Telugu Global
Sports

భారత కెప్టెన్ కి అరుదైన గౌరవం, సునీల్ పై ఫిఫా వీడియో సిరీస్‌

భారత ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ చెత్రీకి అరుదైన గౌరవం లభించింది

భారత కెప్టెన్ కి అరుదైన గౌరవం, సునీల్ పై ఫిఫా వీడియో సిరీస్‌
X

భారత ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ చెత్రీకి అరుదైన గౌరవం లభించింది. ప్రపంచసాకర్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో, లయనల్ మెస్సీల సరసన సునీల్ చెత్రీకి అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య చోటు కల్పించింది.....

ఆసియా ఫుట్‌బాల్‌ లో అలుపెరుగని యోధుడు, భారత ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ చెత్రీకి అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య (ఫిఫా ) అరుదైన గౌరవాన్ని కల్పించింది.

సునీల్‌ చెత్రీ సేవలకు గుర్తింపుగా ప్రత్యేక వీడియో సిరీస్ ను రూపొందించింది.

సునీల్ ఫుట్ బాల్ ప్రస్థానాన్ని మూడు భాగాలుగా చిత్రీకరించి, మొత్తం మూడు భాగాల వీడియో సిరీస్‌ను విడుదల చేసింది. ఫిఫా అధికారిక వెబ్‌సైట్‌లో సునీల్ కి సంబంధించిన సిరీస్‌ను 'సునీల్‌ చెత్రీ..కెప్టెన్‌ ఫాంటాస్టిక్‌' పేరిట అందుబాటులో ఉంచినట్టు ఫిఫా అధికారికంగా ప్రకటించింది.

సునీల్ చెత్రీకి లభించిన ఈ గౌరవానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం ముగ్దులయ్యారు. సునీల్ ను అభినందిస్తూ ఓ సందేశాన్ని పంపారు.

క్రిస్టియానో రొనాల్డో, మెస్సీల సరసన...

ప్రపంచ ఫుట్ బాల్ అనగానే పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో, అర్జెంటీనా సారధి లయనల్ మెస్సీలు మాత్రమే గుర్తుకు వస్తారు. ఈ ఇద్దరు మొనగాళ్లపై గతంలోనే ప్రత్యేక వీడియో సిరీస్ రూపొందించిన ఫిఫా...తాజాగా భారత కెప్టెన్ సునీల్ చెత్రీ పైనా వీడియో సిరీస్ ను తయారు చేసింది.

ఫుట్‌బాల్‌ అభిమానులకు క్రిస్టియానో రొనాల్డో, లయోనల్‌ మెస్సీ గురించి తెలుసునని, అంతర్జాతీయ గోల్స్‌ నమోదులో మూడో స్థానంలో ఉన్న సునీల్‌ చెత్రీ గురించి కూడా తెలిపేందుకే ఈ సిరీస్‌ను అందుబాటులోఉంచినట్టు ఫిఫా వివరించింది.

ముగ్గురూ ముగ్గురే....

తమ జాతీయజట్ల తరపున అత్యధిక గోల్స్ సాధించిన సాకర్ కెప్టెన్ల వరుసలో రొనాల్డో, మెస్సీ, సునీల్ చెత్రీ మొదటి మూడుస్థానాలలో నిలిచారు. అంతర్జాతీయ ఫుట్ బాల్ మ్యాచ్ ల్లో అత్యధిక గోల్స్‌ సాధించిన వారిలో రొనాల్డో117, మెస్సీ 90 గోల్స్‌తో తొలి రెండు స్థానాల్లో ఉండగా, సునీల్ 84 గోల్స్‌తో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.. యూరోప్, దక్షిణ అమెరికా దేశాలకు చెందని ఆటగాడు సునీల్ చెత్రీ మాత్రమే. పైగా మూడో స్థానంలో నిలవడం గమనార్హమని ఫిఫా ప్రశంసించింది. 2005లో తొలిసారి భారత్‌కు ఆడిన సునీల్‌ ఇప్పటివరకు 131 మ్యాచ్‌లలో తన జాతీయజట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

అలుపెరుగని యోధుడు.....

ఫుట్ బాల్ ప్రపంచంలో భారత్ కు అంతంత మాత్రమే గుర్తింపు ఉన్నా...భారత కెప్టెన్ గా సునీల్ చెత్రీ మాత్రం అలుపెరుగని పోరాటమే చేస్తున్నాడు. కేవలం తనఆటతీరు,

పోరాటస్ఫూర్తితో అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకొంటూ భారత ఫుట్ బాల్ అస్థిత్వాన్ని కాపాడుతూ వస్తున్నాడు.

ఎన్ని రకాల ఆటలు ఉన్నా ఫుట్ బాల్ తర్వాతే ఏక్రీడైనా. విశ్వవ్యాప్తంగా 204 దేశాలకు చెందిన కోట్లాదిమంది ఆడే ఈ జనసంమోహక క్రీడలో

భారత్ ఇంకా శైశవదశలోనే కొట్టిమిట్టాడుతోంది. పట్టుమని పన్నెండు దేశాలు గట్టిగా ఆడని క్రికెట్లో మనం ప్రపంచ నంబర్ వన్ ర్యాంకులో నిలిచినా...200కు పైగా దేశాలు ఆడే ఫుట్ బాల్ లో మన ర్యాంకు 101 మాత్రమే.

