Telugu Global
Sports

అనుకోలేదు...కలగనలేదు... విరాట్!

తాను క్రికెట్లో అడుగుపెట్టినప్పుడు ఇన్ని పరుగులు చేస్తానని అనుకోలేదని, ఇన్ని సెంచరీలు సాధించగలనని కలగనలేదని నయామాస్టర్ విరాట్ కొహ్లీ ఆశ్చర్యపోతున్నాడు...

అనుకోలేదు...కలగనలేదు... విరాట్!
X

తాను క్రికెట్లో అడుగుపెట్టినప్పుడు ఇన్ని పరుగులు చేస్తానని అనుకోలేదని, ఇన్ని సెంచరీలు సాధించగలనని కలగనలేదని నయామాస్టర్ విరాట్ కొహ్లీ ఆశ్చర్యపోతున్నాడు...

విపరీతమైన పోటీ ఉన్న అంతర్జాతీయ క్రికెట్లోకి వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లు వరదలా వస్తూ పోతూ ఉంటారు. అయితే తమకంటూ ఓ ప్రత్యేకస్థానం సంపాదించుకొని అభిమానుల గుండెల్లో నిలిచిపోయే అతికొద్దిమంది క్రికెటర్లలో భారత క్రికెట్ నయా మాస్టర్, చేజింగ్ కింగ్ విరాట్ కొహ్లీ సైతం ఉండితీరుతాడు.

15 సంవత్సరాలు...79 శతకాలు, 26వేల పరుగులు!

2008 నుంచి 2023 ప్రస్తుత వన్డే ప్రపంచకప్ 8వ రౌండ్ మ్యాచ్ వరకూ విరాట్ కొహ్లీ ఒకేతీరుగా, అంకితభావంతో రాణిస్తూ వస్తున్నాడు. గత 15 సంవత్సరాల కాలంలో

400కు పైగా అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడి..క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ శతకాలు బాదిన అతికొద్దిమంది బ్యాటర్లలో విరాట్ కు ప్రత్యేకస్థానమే ఉంది.

అరడజను ప్రపంచ రికార్డులు, 79 శతకాలు, 26వేల పరుగులతో క్రికెట్ చరిత్రలోనే ఐదవ అత్యుత్తమ బ్యాటర్ గా విరాట్ కొనసాగుతున్నాడు.

కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన 8వ రౌండ్ మ్యాచ్ లో 101 పరుగులతో మాస్టర్ క్లాస్ శతకం బాదడం ద్వారా భారత ఆల్ టైమ్ గ్రేట్ సచిన్ టెండుల్కర్ 49 సెంచరీల ప్రపంచ రికార్డును విరాట్ సమం చేయడం ద్వారా చరిత్ర సృష్టించాడు. మిగిలిన ప్రపంచకప్ మ్యాచ్ ల్లోనే 50వ శతకంతో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాలన్న పట్టుదలతో ఉన్నాడు.

2008లో తన తొలి అంతర్జాతీయ వన్డే శతకం నమోదు చేసిన భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ లోనే విరాట్ 49వ శతకం సైతం సాధించడం, అదీ తన 35వ పుట్టినరోజునాడే నమోదు చేయడం ఓ అరుదైన ఘనతగా, అపూర్వఘట్టంగా మిగిలిపోతుంది.

సచిన్ టెండుల్కర్ ఆటను చూస్తూ తాను పెరిగానని, సచిన్ స్ఫూర్తితోనే బ్యాట్ పట్టానని..అయితే తాను క్రికెట్లోకి అడుగుపెట్టిన సమయంలో ఇన్ని పరుగులు చేస్తానని ఊహించలేదని, ఇన్ని శతకాలు సాధించగలనని కలనైనా అనుకోలేదని విరాట్ చెప్పాడు.

మాస్టర్ కు అసలు సిసలు వారసుడు!

భారత క్రికెట్ అనగానే గుండప్ప విశ్వనాథ్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, కపిల్ దేవ్‌, మహ్మద్ అజరుద్దీన్, సచిన్ టెండుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ లాంటి ఎందరో గొప్పగొప్ప విలక్షణ క్రికెటర్లు మనకు కనిపిస్తారు. అయితే 22 సంవత్సరాలపాటు భారత క్రికెట్ భారాన్ని తన భుజాల పైన వేసుకొని ఇటు టెస్టులు, అటు వన్డేలలో

డజన్ల కొద్దీ ప్రపంచ రికార్డులతో భారత క్రికెట్ ప్రతిష్టను ఎవరెస్టు ఎత్తుకు చేర్చిన ఘనత మాస్టర్ సచిన్ టెండుల్కర్ కు మాత్రమే దక్కుతుంది.

సచిన్ రిటైర్మెంట్ తర్వాత ఆ వారసత్వాన్ని, సుసంపన్నమైన ఆ పరంపరను కొనసాగించే బాధ్యతను నయామాస్టర్ విరాట్ కొహ్లీ తీసుకొన్నాడు. పుట్టుకతో వచ్చిన తన అసాధారణ ప్రతిభకు కష్టాన్ని, అంకితభావాన్ని జోడించి గత 15 సంవత్సరాలుగా పరుగుల హోరు, రికార్డుల జోరు కొనసాగిస్తున్నాడు.

అప్పుడు సచిన్... ఇప్పుడు విరాట్...

ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యధికంగా 51 టెస్టు, 49 వన్డే శతకాలతో 30వేలకు పైగా పరుగులు సాధించిన ఘనత సచిన్ కు మాత్రమే దక్కుతుంది. సచిన్ తరువాత అదేస్థాయి ఆటతీరుతో విరాట్ కొహ్లీ తన క్రికెట్ హీరో పేరుతో ఉన్న ఒక్కో రికార్డును అధిగమిస్తూ వస్తున్నాడు.

వన్డే క్రికెట్ చరిత్రలో గత కొద్ది సంవత్సరాలుగా సచిన్ పేరుతో ఉన్న అత్యధిక( 49 ) సెంచరీల ప్రపంచ రికార్డును విరాట్ సమం చేయగలిగాడు. సచిన్ 434 ఇన్నింగ్స్ లో సాధించిన రికార్డును విరాట్ కేవలం 277 ఇన్నింగ్స్ లోనూ సాధించడం విశేషం.

2008 నుంచి 2023 వరకూ....

2008 ఆగస్టు 18న శ్రీలంక ప్రత్యర్థిగా అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన విరాట్ గత 15 సంవత్సరాల కాలంలో క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తూ భారత బ్యాటింగ్ కే వెన్నెముకగా నిలిచాడు.

గత మూడేళ్ల వరుస వైఫల్యాల గడ్డుపరిస్థితిని అధిగమించి తిరిగి గాడిలో పడిన విరాట్ విశ్వరూపమే ప్రదర్శించాడు. భారత్ సాధించిన 2023 ఆసియాకప్,ఐసీసీ వన్డే ప్రపంచకప్ విజయాలలో తనవంతు పాత్ర నిర్వర్తించాడు.

2023 ప్రపంచకప్ 8వ రౌండ్ మ్యాచ్ వరకూ విరాట్ క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ కలిపి 79 శతకాలు, 26వేల పరుగులతో పాటు పలు ప్రపంచ రికార్డులు నమోదు చేశాడు. సచిన్ పేరుతో ఉన్న అరడజనుకు పైగా రికార్డులను ఇప్పటికే విరాట్ సవరించగలిగాడు.

ఇంతకు మించిన గౌరవం లేదు....

సచిన్ టెండుల్కర్ ప్రేరణతో క్రికెట్లోకి అడుగుపెట్టిన విరాట్ తన రికార్డులను చూసి తానే ఆశ్చర్యపోతున్నాడు. తాను క్రికెట్లోకి ప్రవేశించిన సమయంలో ఇన్ని సెంచరీలు, పరుగులు సాధిస్తానని కలనైనా అనుకోలేదని, చివరకు తన ఆరాధ్యక్రికెటర్ సచిన్ రికార్డులను అధిగమించే అదృష్టం తనకే దక్కడాన్ని మించిన గౌరవం మరొకటిలేదని మురిసిపోతున్నాడు.

పుష్కరకాలంపాటు డజన్లకొద్దీ సెంచరీలు, టన్నులకొద్దీ పరుగులు సాధించిన విరాట్ ఆ తర్వాతి మూడు సంవత్సరాలపాటు శతకాల కోసం విలవిలలాడాడు. 36 నెలలపాటు కనీసం ఒక్క సెంచరీ సాధించలేక తనలో తాను కుమిలిపోయాడు.

మూడేళ్ల గడ్డుపరిస్థితిని అధిగమించిన విరాట్ గతేడాది సెప్టెంబర్ తరువాత నుంచి 9 శతకాలు సాధించాడు. ఇందులో ఆరు వన్డే, రెండు టెస్టు సెంచరీలతో పాటు టీ-20 క్రికెట్లో సాధించిన ఓ శతకం సైతం ఉన్నాయి.

వెస్టిండీస్ తో ముగిసిన ఐసీసీ టెస్టు లీగ్ సిరీస్ వరకూ ఆడిన 111 టెస్టుల్లో 8వేల 676 పరుగులు, 288 వన్డేలలో 13వేలకు పైగా పరుగులు, 115 టీ-20 మ్యాచ్ ల్లో 4వేల8 పరుగులు సాధించాడు. టెస్టుల్లో 29 శతకాలు, 7 ద్విశతకాలు, 29 అర్థశతకాలు, వన్డేల్లో 49 శతకాలు, 70 అర్థశతకాలు, టీ-20ల్లో ఒక శతకం, 37 అర్థశతకాల ఘనత కేవలం విరాట్ కొహ్లీకి మాత్రమే సొంతం.

సచిన్ కేవలం టెస్టులు, వన్డేలకు మాత్రమే పరిమితమైతే...విరాట్ క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ ఒకేతీరుగా రాణిస్తూ దూసుకుపోతున్నాడు.

ఫిట్ నెస్సే విరాట్ అసలు బలం!

అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత ఫిట్ నెస్ కలిగిన అతికొద్దిమంది ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు. ప్రతిరోజు జిమ్ లో గంటల తరబడి శారీరక వ్యాయామాలు చేయటం, నియమబద్ధమైన ఆహారపు అలవాట్లతో 35 సంవత్సరాల వయసులో 20 ఏళ్ల కుర్రాడిలా ఫిట్ నెస్ ను కొనసాగిస్తూ వస్తున్నాడు. బ్యాట్ తో మాత్రమే కాదు..ఫీల్డింగ్ లోనూ మెరుపులు మెరిపించడం విరాట్ కు సాధారణ విషయమే.

రానున్న కాలంలోనూ విరాట్ ఇదే జోరు కొనసాగిస్తూ తన క్రికెట్ హీరో సచిన్ ను మించిపోవాలని కోరుకొందాం.!

First Published:  7 Nov 2023 3:53 AM GMT
Next Story