సుప్రీంకోర్టులో గంగూలీ అండ్ కో భవితవ్యం!
భారత క్రికెట్ నియంత్రణమండలి అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని కార్యవర్గం మరో రెండేళ్లపాటు కొనసాగేది లేనిదీ సుప్రీంకోర్టు నిర్ణయించనుంది.
భారత క్రికెట్ నియంత్రణమండలి అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని కార్యవర్గం మరో రెండేళ్లపాటు కొనసాగేది లేనిదీ సుప్రీంకోర్టు నిర్ణయించనుంది. 70 ఏళ్లు పైబడినవారు బీసీసీఐ కార్యకలాపాలలో పాలు పంచుకొనే అంశంపైనా సుప్రీం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది....
ప్రపంచంలోనే అత్యంతభాగ్యవంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ కార్యవర్గ సభ్యుల పదవీకాలం ముగింపుదశకు చేరడంతో దేశవ్యాప్తంగా ఎక్కడలేని ఉత్కంఠ నెలకొంది.
రెండేళ్లక్రితం వరకూ దారితప్పిన బీసీసీఐ కార్యకలాపాలను సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని కార్యవర్గం గాడిలో పెట్టడంలో విజయవంతమయ్యింది. అంతేకాదు..బీసీసీఐ రాబడిని సైతం ఇబ్బడిముబ్బడిగా పెంచడంలో సఫలం కాగలిగింది.
అయితే..సుప్రీంకోర్టు గతంలో నియమించిన జస్టిస్ లోథాకమిటీ రూపొందించిన నియమావళి ప్రకారం సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని కొందరు కార్యవర్గసభ్యులు తమతమ పదవులు వీడక తప్పని పరిస్థితి ఏర్పడింది.పదవుల నుంచి వైదొలగాల్సిన వారిలో అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షా సైతం ఉన్నారు.
సజావుగా సాగుతున్న బీసీసీఐ దైనందిన కార్యకలాపాలకు విఘాతం కలిగే ప్రమాదం ఉండడంతో మరి రెండేళ్లపాటు గంగూలీ, జే షా తమతమ పదవులలో కొనసాగేలా చూడాలని బీసీసీఐ భావిస్తోంది.
సుప్రీం అనుమితిస్తేనే....
తమ అధ్యక్షకార్యదర్శులు సౌరవ్ గంగూలీ, జే షా పదవీకాలం కొనసాగింపునకు వీలుగా బీసీసీఐ తన రాజ్యాంగానికి సవరణలు చేయాలని నిర్ణయించింది. అయితే...సుప్రీంకోర్టు అనుమతితోనే సవరణలు చేయకతప్పని పరిస్థితి ఏర్పడింది.
జస్టిస్ లోథా ప్రతిపాదించిన నియమావళికి సవరణలను చేయాల్సిన ఆవశ్యకతను బీసీసీఐ తరపున సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా విన్నవించారు.
అంతేకాదు...70 ఏళ్లు పైబడిన వారు బీసీసీఐ కార్యకలాపాలలో పాల్గొనకుండా విధించిన నిషేధాన్ని సైతం సవరించాలని ప్రతిపాదించారు.
ఈ రెండు సవరణలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హిమా కొహ్లీ సభ్యులుగా ఉన్న బెంచ్ విచారణ చేపట్టింది.
బీసీసీఐకి అనుబంధంగా ఉన్న రాష్ట్ర్రసంఘాలలో కార్యవర్గసభ్యులుగా గతంలో రెండు విడతలు పనిచేసినవారిని కొద్దిసంవత్సరాలపాటు పదవులకు దూరంగా ఉండేలా జస్టిస్ లోథా కమిటీ సిఫారసు చేసింది. ఈ నిబంధన ప్రకారం గతంలో బెంగాల్, గుజరాత్ క్రికెట్ సంఘాల కార్యవర్గసభ్యులుగా పనిచేసిన సౌరవ్ గంగూలీ, జే షా ప్రస్తుత బీసీసీఐ పదవులను వీడాల్సి ఉంది.
దీనికితోడు..క్రికెట్ కార్యకలాపాలను నిర్వర్తించడంలో అపారఅనుభవం ఉన్న ఎన్ శ్రీనివాసన్ సేవలను ఐసీసీకి వినియోగించడానికి వీలుగా 70 సంవత్సరాల నిబంధనకు సైతం
సవరణ చేయాలని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ ముందు బీసీసీఐ విన్నవించుకొంది.
రాష్ట్ర కార్యవర్గసభ్యుల విధులకు, బీసీసీఐ కార్యవర్గసభ్యుల బాధ్యతలు, విధులకు మధ్య ఎంతో తేడా ఉందన్న విషయాన్ని సుప్రీం బెంచ్ ముందు సొలిసిటర్ జనరల్ ఉంచారు.
ఈ రెండు సవరణలను అనుమతించేది, లేనిదీ సుప్రీం బెంచ్ ప్రకటించనుంది. అయితే...సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో బయటకు వచ్చిన అంశాలను సోషల్ మీడియా...జడ్జిమెంట్ గా భావించడం అవాంఛనీయమంటూ జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. వాదనలు వేరు, తీర్పు వేరు అన్న వాస్తవాన్ని సోషల్ మీడియా గ్రహించాలంటూ వ్యాఖ్యానించారు.