Telugu Global
Sports

చిన్నోడు బ్రాడ్ వీడ్కోలు..పెద్దోడు ఆండ‌ర్స‌న్ వీడ‌నంటున్నాడు

అన్ని ఫార్మాట్లలో కలిపి 396 అంతర్జాతీయ మ్యాచుల‌తో 977 వికెట్లు తీశాడు. మూడుసార్లు పదికి పది వికెట్ల‌ తీశాడు. టెస్టుల్లో 183 మ్యాచులు ఆడిన ఆండర్సన్ మొత్తం 690 వికెట్లు పడగొట్టాడు.

చిన్నోడు బ్రాడ్ వీడ్కోలు..పెద్దోడు ఆండ‌ర్స‌న్ వీడ‌నంటున్నాడు
X

ఇద్ద‌రూ ఇంగ్లండ్ క్రికెట‌ర్లే. ఇద్ద‌రూ దిగ్గ‌జాలే. బౌలింగ్ విభాగంలో మూల‌స్తంభాలే. అందులో ఒక‌రు పెద్దోడు. ఇంకొక‌రు చిన్నోడు. పెద్దోడు ఇంకా క్రికెట్ ఆడుతారా అంటే.. మీకేమైనా డౌటా..? ఐయామ్ ఫిట్. నా బౌలింగ్ కూడా ల‌య త‌ప్ప‌లేదు. ఇంకా క్రికెట్ చాలానే ఆడాల్సి ఉందంటున్నాడు. ఆయ‌నే జేమ్స్ ఆండ‌ర్స‌న్. వ‌య‌స్సు 41 సంవ‌త్స‌రాలు. ఫాస్ట్ బౌల‌ర్లు ఫిట్నెస్ స‌మ‌స్య‌లు ఎదుర్కొంటారు. కానీ, ఆండ‌ర్స‌న్‌కి ఆ స‌మ‌స్య‌లే కెరీర్‌లో పెద్ద‌గా ఎదురుకాలేదు. సుదీర్ఘ‌మైన కెరీర్‌లో ఫామ్ తో సంబంధం లేకుండా టీములో ప్లేస్ ఖాయంగా ఉండేది ఆండ‌ర్స‌న్ ఒక్క‌డికే.

ఇటీవ‌ల జ‌రిగిన యాషెస్ సిరీస్‌లో ఆండ‌ర్స‌న్ పెద్ద‌గా రాణించ‌లేదు. సిరీస్ మొత్తం మీద సాధించిన వికెట్లు 5 మాత్ర‌మే. జేమ్స్ కెరీర్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు 34 సార్లు పడగొట్టారు. 4 టెస్ట్ మ్యాచుల యాషెస్ సిరీస్‌లో క‌లిపి ఐదు వికెట్లు తీయ‌డంతో స‌త్తా అయిపోయింద‌నే వార్త‌లు వ‌చ్చాయి. రిటైర్మెంట్ స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డింద‌ని క్రికెట్ పండితులు వ్యాఖ్యానించారు. ఇదే విష‌యాన్ని జేమ్స్ ఆండర్సన్ ని అడిగితే, రిటైర్మెంట్ కి ఇప్పుడు ఏం అంత తొంద‌ర అంటూనే తాను మ‌రింత మంచి క్రికెట్ ఆడ‌గ‌ల‌నంటూ ధీమా వ్య‌క్తం చేశాడు.

అన్ని ఫార్మాట్లలో కలిపి 396 అంతర్జాతీయ మ్యాచుల‌తో 977 వికెట్లు తీశాడు. మూడుసార్లు పదికి పది వికెట్ల‌ తీశాడు. టెస్టుల్లో 183 మ్యాచులు ఆడిన ఆండర్సన్ మొత్తం 690 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 194 మ్యాచులు ఆడిన ఆండర్సన్ మొత్తం 269 వికెట్లు తీశాడు. అన్ని ఫార్మాట్ల‌లో ఇంత సుదీర్ఘ‌మైన క్రికెట్ ఆడిన జేమ్స్ ఆండ‌ర్స‌న్ రిటైర్ అయ్యేందుకు స‌సేమిరా అంటున్నాడు.

41 ఏళ్ల ఆండ‌ర్స‌న్ కంటే చిన్నోడైన స్టువ‌ర్ట్ బ్రాడ్ యాషెస్ సిరీస్ ముగిసిన వెంట‌నే రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. 37 ఏళ్ల బ్రాడ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. యాషెస్ సిరీస్‌లో 20 వికెట్లు ప‌డ‌గొట్టిన బ్రాడ్ సిరీస్ చివ‌రి మ్యాచులో అంద‌రినీ షాక్‌కి గురిచేస్తూ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్ర‌క‌టించారు. మూడు ఫార్మాట్లలోనూ కలిపి 880 వికెట్లు, టెస్టుల్లోనే 600కు పైగా వికెట్స్ తీసుకున్నాడు.

అంతా రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తార‌ని ఎదురుచూసిన జేమ్స్ ఆండ‌ర్స‌న్ తానింకా చాలా క్రికెట్ ఆడుతాన‌ని ప్ర‌క‌టించి షాక్ ఇవ్వ‌గా, మంచి ఫామ్‌లో ఉన్న బ్రాడ్ రిటైర్మెంట్ ప్ర‌క‌టించి క్రికెట్ పండితులు అవాక్క‌య్యేలా చేశాడు. 41 ఏళ్ల పెద్దోడు రిటైర్మెంట్‌కి టైముంద‌ని అంటుంటే, ఆయ‌న కంటే 4 ఏళ్ల చిన్నోడు బ్రాడ్ రిటైర‌య్యాడు.

First Published:  30 July 2023 6:47 PM IST
Next Story