ఎందరున్నా ఒంటరినే..విరాట్ నిర్వేదం!
ఆధునిక భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కొహ్లీ నిర్వేదంలో పడిపోయాడు. క్రికెటర్ గా రికార్డుల హోరు, సెంచరీల జోరు, పరుగుల మోత మోగించినా..వందలకోట్ల రూపాయలు సంపాదించినా కొహ్లీలో ఆ ఆనందం లేశమంతైనా కనిపించడంలేదు.
ఆధునిక భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కొహ్లీ నిర్వేదంలో పడిపోయాడు. క్రికెటర్ గా రికార్డుల హోరు, సెంచరీల జోరు, పరుగుల మోత మోగించినా..వందలకోట్ల రూపాయలు సంపాదించినా కొహ్లీలో ఆ ఆనందం లేశమంతైనా కనిపించడంలేదు.
అంతర్జాతీయ క్రికెట్లో అత్యున్నత ప్రమాణాలకు మరోపేరైన 33 సంవత్సరాల కొహ్లీ గత మూడేళ్లుగా వరుస వైఫల్యాలతో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాడు.
క్రికెట్ మూడుఫార్మాట్లలో నాయకత్వం పోగొట్టుకోడంతో పాటు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న జట్లకే అలంకరణగా మారే ప్రమాదాన్ని కొని తెచ్చుకొన్నాడు.
14 సంవత్సరాలు...అంతులేని శూన్యం!
అప్రతిహత విజయాల రుచి మరిగిన వారిని పరాజయాలు, వరుస వైఫల్యాలు దారుణంగా కృంగదీస్తాయి. తమపైనే తమకే నమ్మకం కోల్పోయేలా చేస్తాయి.
దానికి దిగ్గజ క్రికెటర్ విరాట్ కొహ్లీ ఏమాత్రం మినహాయింపు కాదు.
2019 వరకూ అంతర్జాతీయ క్రికెట్లో శతకాలకు చిరునామాగా నిలిచిన విరాట్ కొహ్లీని గత మూడేళ్లుగా మూడంకెల స్కోరు వెక్కిరిస్తూ వస్తోంది. ఐపీఎల్, భారతజట్ల తరుపున ఆడే టెస్టులు, వన్డేలు, టీ-20 మ్యాచ్ ల్లో విరాట్ కొహ్లీ వైఫల్యాల పరంపర కొనసాగుతూనే వస్తోంది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా మూడేళ్లుగా విఫలమవుతూ వస్తున్న విరాట్ ను గతంలో సాధించిన ఘనతల్ని దృష్టిలో ఉంచుకొని భారత టీమ్ మేనేజ్ మెంట్ భరిస్తూ వస్తోంది. అదే మరో ఆటగాడైతే ఎప్పుడో జట్టులో చోటు లేకుండా పోయేవాడే.
అంతర్జాతీయ క్రికెట్లో 14 సంవత్సరాల ప్రస్థానం పూర్తి చేసినా, తనను అభిమానించే వారు ఎందరో ఉన్నా, అందరినడుమా తాను ఉన్నా అంతులేని ఒంటరితనం తనను వేధిస్తోందంటూ విరాట్ కొహ్లీ వాపోతున్నాడు. క్రికెటర్లకు ఇలాంటి పరిస్థితి కెరియర్ లో ఎప్పుడో ఒకప్పుడు సహజమేనని..అయితే తన విషయంలో గత మూడేళ్లుగా జరుగుతూ వస్తోందని, ఏం చేయాలో పాల్పోడం లేదంటూ తన మనసులో బాధను బయట పెట్టాడు.
జూనియర్ టు సూపర్ సీనియర్...
భారత జూనియర్ క్రికెటర్ గా విరాట్ కొహ్లీ సత్తా చాటుకోడం ద్వారా సీనియర్ జట్టులోకి అడుగుపెట్టాడు. అండర్ -19 ప్రపంచకప్ ను భారతజట్టు కొహ్లీ నాయకత్వంలోనే గెలుచుకొంది. ఆ తర్వాత 2008 ఆగస్టు 18వ తేదీన దంబుల్లా వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశాడు. సీనియర్ క్రికెట్ తన తొలి అంతర్జాతీయ వన్డే ఇన్నింగ్స్‌లో కొహ్లీ 22 బంతుల్లో 12 పరుగులు మాత్రమే సాధించాడు. ఆ తర్వాత నుంచి కొహ్లీ విశ్వరూపమే ప్రదర్శించాడు. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో గొప్పగొప్ప ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు. భారత క్రికెట్లో మాస్టర్ సచిన్ తర్వాత తానేనంటూ చెప్పకనే చెప్పాడు. 14 ఏళ్ల తన అనుభవాలు, అనుభూతులను కోహ్లీ తన ఇన్‌స్టాలో పంచుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలతో వీడియోను పోస్టు చేశాడు. 14 ఏళ్ల క్రితం కెరీర్ మొదలైందని, దీన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లుగా కోహ్లీ తన వీడియో క్యాప్షన్ ఇచ్చాడు.
