Telugu Global
Sports

మేడిన్ పాక్ ఫుట్ బాల్స్ తో ప్రపంచకప్!

ఆసియా ఖండ దేశం ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో వాడుతున్న ఫుట్ బాల్స్ వెనుక ఓ ఆసక్తికరమైన కథే ఉంది. పాకిస్థాన్ లో తయారైన 2022 ప్రపంచకప్ అధికారిక సాకర్ బాల్ కు అల్ రిహ్లా అని నామకరణం చేశారు.

మేడిన్ పాక్ ఫుట్ బాల్స్ తో ప్రపంచకప్!
X

మేడిన్ పాక్ ఫుట్ బాల్స్ తో ప్రపంచకప్!

ఆసియా ఖండ దేశం ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో వాడుతున్న ఫుట్ బాల్స్ వెనుక ఓ ఆసక్తికరమైన కథే ఉంది. పాకిస్థాన్ లో తయారైన 2022 ప్రపంచకప్ అధికారిక సాకర్ బాల్ కు అల్ రిహ్లా అని నామకరణం చేశారు....

దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రపంచకప్ ఫుట్ బాల్ లో 2022 ఫిఫా ప్రపంచకప్ కు పలు రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతి బుల్లిదేశం, కేవలం 30 లక్షల జనాభా మాత్రమే కలిగిన ఖతర్ వందలకోట్ల రూపాయల వ్యయంతో ప్రస్తుత ప్రపంచకప్ కు ఆతిథ్యమిస్తోంది.

ప్రపంచంలోనే ఈ అతిపెద్ద క్రీడాసంబరాన్ని వెయ్యి కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఎనిమిది అత్యాధునిక స్టేడియాలలో నిర్వహిస్తోంది. మొత్తం 32 జట్లు పోటీపడిన ఈ పోటీలకు విశ్వవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 10 లక్షల మంది అభిమానులు హాజరయ్యారు.

ప్రపంచకప్ కు ఆతిథ్యమిచ్చిన అతిబుల్లిదేశంగా రికార్డుల్లో చోటు సంపాదించిన ఖతర్..పోటీల భద్రత కోసం పాకిస్థాన్, టర్కీ సైనిక దళాలను వినియోగిస్తోంది. అంతేకాదు..

ఈ పోటీలలో వాడుతున్న సాకర్ బాల్స్ ను సైతం పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకొంది.

అల్ రిహ్లా బాల్స్ తో ప్రపంచకప్...

ప్రతి ప్రపంచకప్ కూ అధికారికంగా ఓ ప్రత్యేకమైన ఫుట్ బాల్ ను వాడటం ఫిఫాకు ఓ ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుత 2022 ప్రపంచకప్ మ్యాచ్ ల్లో వాడుతున్న బంతికి

అల్ రిహ్లా అని ఫిఫా నామకరణం చేయటమే కాదు..అధికారిక బంతిగా ప్రకటించింది.

పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్ర్రంలోని అడిడాస్ కంపెనీకి చెందిన ఫ్యాక్టరీలలో ఈ బంతులను తయారు చేస్తున్నారు. అరబిక్ భాషలో అల్ రిహ్లా అంటే ప్రయాణం అని అర్థం.

ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ ల తయారీ, విక్రయానికి మరో పేరైన అడిడాస్ సంస్థకు పాకిస్థాన్ లోని సియాల్ కోట లో తయారీ సంస్థలు ఉన్నాయి.

మొత్తం వెయ్యిమంది ఫుట్ బాల్ తయారీదారులున్నారు. పాశ్చాత్య దేశాలతో పోల్చిచూస్తే అతితక్కువ ఖర్చుతో నాణ్యమైన ఫుట్ బాల్స్ ను తయారు చేసే సౌకర్యాలు పాకిస్థాన్ లో ఉన్నాయి.

తన ప్రమాణాలకు అనుగుణంగా తయారైన బంతులను ఉత్పత్తిదారుల నుంచి సేకరించి..ఆడిడాస్ సంస్థ తన బ్రాండ్ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా విక్రయిస్తూ వస్తోంది.

అంతర్జాతీయ ఫుట్ బాల్ సంఘానికి సైతం ఫుట్ బాల్ లను అడిడాస్ సంస్థే సమకూర్చుతూ వస్తోంది.

