Telugu Global
Sports

అంతా దైవసంకల్పం.. వమిక, అనుష్కలకే శతకం అంకితం!

అంతర్జాతీయ క్రికెట్లో మూడేళ్ల విరామం తర్వాత తాను సాధించిన సెంచరీని తన కుమార్తె వమిక, భార్య అనుష్కలకు అంకితమిస్తున్నట్లు విరాట్ కొహ్లీ ప్రకటించాడు.

Virat Kohli
X

Virat Kohli 

అంతర్జాతీయ క్రికెట్లో మూడేళ్ల విరామం తర్వాత తాను సాధించిన సెంచరీని తన కుమార్తె వమిక, భార్య అనుష్కలకు అంకితమిస్తున్నట్లు విరాట్ కొహ్లీ ప్రకటించాడు.

గత 14 ఏళ్లుగా తాను సాధించిన విజయాలు, వైఫల్యాలు అన్నీ దైవసంకల్పమని చెప్పాడు.....

భారత ఆధునిక క్రికెట్ దిగ్గజం విరాట్ కొహ్లీ మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. అంతర్జాతీయ క్రికెట్లో 2019 సీజన్ వరకూ 70 సెంచరీలు సాధించిన విరాట్ కొహ్లీకి గత మూడు సంవత్సరాలుగా మూడంకెల స్కోర్లు కరువయ్యాయి. టెస్టు, వన్డే, టీ-20 ఫార్మాట్లలో స్థాయికి తగ్గట్టుగా ఆడలేక విరాట్ సతమతమవుతూ వచ్చాడు.

కంటిమీద కునుకు లేకుండా తీవ్రనిరాశ, నిస్ప్రృహల నడుమ గడిపాడు. ఈ గడ్డు పరిస్థితి నుంచి బయటపడటానికి గత రెండుమాసాలుగా క్రికెట్ నుంచి విరామం తీసుకొని..ప్రస్తుత ఆసియాకప్ ద్వారా తిరిగి బరిలో నిలిచాడు.

టాప్ గేర్ లో తిరిగి విరాట్...

యునైటెడ్ ఎమిరేట్స్ వేదికగా జరిగిన 2022 ఆసియాకప్ టోర్నీలో లీగ్ దశ రెండు, సూపర్ -4 రౌండ్లో మూడుమ్యాచ్ లు ఆడటం ద్వారా భారత్ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు.

1020 రోజుల క్రితం 2019 నవంబర్ లో తన చివరి అంతర్జాతీయ శతకం సాధించిన విరాట్...2022 సెప్టెంబర్ 8న దుబాయ్ వేదికగా అఫ్ఘనిస్థాన్ తో జరిగిన సూపర్ -4 రౌండ్ మ్యాచ్ ద్వారా తిరిగి సెంచరీ సాధించగలిగాడు.

గ్రూపులీగ్ ప్రారంభమ్యాచ్ లో పాకిస్థాన్ పై 34 పరుగులు, రెండోమ్యాచ్ లో హాంకాంగ్ పై 59 నాటౌట్ స్కోర్లు సాధించిన విరాట్..సూపర్-4 తొలిరౌండ్ పోరులో పాక్ ప్రత్యర్థిగా 60 పరుగులు, శ్రీలంకపై డకౌట్ స్కోర్లు సాధించాడు. ఆఖరిరౌండ్ పోటీలో అఫ్ఘనిస్థాన్ పైన 122 పరుగుల నాటౌట్ స్కోరుతో సంచలనం సృష్టించాడు. ఆసియాకప్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన భారత క్రికెటర్ గా నిలిచాడు.

ఆ ఇద్దరికే ఈ శతకం అంకితం...

అంతర్జాతీయ క్రికెట్లో తాను 71వ శతకం సాధించడానికి మూడేళ్లపాటు శ్రమించాల్సి వచ్చిందని, వరుస వైఫల్యాలతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నానని..అలాంటి స్థితిలో తన భార్య అనుష్క అండగా నిలిచిందని, ఎంతో మనోస్థైర్యాన్ని కలిగించిందని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొన్నసమయంలో చెప్పాడు.

ఈ శతకాన్ని కూతురు వమిక, భార్య అనుష్కలకు అంకితమిస్తున్నట్లు తెలిపాడు. 58 బాల్స్ లోనే సెంచరీ పూర్తి చేసిన కొహ్లీ..తన మెడలోని లాకెట్ ను ముద్దాడుతూ మురిసిపోయాడు. భార్య, కుమార్తె ఫోటోలతో కూడిన ఆ లాకెట్ ను ధరించి మరీ విరాట్ టోర్నీలో పాల్గొన్నాడు.

గత మూడుసంవత్సరాలుగా తాను కంటిమీద కునుకు లేకుండా ఎన్నోరాత్రులు గడిపానని, నిరాశలో కూరుకుపోయిన సమయంలో తన అనుచిత ప్రవర్తనను భరించిన అనుష్కకు రుణపడి ఉంటానని విరాట్ తెలిపాడు.

టీమ్ మేనేజ్ మెంట్ కు థ్యాక్స్...

గత మూడుసంవత్సరాలుగా తాను స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోతున్నా టీమ్ మేనేజ్ మెంట్ తనకు అండగా నిలుస్తూ వచ్చిందని, రెండుమాసాల విశ్రాంతి తర్వాత తిరిగి ఆసియాకప్ జట్టులో చేరిన తనకు కోచ్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతుగా నిలిచారని, ఎలాంటి ఒత్తిడిలేకుండా స్వేచ్ఛగా ఆడమంటూ ప్రోత్సహించారని..వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకొంటున్నానని చెప్పాడు.

తనకు ఎందరో సలహాలు, సూచనలు ఇచ్చారని...వాటిని పాటించి, అమలు చేయాల్సింది తాను మాత్రమేనని ఓ ప్రశ్నకు బదులిస్తూ చెప్పాడు. తన ఆటతీరులో ఎలాంటి మార్పు, లోపమూ లేదని చెప్పాడు. తాను 60కి పైగా స్కోర్లు సాధించినా దానినీ వైఫల్యంగానే చూడటం విస్మయం కలిగించిందని వాపోయాడు.

అంతర్జాతీయ క్రికెట్లో తాను సాధించిన విజయాలు, వైఫల్యాలు అన్నీ దైవసంకల్పమేనని, తాను ఏదీ సాధించినా అది తన గొప్పతనం కానేకాదని,దైవేచ్ఛ మాత్రమేనని విరాట్ ..వేదాంత ధోరణిలో చెప్పుకొచ్చాడు.

క్రికెటర్ల జీవితాలలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, విజయాలు వచ్చినప్పుడు పొంగిపోడం, వైఫల్యాలు ఎదురైనప్పుడు కృంగిపోడం తగదని తనకు అర్థమయ్యిందని వివరించాడు.

విజయం విలువైన స్నేహితుడైతే...అపజయం గొప్పగురువు లాంటిదని విరాట్ అభివర్ణించాడు. 14 సంవత్సరాల తన క్రికెట్ జీవితంలో గడ్డు పరిస్థిని ఎదుర్కొన్న గత మూడేళ్ల కాలం ఎంతో విలువైనదని విరాట్ అభివర్ణించాడు.


First Published:  9 Sept 2022 11:19 AM IST
Next Story