ఐపీఎల్ కు డ్వయన్ బ్రావో గుడ్ బై!
ఐపీఎల్ దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ డ్వయన్ బ్రావో రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే చెన్నై ఫ్రాంచైజీతో తన అనుబంధం మరో రూపంలో కొనసాగుతుందని తేల్చి చెప్పాడు.
ఐపీఎల్ దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ డ్వయన్ బ్రావో రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే చెన్నై ఫ్రాంచైజీతో తన అనుబంధం మరో రూపంలో కొనసాగుతుందని తేల్చి చెప్పాడు....
ఐపీఎల్ లో గత పదిసీజన్లుగా మెరుపులు మెరిపించిన దిగ్గజ ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరుగా రిటైర్మెంట్ ప్రకటిస్తూ..ఫ్రాంచైజీలతో తమ అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ప్రధానంగా కరీబియన్ స్టార్ క్రికెటర్లే ఐపీఎల్ కు అల్విదా చెబుతూనే తమ సేవలను మరో రూపంలో అందించడానికి ఆసక్తి చూపుతున్నారు.
ముంబై ఇండియన్స్ కు దశాబ్దకాలం పాటు ఐపీఎల్ లో సేవలు అందించిన జెయింట్ ఆల్ రౌండర్ కిరాన్ పోలార్డ్ గత నెలలోనే రిటైర్మెంట్ ప్రకటించి..ముంబై ఫ్రాంచైజీ బ్యాటింగ్ కోచ్ గా కొనసాగనున్నట్లు ప్రకటించాడు.
అంతేకాదు..చెన్నై సూపర్ కింగ్స్ కు గత పుష్కరకాలంగా సేవలు అందించిన బౌలింగ్ ఆల్ రౌండర్ డ్వయన్ బ్రావో సైతం ఐపీఎల్ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు. అయితే..బౌలింగ్ కోచ్ గా ఫ్రాంచైజీతోనే కొనసాగుతానని వివరించాడు.
అత్యధిక వికెట్ల మొనగాడు..
ఐపీఎల్ గత 15 సీజన్ల చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా డ్వయన్ బ్రావోకు పేరుంది. బ్రావో మొత్తం 161 మ్యాచ్ లు ఆడి 183 వికెట్లు పడగొట్టాడు. 2023 సీజన్ నుంచి బాలాజీ స్థానంలో బౌలింగ్ కోచ్ గా బ్రావో పనిచేస్తాడని చెన్నై ఫ్రాంచైజీ యాజమాన్యం తెలిపింది.
ఐపీఎల్ ప్రారంభంలో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన బ్రావో 2010 సీజన్ నుంచి చెన్నై ఫ్రాంచైజీతోనే కొనసాగుతూ వచ్చాడు. సూపర్ కింగ్స్ నాలుగుసార్లు ఐపీఎల్ విజేతగా నిలవడంలో బ్రావో తనవంతు పాత్ర నిర్వర్తించాడు. రెండుసార్లు అత్యుత్తమ బౌలర్ కు ఇచ్చే పర్పుల్ క్యాప్ ను అందుకొన్నాడు. ఐపీఎల్ ఘనచరిత్రలో తన పాత్రా ఉండటం గర్వకారణమని, తనపేరుతో ఉన్న అత్యధిక వికెట్ల రికార్డు అలాగే ఉండిపోతుందని తాను భావించడం లేదని బ్రావో చెప్పుకొచ్చాడు.
వ్యక్తిగత కారణాలతోనే తాను ఆటగాడిగా రిటైరై..బౌలింగ్ కోచ్ గా చెన్నై ఫ్రాంచైజీ కుటుంబసభ్యుడిగా కొనసాగాలని నిర్ణయించినట్లు తెలిపాడు.