డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రా గోల్డెన్ షో!
భారత సూపర్ అథ్లెట్ నీరజ్ చోప్రా 2023 సీజన్ ను బంగారు పతకంతో మొదలు పెట్టాడు. డైమండ్ లీగ్ దోహా అంచెలో స్వర్ణపతకం సాధించాడు.
భారత సూపర్ అథ్లెట్ నీరజ్ చోప్రా 2023 సీజన్ ను బంగారు పతకంతో మొదలు పెట్టాడు. డైమండ్ లీగ్ దోహా అంచెలో స్వర్ణపతకం సాధించాడు.....
ప్రపంచ పురుషుల జావలిన్ త్రో విభాగంలో భారత సంచలనం నీరజ్ చోప్రా విజయపరంపర కొనసాగుతోంది. 2023 సీజన్ డైమండ్ లీగ్ తొలి అంచె సమరంలో నీరజ్ చోప్రా అలవోకగా బంగారు పతకం సాధించాడు.
ఖతర్ రాజధాని దోహాలోని ఖతర్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల జావలిన్ త్రో విభాగంలో 25సంవత్సరాల నీరజ్ చోప్రా 88.67 మీటర్ల రికార్డుతో అగ్రస్థానంలో నిలిచాడు.
నీరజ్ ను ఊరిస్తున్న 90 మీటర్ల లక్ష్యం...
గతేడాది స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన 2022 డైమండ్ లీగ్ టోర్నీలో తొలిసారిగా బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా 90 మీటర్ల రికార్డు సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు.
టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించడం ద్వారా ప్రపంచ అథ్లెటిక్స్ లోకి దూసుకొచ్చిన నీరజ్ చోప్రా ప్రస్తుత దోహా డైమండ్ మీట్ లో..తన తొలి ప్రయత్నంలోనే 88.67 మీటర్ల రికార్డు సాధించాడు. నీరజ్ తన ఐదుత్రోలలో...88.67, 86.04, 85.47, ఫౌల్ త్రో, , 84.37, 86.52 మీటర్లు మాత్రమే చేరుకోగలిగాడు. 90 మీటర్ల రికార్డు సాధించాలన్న ప్రయత్నం నెరవేరలేదు.
నీరజ్ కెరియర్ లో అత్యుత్తమంగా 89.94 మీటర్ల రికార్డు మాత్రమే నమోదు చేయడం విశేషం.
2018లో దోహా వేదికగా జరిగిన డైమండ్ లీగ్ లో 4వ స్థానం మాత్రమే సాధించిన నీరజ్..ఐదేళ్ల విరామం తర్వాత దోహా వేదికగానే స్వర్ణపతకం సాధించడం విశేషం.
చెక్ రిపబ్లిక్ కు చెందిన జాకబ్ వాడ్లెచ్ 88.63 మీటర్ల రికార్డుతో నీరజ్ తర్వాతి స్థానంలో నిలవడం ద్వారా రజత పతకంతో సరిపెట్టుకొన్నాడు.
టోక్యో ఒలింపిక్స్ లో సైతం నీరజ్, జాకబ్ మొదటి రెండుస్థానాలలో నిలిచారు.
గతేడాది జరిగిన దోహా డైమండ్ మీట్ లో జాకబ్ 90.88 మీటర్లరికార్డుతో రజత పతకం సాధించాడు. ఈ ఏడాది సైతం రజతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ప్రపంచ చాంపియన్, గత సీజన్ దోహా గోల్డ్ మెడలిస్ట్ యాండర్సన్ పీటర్స్ 85.88 మీటర్ల రికార్డుతో మూడోస్థానంలో నిలిచాడు.
2022 దోహా డైమండ్ మీట్ లో యాండర్సన్ పీటర్స్ 93.07 మీటర్ల రికార్డుతో బంగారు పతకం అందుకొన్నాడు.
ఆగస్టులో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ మీట్, సెప్టెంబర్లో జరిగే ఆసియాక్రీడల్లో భారత్ కు బంగారు పతకాలు అందివ్వాలన్న లక్ష్యంతో నీరజ్ సాధన చేస్తున్నాడు.
గాయాలకు దూరంగా....
ప్రస్తుత 2023 సీజన్లో తాను పాల్గొనాల్సిన టోర్నీలు చాలానే ఉన్నాయని, నిలకడగా రాణించడంతో పాటు ..గాయాలుకాకుండా చూసుకోడం కూడా ముఖ్యమేనని నీరజ్ చెప్పాడు.
డైమండ్ లీగ్ లో భాగంగా లాసానే ( జూన్ 30 ), మొనాకో ( జులై 21 ), జ్యూరిచ్ ( ఆగస్టు 31) అంచె పోటీలతో పాటు..యుజీన్ వేదికగా జరిగే డైమండ్ లీగ్ ఫైనల్ (సెప్టెంబర్ 16 )పోరులోనూ నీరజ్ పాల్గొనాల్సి ఉంది.
డైమండ్ లీగ్ ఒక్కో అంచెలో విజేతకు 10 వేల డాలర్లు, ఓవరాల్ చాంపియన్ కు 30 వేల డాలర్లు చొప్పున ప్రైజ్ మనీగా ఇస్తారు.
గత ఏడాది వరకూ ఇంగ్లండ్ లోని లాఫ్ బ్రో యూనివర్శిటీలో శిక్షణ పొందిన నీరజ్ ..ప్రస్తుత 2023 సీజన్లో మాత్రం దక్షిణాఫ్రికాలోని పోచెఫ్స్ స్ట్ర్రూమ్ లోనూ, టర్కీలోని అంటాల్యాలోనూ తన సాధన కొనసాగించనున్నాడు.
నీరజ్ చోప్రాకు క్లాజ్ బార్టోనిట్జ్ శిక్షకుడుగాను, ఇషాన్ మార్వా వ్యక్తిగత ఫిజియోగాను వ్యవహరిస్తున్నారు.
దోహా డైమండ్ లీగ్ తొలి అంచె విజయంతో నీరజ్ చోప్రా బంగారు పతకంతో పాటు 10వేల డాలర్ల ప్రైజ్ మనీని సైతం సొంతం చేసుకోగలిగాడు.