మనదేశంలో క్రికెట్ మర్రినీడలో ఎదుగూబొదుగూలేని క్రీడల్లో ఒకటిగా ఉంటూ వస్తున్న ఫుట్ బాల్ అభివృద్ధి కోసం భారత ఫుట్ బాల్ సమాఖ్య పలురకాల చర్యలు తీసుకొంటూ నానాపాట్లు పడుతూ వస్తోంది. ఎంత చేసినా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నతీరుగా పరిస్థితి తయారయ్యింది. క్రికెటర్లకు ఉన్న ఆదరణ, ప్రోత్సాహం ఫుట్ బాల్ క్రీడాకారులకు లేకపోడం కూడా ఎదుగూబొదుగూ లేకపోడానికి ఓ ప్రధానకారణంగా ఉంటూ వస్తోంది. దేశంలోని గోవా, మహారాష్ట్ర, బెంగాల్, ఈశాన్య భారత రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన భారత ఫుట్ బాల్ ఇంకా బుడిబుడి అడుగుల దశలోనే ఉంది.

కేవలం బెంగాల్, గోవా, కేరళ రాష్ట్ర్రాలకో , ఈశాన్య భారత రాష్ట్ర్రాలకో పరిమితమైన భారత్ ఫుట్ చరిత్రను ఓసారి తిరగేస్తే...వంద అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్లు ఇద్దరంటే ఇద్దరు మాత్రమే కనిపిస్తారు.

దశాబ్దానికి ఒక్కడు.....

జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం భారత్ లో వందలాదిమంది క్రికెటర్లు పుట్టుకు వస్తున్నా...ఫుట్ బాల్ లో మాత్రం...దశాబ్దానికో అంతర్జాతీయస్థాయి ఆటగాడిని మాత్రమే తయారు చేసే పరిస్థితి నెలకొని ఉంది.

సిక్కిం నుంచి భారత్ ఫుట్ బాల్ లోకి దూసుకొచ్చిన బైచుంగ్ భూటియా దశాబ్దకాలం పాటు జాతీయ ఫుట్ బాల్ కు అసమాన సేవలు అందించి రిటైర్మెంట్ ప్రకటిస్తే..

ఆ స్థానాన్ని ప్రస్తుత కెప్టెన్ సునీల్ చెత్రీ గత కొద్ది సంవత్సరాలుగా భర్తీ చేస్తూ వస్తున్నాడు.

గతంలో కేరళ స్ట్రయికర్ విజయన్, ఆ తర్వాత బైచుంగ్ భూటియా...ఈ ఇద్దరి వారసుడుగా సునీల్ చెత్రీ మాత్రమే అంతర్జాతీయస్థాయి ఫుట్ బాలర్లు గా గుర్తింపు సంపాదించుకొన్నారు. భారత కెప్టెన్ గా అసాధారణ సేవలు అందించిన బైచుంగ్ భూటియా తాను ఆడిన 100 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో 42 గోల్స్ సాధించాడు.

2005 నుంచి 2022 వరకూ...

బైచుంగ్ భూటియా రిటైర్మెంట్ తర్వాత...భారత ఫుట్ బాల్ జట్టు పగ్గాలను చేపట్టిన సునీల్ చెత్రీ...ఈ మధ్యకాలంలోనే వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వస్తున్నాడు.

2005లో క్వెట్టా వేదికగా పాకిస్థాన్ తో జరిగిన పోటీ ద్వారా....అంతర్జాతీయ ఫుట్ బాల్ అరంగేట్రం చేసిన సునీల్ చెత్రీ...తన కెరియర్ లో 130కి పైగా మ్యాచ్ లు ఆడి 84 గోల్స్ సాధించిన భారత తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. బైచుంగ్ భూటియా 104 మ్యాచ్ ల్లో 42 గోల్స్ మాత్రమే సాధిస్తే..సునీల్ చెత్రీ... ఆ రికార్డును అధిగమించాడు. సునీల్ చెత్రీ తన ఫుట్ బాల్ ప్రస్థానంలో భారత్ కు ఐదుగురు రాష్ట్ర్రపతులను, ఇద్దరు ప్రధానులను, పదిమంది క్రికెట్ కెప్టెన్లను, ఏడుగురు ఫుట్ బాల్ శిక్షకులు సేవలు అందించడం విశేషం. అంతేకాదు భారత జనాభా 19.00 శాతానికి పెరిగింది. భారత ఫుట్ బాల్ ర్యాంక్ 127 నుంచి 101కు మెరుగు పడింది.

అసాధారణ విజయాలు, అరుదైన అవార్డులు..

2007, 2009, 2012 సంవత్సరాలలో నెహ్రూ అంతర్జాతీయ గోల్డ్ కప్ ను భారత్ కు అందించిన సునీల్..దక్షిణాసియా ఫుట్ బాల్ టోర్నీ శాప్ కప్ లోనూ తన సత్తా చాటాడు.

2011, 2015, 2021 శాఫ్ అంతర్జాతీయ సాకర్ ట్రోఫీ టోర్నీలలో భారత్ ను విజేతగా నిలిపాడు. భారత అత్యుత్తమ ఫుట్ బాల్ క్రీడాకారుడి అవార్డును ఏడుసార్లు గెలుచుకొన్న ఏకైక ఆటగాడు సునీల్ చెత్రీ మాత్రమే. దేశఅత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్నను 2021లో సునీల్ చెత్రీకి అందచేయడం ద్వారా ప్రభుత్వం సత్కరించింది.

38 ఏళ్ల వయసులోనూ అసాధారణంగా రాణిస్తున్న సునీల్ చెత్రీ....భారత ఫుట్ బాల్ చరిత్రలో ఒకే ఒక్కడుగా నిలిచిపోతాడు. కేవలం ఫుట్ బాల్ ఆట కోసమే పుట్టిన ఆటగాడు సునీల్ చెత్రీ అన్నా అతిశయోక్తికాదు.

First Published:  30 Sept 2022 10:45 AM IST
Next Story