60వేల మందికి జీవనోపాథి..

ఫుట్ బాల్ లను తయారు చేస్తూ పాకిస్థాన్ లోని వందలాది కుటుంబాలకు చెందిన 60 వేల మంది జీవనోపాథిని పొందుతున్నారు. బ్రిటీషువారి పాలన కాలం నుంచే ఫుట్ బాల్ తయారీలో సియాల్ కోట్ అగ్రగామిగా ఉంటూవస్తోంది. ప్రపంచంలోని 209 దేశాలలో ఎక్కడ ఫుట్ బాల్ ఆడిన..అది పాకిస్థాన్ లో తయారైన బంతిగానే ఉంటూవస్తోంది.

అప్పట్లో బ్రిటీష్ సిపాయిల అవసరాల కోసం సియాల్ కోట ప్రాంతంలో ఫుట్ బాల్ లను తయారు చేస్తూ ఉండేవారు.

అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య ఆవిర్భవించిన నాటినుంచి తనకు అవసరమైన సాకర్ బాల్స్ ను పాకిస్థాన్ నుంచే దిగుమతి చేసుకొంటూ వస్తోంది. ప్రస్తుత ప్రపంచకప్ లో సైతం వాడుతున్న బంతుల్లో 70 శాతం వరకూ పాకిస్థాన్ లో తయారైనవే కావడం విశేషం.

అల్ రిహ్లా అన్నపేరుతో వాడుతున్న ఈ బంతులను ప్రత్యేక డిజైన్ తో రూపొందించారు. అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసిన ఈ బంతులకు గాలిలో నిలకడగా తేలటం, నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా బౌన్స్ కావడం తో పాటు ఆతిథ్య దేశం ఖతర్ చరిత్ర, సంస్కృతుల మేళవింపుగా డిజైన్ చేశారు.

పోటీలు వేగంగా సాగిపోడం, అత్యున్నత ప్రమాణాలకు మారు పేరుగా ఈ బంతులను రూపొందించారు.

ప్రస్తుత ప్రపంచకప్ లో వాడుతున్న బంతిని ఒక మీటర్ ఎత్తునుంచి కిందకు పడవేస్తే 60 సెంటీమీటర్ల ఎత్తున బౌన్స్ కావడం విశేషం. మొత్తం 20 వేర్వేరు భాగాలతో ఒక్కో బంతిని తయారు చేస్తున్నారు.

2014 ప్రపంచకప్ లో ఉపయోగించిన బంతికి బ్రజూకా, 2018 ప్రపంచకప్ బాల్స్ కు టెల్ స్టార్ అన్న పేర్లు పెట్టారు. ఒక్కో ప్రపంచకప్ కు ఒక్కో ప్రత్యేకమైన బంతిని వాడుతూ రావడం విశేషం.

అడిడాస్ కంపెనీ ఆర్డర్లలో పాకిస్థాన్ లోని ఉత్పత్తిదారులు నెలకు 7 లక్షల 50వేల బంతులను తయారు చేసి అందచేస్తున్నారు. కార్మికుల వేతనాలు అతితక్కువగా ఉండటం, ఫుట్ బాల్ తయారీకి అవసరమైన ముడిపదార్థాలు అందుబాటులో ఉన్న కారణంగానే పాకిస్థాన్ ప్రధాన ఉత్పత్తిదారుగా నిలిచింది. చైనాలో కార్మికుల వేతనాలు ఎక్కువ కావడంతో..అక్కడ తయారైన బంతుల ఖరీదు సైతం పెరిగిపోతూ వస్తోంది. దీంతో అడిడాస్ కంపెనీ పాకిస్థాన్ లోని కంపెనీల వైపే మొగ్గు చూపుతోంది.

మొత్తం మీద ..పాకిస్థాన్ సైనిక దళాల భద్రత నడుమ...పాకిస్థాన్ లో తయారైన బంతులతో ఖతర్ వేదికగా 2022 ప్రపంచకప్ ఫుట్ బాల్ పోటీలు నిర్వహిస్తున్నారంటే విశేషమే మరి.

First Published:  15 Dec 2022 1:42 PM IST
Next Story