Telugu Global
Sports

నకిలీ వరల్డ్ కప్ టికెట్లు.. ఇతని టాలెంట్ మామూలుగా లేదు!

వరల్డ్ కప్‌కు సంబంధించి టీమ్ ఇండియా మ్యాచ్‌ల టికెట్ల కోసం భారీ డిమాండ్ నెలకొన్నది.

నకిలీ వరల్డ్ కప్ టికెట్లు.. ఇతని టాలెంట్ మామూలుగా లేదు!
X

ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన డైలాగ్ 'రేయ్.. ఎవడ్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు'. ఇప్పుడు ఈ కోల్‌కతాకు చెందిన ఒక వ్యక్తి చేసిన పనికి ఐసీసీ, బీసీసీఐ కూడా అదే డైలాగ్ కొడుతున్నాయి. ఇండియా వేదికగా వన్డే వరల్డ్ కప్ జరుగుతోంది. వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూడటానికి స్థానికులే కాకుండా దేశ, విదేశీ అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఐసీసీ ఆన్‌లైన్‌లో వరల్డ్ కప్ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను అమ్మకానికి పెట్టింది. దీంతో పాటు ఆఫ్ లైన్‌లో కూడా టికెట్లను ఆయా స్టేడియంల వద్ద విక్రయిస్తున్నారు.

వరల్డ్ కప్‌కు సంబంధించి టీమ్ ఇండియా మ్యాచ్‌ల టికెట్ల కోసం భారీ డిమాండ్ నెలకొన్నది. ఇప్పటికే ప్రతీ మ్యాచ్ టికెట్లు అమ్ముడయ్యాయి. కొంత మంది బ్లాక్‌లో కూడా టికెట్లు అమ్ముతున్నారు. అయితే ఇదే సందు అని భావించిన కొంత మంది నకిలీ టికెట్లు కూడా అమ్మకానికి పెడుతున్నారు.

ఐసీసీ విక్రయించే టికెట్లను పోలి ఉండే టికెట్లనే ముద్రించి కోల్‌కతాలో అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రాబోయే ఆదివారం (నవంబర్ 5) ఇండియా, దక్షిణాప్రికా మధ్య వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ జరుగనున్నది. వరల్డ్ కప్ మ్యాచ్‌లంటేనే చాలా డిమాండ్ ఉంటుంది.. అలాంటిది ఇండియా మ్యాచ్‌కు అభిమానులు ఎగబడుతుంటారు. దీన్ని క్యాష్ చేసుకుందామని అనుకున్న ఒక వ్యక్తి రూ.2,500, రూ.11,000 విలువైన టికెట్లను ముద్రించి అమ్ముతున్నాడు.

వరల్డ్ కప్ నకిలీ టికెట్లను అమ్ముతున్న సమాచారం అందుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. ఇండియా, సౌతాఫ్రికా మ్యాచ్‌కు సంబంధించిన నకిలీ టికెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అచ్చంగా ఒరిజినల్ టికెట్ల లాగానే ఉన్న ఈ టికెట్లను చూసి పోలీసులు కూడా విస్తుపోయారు. ఈ విషయంపై అప్రమత్తమైన బీసీసీఐ.. టికెట్లను ఆన్‌లైన్‌లో కానీ అధీకృత డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని అభిమానులకు సూచించింది. నకిలీ టికెట్లలో ఉండే కోడ్.. స్టేడియం గేట్ల వద్ద రిజెక్ట్ అవుతాయని.. కాబట్టి అసలైన టికెట్లను మాత్రమే కొని స్టేడియంలోకి ప్రవేశించాలని సూచించింది.


First Published:  31 Oct 2023 8:11 PM IST
Next Story