శారీరకంగా.. మానసికంగా......
నేటితరం క్రికెట్లో అత్యంత ఫిట్ నెస్ కలిగిన క్రికెటర్ గా పేరున్న విరాట్ కొహ్లీ మానసికంగా మాత్రం బలహీనపడిపోయాడు. ఆత్మనూన్యతా భావనతో కొట్టిమిట్టాడుతున్నాడు.
విజయాలు అంతులేని శక్తిని ఇస్తే..వరుస వైఫల్యాలు నిస్తేజాన్ని, నిర్లిప్తతను కలిగిస్తాయని, తనచుట్టూ ఉన్నవారంతా తనను ప్రేమించేవారేనని..అయినా తాను ఒంటరినేనన్న భావన తనలో రానురాను పెరిగిపోతోందంటూ ఓ ఇంటర్వ్యూలో కొహ్లీ ఆశక్తతను వ్యక్తం చేశాడు.
102 టెస్టుల్లో 8వేల 74 పరుగులు, 262 వన్డేలలో 12వేల 344 పరుగులు, 99 టీ-20 మ్యాచ్ ల్లో 3వేల 308 పరుగులు, టెస్టుల్లో 27, వన్డేల్లో 43 శతకాలు బాదిన
కొహ్లీ గత మూడేళ్లుగా మూడంకెల స్కోరు కోసం పడరాని పాట్లు పడుతున్నాడు. చివరిసారిగా 2019లో బంగ్లాదేశ్ ప్రత్యర్థిగా జరిగిన టెస్టు మ్యాచ్ లో సెంచరీ సాధించాడు.
గత మూడేళ్ల వైఫల్యాలు తనపైన ప్రతికూలప్రభావాన్ని చూపాయని, దానినుంచి బయట పడటానికి చేయని ప్రయత్నం అంటూలేదని వాపోయాడు.
2014లో మొదటిసారి....
2014 ఇంగ్లండ్ పర్యటనలో తాను తొలిసారిగా వరుస వైఫ్యల్యాలు చవిచూసినప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోయానని, ఒంటరితనం కృంగదీసిందని గుర్తు చేసుకొన్నాడు. గత మూడేళ్లుగా తిరిగి అదే పరిస్థితి పునరావృతమయ్యిందని చెప్పాడు.
అయితే...గత పుష్కరకాలంగా విశ్రాంతి అనేది లేకుండా వివిధ ఫార్మాట్లలో ఆడుతూ వస్తున్న విరాట్ కొహ్లీ కొంతకాలం విశ్రాంతి తీసుకొంటే మేలని భారత మాజీ ప్రధాన శిక్షకుడు రవిశాస్త్రి ఓ వైపు చెబుతుంటే..మరోవైపు విఖ్యాత కామెంటీటర్, భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మాత్రం..తనతో విరాట్ కొహ్లీ అర్థగంట కూర్చుంటే అతనిని గాడిలో పడేట్లు చేస్తానని ప్రకటించారు.
ఎవరేమన్నా..యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఈనెల ఆఖరివారంలో జరిగే 2022 ఆసియాకప్ టోర్నీలో పాల్గొనే భారతజట్టులో విరాట్ కొహ్లీకి చోటు కల్పించి సెలెక్టర్లు ఊరట కలిగించారు. ఒక్కమాటలో చెప్పాలంటే విరాట్ కొహ్లీకి ఇది చావోబతుకో లాంటి అవకాశం. ఆస్ట్ర్రేలియా వేదికగా అక్టోబర్ లో జరిగే టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో తన చోటు దక్కించుకోవాలంటే..ఆరునూరైనా ఆసియాకప్ టోర్నీలో పూర్తిస్థాయిలో రాణించక తప్పదు.