మహిళా ఐపీఎల్ లో ఢిల్లీ టాప్, ప్లేఆఫ్ రౌండ్లో యూపీ!
ప్రారంభ మహిళా ఐపీఎల్ ప్లే-ఆఫ్ రౌండ్ కు ఢిల్లీ, ముంబై, యూపీ జట్లు చేరుకొన్నాయి. బెంగళూరు, గుజరాత్ జట్లు రౌండ్ రాబిన్ లీగ్ దశ నుంచే నిష్క్ర్రమించాయి.
ప్రారంభ మహిళా ఐపీఎల్ ప్లే-ఆఫ్ రౌండ్ కు ఢిల్లీ, ముంబై, యూపీ జట్లు చేరుకొన్నాయి. బెంగళూరు, గుజరాత్ జట్లు రౌండ్ రాబిన్ లీగ్ దశ నుంచే నిష్క్ర్రమించాయి...
భారత క్రికెట్ బోర్డు మహిళల కోసం తొలిసారిగా నిర్వహిస్తున్న 2023 మహిళా ఐపీఎల్ ప్లే-ఆఫ్ రౌండ్ కు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ముంబై వేదికగా ఐదుజట్ల నడుమ రెండు వేదికల్లో గత మూడువారాలుగా నిర్వహిస్తున్న రౌండ్ రాబిన్ లీగ్ దశ పోటీలు ముగింపు దశకు చేరాయి.
లీగ్ టేబుల్ టాపర్ గా ఢిల్లీ క్యాపిటల్స్...
డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ మొదటి ఏడురౌండ్ల పోటీలు ముగిసే సమయానికి ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ ఐదేసి విజయాలతో చెరో 10 పాయింట్ల చొప్పున సాధించి మొదటి రెండుస్థానాలలో నిలిచాయి. ఆఖరి (8వ) రౌండ్ పోటీలలో ముంబై, ఢిల్లీ, యూపీ, బెంగళూరు తలపడాల్సి ఉంది.
అయితే ..అలీసా హేలీ నాయకత్వంలోని యూపీ వారియర్స్ జట్టు సైతం ప్లే-ఆఫ్ రౌండ్లో తన బెర్త్ ఖాయం చేసుకోగలిగింది. ముంబై బ్రబోర్న్ స్టేడియం వేదికగా ముగిసిన 7వ రౌండ్ పోరులో యూపీజట్టు 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ను అధిగమించడం ద్వారా నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టింది.
ఈ కీలక పోరులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. ఆల్ రౌండర్ గార్డ్‌నర్ (39 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), హేమలత (33 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో గుజరాత్ ప్రత్యర్థి ఎదుట 179 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. యూపీ బౌలర్లలో పార్షవి, రాజేశ్వరి చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
గ్రేస్ హారిస్ ధనాధన్....
179 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన యూపీ వారియర్స్ మరో బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకోగలిగింది. 19.5 ఓవర్లలో 7 వికెట్ల నష్షానికే 181 పరుగుల స్కోరుతో విజేతగా నిలిచింది. సూపర్ హిట్టర్ గ్రేస్ హారిస్ కేవలం 41 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. తహిలా మెక్‌గ్రాత్ (38 బంతుల్లో 57; 11 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించడంతో యూపీ వారియర్స్ కీలక విజయంతో ప్లే ఆఫ్ బెర్త్ సొంతం చేసుకోగలిగింది. గుజరాత్ బౌలర్లలో కిమ్ గార్డ్నర్ రెండు వికెట్లు పడగొట్టింది. గ్రేస్ హారిస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఈ విజయంతో యూపీ వారియర్స్ 7 రౌండ్లలో 4 విజయాలు, 8 పాయింట్లతో లీగ్ టేబుల్ లో మూడో అత్యుత్తమజట్టుగా నిలిచింది.
ముంబైకి దెబ్బ మీద దెబ్బ....
రౌండ్ రాబిన్ లీగ్ మొదటి ఐదురౌండ్లలోనే వరుస విజయాలు సాధించడం ద్వారా ప్లేఆఫ్ రౌండ్ చేరిన తొలిజట్టుగా నిలిచిన ముంబై ఇండియన్స్ కు ఆ తర్వాత రెండురౌండ్లలో వరుస పరాజయాలు ఎదురయ్యాయి.
నవీ ముంబై డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన 7వ రౌండ్ మ్యాచ్ లో ముంబైని ఢిల్లీ 9 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులు మాత్రమే చేయగలిగింది.
పూజ వస్ర్తాకర్ (26), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (23), వాంగ్ (23) మినహా మిగిలిన బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో మరినె కాప్, శిఖ పాండే, జెస్ జాన్సన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇప్పటికే లీగ్‌లో తన ఫీల్డింగ్ విన్యాసాలతో ఆకట్టకున్న భారత యువ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ ఈ మ్యాచ్‌లో రెండు సూపర్ క్యాచ్‌లతో మ్యాచ్ ను మలుపు తిప్పింది. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 9 ఓవర్లలో వికెట్ నష్టానికి 110 రన్స్ చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (32 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్), షఫాలీ వర్మ (33; 6 ఫోర్లు, ఒక సిక్సర్), అలీసా కాప్సీ (38 నాటౌట్; ఒక ఫోర్, 5 సిక్సర్లు) పరుగుల మోత మోగించారు.
ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్ టేబుల్ టాపర్ గా నిలవడం ద్వారా ముంబైని రెండోస్థానానికి నెట్టింది.
అదానీ, మాల్యాజట్లు అవుట్...
మహిళా ఐపీఎల్ గ్రూప్ లీగ్ దశ నుంచే గౌతమ్ అదానీకి చెందిన గుజరాత్ జెయింట్స్, విజయ్ మాల్యాకు చెందిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్లు నిష్క్ర్రమించాయి.
లీగ్ దశలోని మొత్తం ఎనిమిది రౌండ్ మ్యాచ్‌లు ఆడేసిన గుజరాత్ జెయింట్స్ రెండు విజయాలు మాత్రమే సాధించి 4 పాయింట్లతో టేబుల్ అట్టడుగున నిలిచింది.
స్మృతి మందన నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మొదటి ఏడురౌండ్ల మ్యాచ్ ల్లో రెండే విజయాలతో లీగ్ టేబుల్ ఆఖరి నుంచి రెండోస్థానంలో నిలవడం ద్వారా ప్లే-ఆఫ్ రౌండ్ కు దూరం కావాల్సి వచ్చింది.
ఈరోజు జరిగే రౌండ్ రాబిన్ లీగ్ ఆఖరి రౌండ్ పోటీలతో తొలిఅంచె లీగ్ దశకు తెరపడనుంది.