Telugu Global
Sports

రెండు మ్యాచ్‌లు ఓడితే చెత్త జట్టేనా - ద్రావిడ్

ఆసియా కప్ ఫైనల్స్ కు ఏడు సార్లు విజేత భారత్ చేరుకోలేకపోడాన్ని ప్రధాన శిక్షకుడు రాహుల్ ద్రావిడ్ గట్టిగా సమర్థించాడు. రెండు మ్యాచ్‌లు ఓడినంత మాత్రాన భారత్ చెత్త జట్టేం కాదంటూ విమర్శకులకు బదులిచ్చాడు.

రెండు మ్యాచ్‌లు ఓడితే చెత్త జట్టేనా - ద్రావిడ్
X

ఆసియా కప్ క్రికెట్ టోర్నీ చరిత్రలో భారత్‌కు ప్రత్యేకస్థానముంది. గత 14 ఆసియా కప్ టోర్నీలలో ఏడు సార్లు విజేతగా నిలిచిన ఏకైక జట్టు భారత్ మాత్రమే. అయితే...2022 ఆసియా కప్ టోర్నీ నాకౌట్ రౌండ్ చేరుకోడంలో భారత్ విఫల‌మైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న 15వ ఆసియా కప్ సమరంలో భారత్ డిఫెండింగ్ చాంపియన్‌గా, హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. గ్రూప్ - ఏ లీగ్‌లో రెండుకు రెండు మ్యాచ్‌లూ నెగ్గడం ద్వారా లీగ్ టాపర్‌గా సూపర్ - 4 రౌండ్లో అడుగుపెట్టింది. లీగ్ తొలిపోరులో పాకిస్థాన్‌ను 5 వికెట్లతో ఓడించిన భారత్...రెండో రౌండ్లో పసికూన హాంకాంగ్‌పైన భారీ విజయం నమోదు చేసింది.

సూపర్ - 4లో సూపర్ షాక్...

నాలుగు జట్ల సూపర్ - 4 రౌండ్లో పాకిస్థాన్ చేతిలో 5 వికెట్లు, శ్రీలంకపైన 6 వికెట్లు పరాజయాలు చవిచూసిన భారత్..తన ఆఖరి పోరులో అఫ్గనిస్థాన్‌పై భారీ విజయం సాధించినా..ఫైనల్స్ కు అర్హత సాధించలేకపోయింది. టీ-20లో టాప్ ర్యాంకర్ గా నిలిచిన భారత జట్టు ఆసియాకప్ ఫైనల్స్ కు అర్హత సాధించలేకపోడాన్ని విమర్శకులు, అభిమానులు తప్పుపట్టారు. తుది జట్టు కూర్పులో తరచూ మార్పులు చేయటం, మితిమీరిన ప్రయోగాలే భారత్ కొంపముంచాయంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే...ఈ విమర్శలకు భారత చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ తమదైన శైలిలో బదులిచ్చారు.

రాహుల్ రివర్స్ ఎటాక్...

డిఫెండింగ్ చాంపియన్‌గా ఆసియా కప్ టోర్నీలో అడుగుపెట్టి... ఫైనల్స్ చేరడంలో విఫలమైన భారత జట్టు స్వదేశానికి మాజీ చాంపియన్‌గా తిరిగిరావడంతో అభిమానులు అగ్గిమీద గుగ్గిలమే అయ్యారు. టీమ్ మేనేజ్‌మెంట్‌ను తప్పుపట్టారు. అయితే..చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాత్రం..తమ జట్టు గత తొమ్మిది మాసాలుగా అత్యుత్తమ క్రికెట్ ఆడుతూ వస్తోందని, ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌లో నిలవడమే దానికి నిదర్శనమని చెప్పారు. వరుసగా రెండు మ్యాచ్ లు ఓడితే భారత జట్టు రాత్రికి రాత్రే చెత్త జట్టుగా మారిపోతుందా? అంటూ ప్రశ్నించారు. రవీంద్ర జడేజా, బుమ్రా, హర్షల్ పటేల్, దీపక్ చహార్ లాంటి పలువురు కీలక ఆటగాళ్లకు గాయాలు కావడంతో జట్టులో తరచూ మార్పులు చేయాల్సి వస్తోందంటూ తమ నిర్ణయాలను ద్రావిడ్ సమర్థించుకున్నారు. ఆసియా కప్ ఫైనల్స్ కు తమ జట్టు చేరలేకపోడం నిజంగా దురదృష్టకరమని...అయితే...తమకు త్వరలో జరిగే ప్రపంచకప్ టోర్నీ మాత్రమే ముఖ్యమని చీఫ్ కోచ్ చెప్పుకొచ్చారు. టీ-20 మ్యాచ్‌ల్లో టాస్ ఓడినా, చిన్నతప్పు చేసినా ఓటమి చవిచూడాల్సి వస్తుందని, ఎంత గొప్పజట్టు అయినా పరాజయాలకు అతీతతం కాదన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలని ద్రావిడ్ సూచించారు.

పాకిస్థాన్, శ్రీలంక లాంటి బలమైన జట్లతో తాము ప్రతికూల పరిస్థితుల్లోనూ తుదివరకూ పోరాడగలిగామని, గెలుపు ఓటమిలను పక్కన పెట్టి తమ జట్టు ఎంత బాగా ఆడిందన్నదే ప్రధానమని రాహుల్ ద్రావిడ్ తేల్చి చెప్పారు. ప్రపంచకప్‌కు సన్నాహాలలో భాగంగా సెప్టెంబర్ 20 నుంచి ఆస్ట్రేలియాతో జరుగనున్న తీన్మార్ టీ-20 సిరీస్‌లో భారత్ పాల్గొనుంది. సిరీస్‌లోని తొలిపోరుకు మొహాలీ స్టేడియం వేదికగా రంగం సిద్ధమయ్యింది.

First Published:  10 Sept 2022 10:31 AM IST
Next Story