ప్రపంచ హాకీలో నేడు ఇంగ్లండ్ తో భారత్ కీలకపోరు!
ప్రపంచకప్ హాకీ గ్రూప్ లీగ్ లో ఆతిథ్య భారత్ ఈరోజు అతిపెద్ద పరీక్ష ఎదుర్కోనుంది. 5వ ర్యాంకర్ ఇంగ్లండ్ తో పోరుకు సిద్ధమయ్యింది.
ప్రపంచకప్ హాకీ గ్రూప్ లీగ్ లో ఆతిథ్య భారత్ ఈరోజు అతిపెద్ద పరీక్ష ఎదుర్కోనుంది. 5వ ర్యాంకర్ ఇంగ్లండ్ తో పోరుకు సిద్ధమయ్యింది....
భారతగడ్డపై నాలుగోసారి జరుగుతున్న ప్రపంచ పురుషుల హాకీ టోర్నీ హోరాహోరీగా సాగుతోంది. అంతర్జాతీయ హాకీలోని 16 అత్యుత్తమ ర్యాంక్ జట్ల నడుమ జరుగుతున్న ఈ పోరులో మాజీ చాంపియన్ భారత్ ఆతిథ్యదేశం హోదాలో మరోటైటిల్ కు గురిపెట్టింది.
భువనేశ్వర్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం, రూర్కెలాలోని బిర్సాముండా ఇంటర్నేషనల్ స్టేడియాలు ప్రస్తుత ఈ హాకీ ప్రపంచకప్ టోర్నీకి వేదికలుగా నిలిచాయి.
అగ్రశ్రేణిజట్ల టాప్ గేర్...
మొత్తం 16జట్లు ..నాలుగు గ్రూపులుగా లీగ్ దశలో తలపడుతున్నాయి. భారత్, ఇంగ్లండ్, వేల్స్, స్పెయిన్ జట్లతో కూడిన గ్రూప్ -డీ లీగ్ లో ప్రపంచ 5వ ర్యాంకర్ ఇంగ్లండ్, 6వ ర్యాంకర్ భారత్ తొలిరౌండ్లో స్థాయికి తగ్గట్టుగా ఆడి తొలివిజయాలతో రెండోరౌండ్ సమరానికి సిద్ధమయ్యాయి.
స్పెయిన్ పైన భారత్ 2-0 గోల్స్ తో నెగ్గితే..వేల్స్ పైన ఇంగ్లండ్ 5-0 గోల్స్ తో భారీవిజయం సాధించింది. ఈ రోజు జరిగే రెండోరౌండ్ పోరులో భారత్, ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.
స్పెయిన్ తో జరిగిన తొలిరౌండ్ పోరులో లభించిన 5 పెనాల్టీ కార్నర్లలో భారత్ ఒక్క గోలు మాత్రమే సాధించడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఇంగ్లండ్ లాంటి పటిష్టమైన జట్టుతో లభించిన ప్రతి ఒక్క చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగితేనే గట్టెక్కే అవకాశాలున్నాయి. జట్టులో నలుగురు పెనాల్టీకార్నర్ స్పెషలిస్టులు ఉన్నా..నాలుగు పెనాల్టీ కార్నర్ లను సద్వినియోగం చేసుకోలేకపోయిన కారణంగానే భారత్ 2-0 గోల్స్ విజయంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
పెనాల్టీకార్నర్లే కీలకం...
కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, మాజీ కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, జర్మన్ ప్రీత్ సింగ్, రోహిదాస్ లాంటి స్పెషలిస్టులు పెనాల్టీ కార్నర్లను గోల్సుగా మలిచే జట్టుగా ఉన్నారు.
గ్రూపులీగ్ లో వరుసగా రెండో విజయం సాధించిన జట్టుకే నేరుగా క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ రౌండ్ చేరే అవకాశం ఉండడంతో ఈరోజు జరిగే రెండోరౌండ్..ఇటు భారత్ కు, అటు ఇంగ్లండ్ కు డూ ఆర్ డై గా మారింది.
రూర్కెలా వేదికగా ఈరోజు రాత్రి జరిగే ఈమ్యాచ్ కు 20వేల మంది అభిమానులు హాజరు కానునున్నారు. రెండుజట్లూ గెలుపే లక్ష్యంగా పోటీకి సిద్ధమయ్యాయి. ర్యాంకుల పరంగా చూస్తే ఇంగ్లండ్ ఐదు, భారత్ ఆరు ర్యాంకుల్లో ఉన్నా...పోటీ మాత్రం హోరాహోరీగా సాగుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.