Telugu Global
Sports

డైమండ్ లీగ్ విన్నర్ నీరజ్ చోప్రా!

బల్లెంవిసురుడులో భారత సంచలనం నీరజ్ చోప్రా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు.

డైమండ్ లీగ్ విన్నర్ నీరజ్ చోప్రా!
X

నీరజ్ చోప్రా

బల్లెంవిసురుడులో భారత సంచలనం నీరజ్ చోప్రా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. 2022 డైమండ్ లీగ్ ఫైనల్లో బంగారు పతకం సాధించిన భారత తొలి అథ్లెట్ గా చరిత్ర సృష్టించాడు.

అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల జావలిన్ త్రోలో భారత సంచలనం నీరజ్ చోప్రా విజయపరంపర అప్రతిహతంగా కొనసాగుతోంది. ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ జావలిన్ త్రో బంగారు పతకాలు సాధించిన నీరజ్...ప్రపంచ పోటీలలో రజత పతకం సైతం సాధించడం ద్వారా తనకుతానే సాటిగా నిలిచాడు.

అంతేకాదు..ప్రపంచ మేటి చాంపియన్ల మధ్య స్విట్జర్లాండ్ వేదికగా జరిగే డైమండ్ లీగ్ లో సైతం నీరజ్ చోప్రా సత్తా చాటుకొన్నాడు.

జ్యూరిక్ వేదికగా జరిగిన 2022 డైమండ్ లీగ్ ఫైనల్స్ లో నీరజ్ 88.44 మీటర్ల రికార్డుతో బంగారు పతకం, ట్రోఫీ అందుకొన్నాడు. చెక్ రిపబ్లిక్ అథ్లెట్ జాకోబ్ వాడ్లేచ్ 86.94 మీటర్లతో రజత పతకంతో సరిపెట్టుకొన్నాడు. జర్మనీకి చెందిన జూలియన్ వెబెర్ 83.73 మీటర్ల రికార్డుతో కాంస్య పతకం సాధించాడు.

నీరజ్ తన తొలిప్రయత్నం ఫౌల్ తో ముగించాడు. జాకోబ్ 84.15 మీటర్లతో తన తొలిత్రోను విజయవంతంగా ముగించాడు. నీరజ్ తన రెండో ప్రయత్నంలో 88 మీటర్ల లక్ష్యం చేరాడు.

జాకోబ్ 4వ ప్రయత్నంలో 86.94 మీటర్ల పుంజుకోగలిగాడు. అయితే తన 5వ ప్రయత్నంలో 87 మీటర్ల దూరం బల్లెం విసిరిన నీరజ్ చివరకు 88.44 మీటర్ల రికార్డుతో విజేతగా నిలిచాడు.

2018 కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం, ఆసియాక్రీడల స్వర్ణం, 2021 టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించడం ద్వారా భారత పతాకాన్ని రెపరెపలాడించిన నీరజ్..2022 డైమండ్ లీగ్ ఫైనల్స్ లో సైతం చాంపియన్ గా నిలవడం ద్వారా తనకుతానే సాటిగా నిలిచాడు.

First Published:  9 Sept 2022 9:40 AM IST
Next Story