
బ్రెజిల్ స్టార్ స్ట్ర్రయికర్ నైమర్ క్వార్టర్ ఫైనల్లో కీలక గోల్ సాధించినా...క్రొయేషియా చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాడు. తమజట్టు ఓటమితో ప్రపంచకప్ కలలు కల్లలుగా మిగిలిపోడంతో కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఫుట్ బాల్ మైదానంలోనే కూలబడిపోయాడు. తన జీవితంలో ఇక బ్రెజిల్ జట్టులో సభ్యుడిగా ప్రపంచకప్ టైటిల్ కోసం పోరాడే అవకాశం ఉండదంటూ విలపించాడు.
గత ( 2018 ) ప్రపంచకప్ తో పాటు ప్రస్తుత ప్రపంచకప్ లో సైతం సెమీఫైనల్ కు ముందే క్వార్టర్ ఫైనల్ దశలోనే యూరోపియన్ జట్ల చేతిలో పరాజయం పొందటం బ్రెజిల్ ను
తీవ్రనిరాశకు గురి చేసింది. బ్రెజిల్ తరపున అత్యధికంగా 77 గోల్స్ సాధించిన తొలి ఆటగాడిగా, దిగ్గజ ఆటగాడు పీలే పేరుతో ఉన్న 76 గోల్స్ రికార్డును అధిగమించినవాడిగా మాత్రమే నైమర్ సరిపెట్టుకోవాల్సి ఉంది.
2018 ప్రపంచకప్ లో బెల్జియం చేతిలోనూ, 2022 ప్రపంచకప్ లో క్రొయేషియా చేతిలోనూ ఓటమి పొందటంతో..ఆరవ ప్రపంచకప్ టైటిల్ ఆశలు..మరోనాలుగేళ్లపాటు వాయిదా వేసుకోక తప్పలేదు.
పాపం! క్రిస్టియానో రొనాల్డో...
క్వార్టర్ ఫైనల్లో టాప్ ర్యాంకర్ బ్రెజిల్ కు మాత్రమే కాదు..యూరోపియన్ మాజీ చాంపియన్ పోర్చుగల్ కు సైతం చుక్కెదురయ్యింది. ప్రపంచ మేటి ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలో ప్రపంచకప్ గెలుచుకోగలమన్న ధీమాతో బరిలోకి దిగిన పోర్చుగల్ ను ఆఫ్రికా సంచలనం మొరాకో ఒక్క గోలుతో కంగు తినిపించి టైటిల్ ఆశలపై నీళ్లు చల్లింది.
తన కెరియర్ లో వందలకొద్దీ మ్యాచ్ లు ఆడి వెయ్యికి పైగా గోల్స్ సాధించడమే కాదు..యూరోపియన్ లీగ్ తో సహా డజన్ల కొద్దీ ట్రోఫీలు అందుకొన్న 37 సంవత్సరాల రొనాల్డో..ప్రపంచకప్ లేకుండానే రిటైర్ కావాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రపంచకప్ ప్రీ-క్వార్టర్, క్వార్టర్ ఫైనల్ పోటీలలో సబ్ స్టిట్యూట్ ఆటగాడి స్థితికి పడిపోయిన రొనాల్డో తన జట్టు ఓటమి అనంతరం ఫీల్డ్ లోనే కూలబడిపోయాడు. ప్రపంచకప్ టైటిల్ నెగ్గకుండానే తన ఫుట్ బాల్ జీవితం ముగిసిపోతోందంటూ మౌనంగా విలపించాడు. మరో నాలుగేళ్లలో జరిగే ప్రపంచకప్ నాటికి క్రిస్టియానో రొనాల్డో వయసు 41 సంవత్సరాలుగా ఉంటుంది. పోర్చుగల్ జట్టు, అదీ ప్రపంచకప్ లో పాల్గొనే అవకాశమే ఉండదు. ఈ పరిస్థితిని తలచుకొని రొనాల్డో తనలో తాను కుమిలిపోయాడు. జట్టు కోచ్, సహాఆటగాళ్లు వచ్చి రొనాల్డోను సముదాయించాల్సి వచ్చింది.
ప్రస్తుత ప్రపంచకప్ వరకూ పోర్చుగల్ తరపున 196 అంతర్జాతీయమ్యాచ్ లు ఆడటంతో పాటు..గత ఐదు ప్రపంచకప్ టో్ర్నీలలోనూ గోల్స్ సాధించిన ఏకైక ఆటగాడి ఘనత మాత్రం క్రిస్టియానో రొనాల్డోకు మిగిలిపోతుంది.
ప్రపంచకప్ సెమీఫైనల్స్, ఫైనల్స్ తర్వాత మరెంతమంది ఆటగాళ్లు కన్నీరుమున్నీరైపోతారో..వేచిచూడాల్సిందే.