ప్రపంచకప్ లో పోర్చుగల్ టాప్ గేర్!
ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ కు పోర్చుగల్ అలవోకగా చేరుకొంది. ఆఖరి ప్రీ-క్వార్టర్ ఫైనల్ పోరులో విశ్వరూపం ప్రదర్శించింది. 6-1 గోల్స్ తో స్విట్జర్లాండ్ ను చిత్తు చేయడం ద్వారా టైటిల్ కు మరింత చేరువయ్యింది.
ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ కు పోర్చుగల్ అలవోకగా చేరుకొంది. ఆఖరి ప్రీ-క్వార్టర్ ఫైనల్ పోరులో విశ్వరూపం ప్రదర్శించింది. 6-1 గోల్స్ తో స్విట్జర్లాండ్ ను చిత్తు చేయడం ద్వారా టైటిల్ కు మరింత చేరువయ్యింది...
ప్రపంచకప్ హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటైన పోర్చుగల్ టైటిల్ రౌండ్ కు మరింత చేరువయింది. ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ రౌండ్లో స్విట్జర్లాండ్ పై భారీవిజయం నమోదు చేసింది.
యువఆటగాడు రామెస్ హ్యాట్రిక్ గోల్స్ సాధించడంతో పోర్చుగల్ 6-1 గోల్స్ తో స్విస్ జట్టును ఊదిపారేసింది.
రొనాల్డో స్థానంలో రామోస్...
ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ కు బ్రెజిల్, అర్జెంటీనా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, క్రొయేషియా, మొరాకో జట్లు చేరుకొన్న నేపథ్యంలో జరిగిన ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ ఆఖరిరౌండ్ పోరులో పోర్చుగల్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
స్విట్జర్లాండ్ తో జరిగిన ఈ పోరులో కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డోని సబ్ స్టిట్యూట్ గా వాడుకొని..యువ ఆటగాడు రామోస్ కు తుదిజట్టులో చోటు కల్పించింది.
దీనికితోడు కోచ్ తనపైన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రామోస్ ఏకంగా హ్యాట్రిక్ గోల్స్ తో వీరవిహారమే చేశాడు.
రామోస్ నాకౌట్ రికార్డు...
ఏకపక్షంగా సాగిన ఈ పోటీలో పాల్గొనడం ద్వారా 21 సంవత్సరాల రామోస్ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. నాకౌట్ రౌండ్లో పాల్గొన్న అత్యంత పిన్నవయస్కుడైన ఆటగాడిగా, హ్యాట్రిక్ గోల్స్ సాధించిన తొలి ప్లేయర్ గా నిలిచాడు.
1958 ప్రపంచకప్ లో పీలే అత్యంత చిన్న వయసులో ప్రపంచకప్ నాకౌట్ రౌండ్లో పాల్గొన్న తొలి ఆటగాడు కాగా..ఇప్పుడు రామోస్ వచ్చి దిగ్గజం పీలే సరసన నిలిచాడు.
అదృష్టవశాత్తు ప్రీ-క్వార్టర్స్ చేరిన స్విట్జర్లాండ్..నాకౌట్ మ్యాచ్ లో తేలిపోయింది. ఏ దశలోనూ పోర్చుగల్ కు సమఉజ్జీ కాలేకపోయింది. ఆట 17వ నిముషంలోనే పోర్చుగల్ బోణీ కొట్టింది. యువ స్ట్ర్రయికర్ రామోస్ 3 గోల్స్, పెపీ, రాఫేల్ గురేరా, రాఫెల్ లియావో తలో గోలు సాధించడం ద్వారా తమజట్టుకు 6-1 గోల్స్ తో అతిపెద్ద విజయం అందించారు. ప్రస్తుత ప్రపంచకప్ లో ఓ జట్టు సాధించిన అత్యధిక స్కోరు, అతిపెద్ద విజయం ఇదే కావడం విశేషం.
కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో ఆట రెండో భాగంలో సబ్ స్టిట్యూట్ గా బరిలోకి దిగినా ఒక్క గోలూ సాధించలేకపోయాడు.
వ్యూహం ప్రకారమే రొనాల్డో..
ప్రీ-క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో తన కెప్టెన్ రొనాల్డోను సబ్ స్టిట్యూట్ గా దించడాన్ని పోర్చుగల్ కోచ్ సమర్ధించుకొన్నాడు. వ్యూహం ప్రకారమే రొనాల్డోను సబ్ స్టిట్యూట్ గా ఉపయోగించామని, ఇందులో ఎలాంటి దురుద్దేశమూ లేదని, రొనాల్డోతో తనకు చక్కటి అవగాహన ఉందని, తామిద్దరికీ జట్టు ప్రయోజనాలే ముఖ్యమని పోర్చుగీసు కోచ్ తెలిపాడు.
క్వార్టర్ ఫైనల్లో తమకు మొరాకో నుంచి అతిపెద్ద పరీక్ష ఎదురుకానుందని పోర్చుగల్ కోచ్ ప్రకటించాడు. సెమీఫైనల్లో చోటు కోసం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఆఫ్రికా సంచలనం మొరాకోతో పోర్చుగల్ తలపడనుంది.
ప్రస్తుత ప్రపంచకప్ లో అత్యధికంగా 6 గోల్స్ సాధించిన తొలిజట్టుగా పోర్చుగల్, హ్యాట్రిక్ గోల్స్ సాధించిన తొలి ఆటగాడిగా రామోస్ రికార్డులు నెలకొల్పారు.