బ్రిజ్ భూషణ్ పై కేసులు వీగిపోకతప్పదా?
జాతీయ కుస్తీ సమాఖ్య అధ్యక్షుడిపై నమోదు చేసిన కేసులు వీగిపోయేలా చేయటానికి ఢిల్లీ పోలీసులు చురుకుగా పనిచేస్తున్నారు.
మహిళావస్తాదులు భయపడినంతా జరిగింది. జాతీయ కుస్తీ సమాఖ్య అధ్యక్షుడిపై నమోదు చేసిన కేసులు వీగిపోయేలా చేయటానికి ఢిల్లీ పోలీసులు చురుకుగా పనిచేస్తున్నారు....
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారత్ లో రాజకీయ శక్తిని మించిన శక్తి మరేదీ లేదని మరోసారి తేలిపోయింది. భారత చట్టాలు బలహీనుల విషయంలో బలంగానూ, బలవంతుల విషయంలో బలహీనంగానూ ఉంటాయని తేటతెల్లమయ్యింది.
ఓ మర్డర్ కేసుతో సహా 43 ఎఫ్ఐర్ లు నమోదైన అధికార పార్టీ ఎంపీ ఏడుగురు మహిళా వస్తాదుల నుంచి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నా తన రాజకీయశక్తితో న్యాయవ్యవస్థకే సవాలు విసురుతున్నాడు.
తన కుమార్తెల వయసున్న రెజ్లర్లను రకరకాలుగా వేధించినట్లుగా తీవ్రఆరోపణలు ఎదుర్కొంటున్నా కమలనాథుల అండదండలు పుష్కలంగా ఉండటంతో నిర్భయంగా తనదైన శైలిలో హల్ చల్ చేస్తున్నాడు.
పోక్సో కేసు ఎత్తివేయాలన్న ఢిల్లీ పోలీసులు...
భారత కుస్తీ సమాఖ్య అధ్యక్షుడి హోదాలో సంవత్సరాల తరబడి తిరుగులేని అధికారం చెలాయించిన బ్రిజ్ భూషణ్ తూర్పు ఉత్తరప్రదేశ్ లోని కేసరిగంజ్ నియోజక వర్గం నుంచి బీజెపీ సభ్యుడిగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
బ్రిజ్ భూషణ్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమను లైంగికంగా పలువిధాలుగా వేధించినట్లు ఓ మైనర్ బాలికతో సహా మొత్తం 7గురు మహిళా వస్తాదులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేయటానికి ఢిల్లీపోలీసులు తటపటాయిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టుజోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దేశసర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతోనే బీజెపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. వాటిలో ఒకటి పోక్సో కేసు. మైనర్ బాలికల పై అత్యాచారానికి పాల్పడినా, లైంగిక వేధింపులకు గురి చేసినా..పోక్సో కేసును నమోదు చేశారు. ఈ కేసు నమోదైతే నాన్ బెయిలబుల్ వారెంట్ పొందే అవకాశం కూడా ఉండదు.
మైనర్ బాలికగా ఉన్న ఓ వస్తాదు చేసిన ఫిర్యాదుతో బ్రిజ్ భూషణ్ పై పోక్సో కేసును నమోదు చేశారు.
అయితే..హర్యానాకు చెందిన ఆ మైనర్ బాలిక తండ్రిపై బ్రిజ్ భూషణ్ పలువిధాలుగా ఒత్తిడి తెచ్చి, ప్రలోభాల ఎరవేసి కేసును నీరుగార్చేలా చేయటంలో సఫలమైనట్లుగా..
ఢిల్లీ పోలీసుల ప్రకటనలను బట్టే తెలుస్తోంది.
తగిన ఆధారాలు లేవు- ఢిల్లీ పోలీసులు..
బ్రిజ్ భూషణ్ పై ఢిల్లీ పోలీసులు బలహీనమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని, కేసులు వీగిపోయేలా చేయటానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆందోళన చేపట్టిన వస్తాదులు ముందు నుంచీ చెబుతూనే వస్తున్నారు.
బ్రిజ్ భూషణ్ తమకంటే ఎన్నోరెట్లు, ఎన్నోవిధాలుగా బలవంతుడని, దేశంలోని అధికారపార్టీ అండదండలు పుష్కలంగా ఉన్నాయంటూ వస్తాదుల గతంలోనే ప్రకటించారు.
బ్రిజ్ భూషణ్ ను తక్షణమే అరెస్టు చేయకుంటే తన పలుకుబడితో తిమ్మినిబొమ్మిని చేస్తాడని వస్తాదుల బృందం పలు సందర్భాలలో చెబుతూ వచ్చింది.
వెయ్యి పేజీల నివేదిక.. హుష్ కాకి..
బ్రిజ్ భూషణ్ పై పోక్సో కేసు నమోదు చేసి, విచారణ పూర్తి చేసిన ఢిల్లీ పోలీసులు 1000 పేజీల నివేదికను తయారు చేశారు. బ్రిజ్ భూషణ్ పై చేసిన ఆరోపణలకు బలమైన ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. పైగా విచారణ ప్రారంభంకావటానికి ముందే..పోక్సో కేసును ఎత్తివేయాలంటూ కోర్టును కోరటం కలకలం రేపింది.
ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు రూపొందించిన వెయ్యి పేజీల నివేదిక పలు అనుమానాల్ని రేకెత్తిస్తోంది. పోక్సో చట్టం కింద ఎంపీ బ్రిజ్ భూషణ్‌పై నమోదైన కేసును ఎత్తేయాలంటూ ఈ నివేదికలో ఢిల్లీ పోలీసులు కోర్టును కోరటం సంచలనంగా మారింది. ఏప్రిల్ 21న బ్రిజ్ భూషణ్‌పై ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా, బాధితుల్లో ఒక మైనర్ ఉన్నారు.
ఈ నేపథ్యంలో పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లను నమోదుచేశారు. ఈ రెండు ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు, లైంగిక వేధింపులు, ప్రలోభాలు పెడుతూ, బెదిరింపులకు గురి చేస్తూ వెంబడించటంపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. దీనిపై రౌస్ ఎవెన్యూ కోర్టు జూన్ 22న విచారణ మొదలు పెట్టాల్సి ఉంది. మైనర్ రెజ్లర్ పెట్టిన కేసులో ధ్రువీకరించే సాక్ష్యాలు లేవంటూ 500 పేజీల నివేదికను పటియాలా హౌస్ కోర్టుకు పోలీసులు సమర్పించారు. పోక్సో కేసు కొట్టేయాలని కోర్టును కోరారు. ఈ నివేదికపై కోర్టు జులై 4న విచారణ చేపట్టనుంది. కేసును ఎత్తేయాలంటూ పోలీసులే నివేదిక ఇవ్వటాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. ఓ వైపు మహిళా రెజ్లర్లపై ఒత్తిడి తీసుకొస్తూ, మరోవైపు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయాలంటూ 1150 మంది లేఖ...
మహిళావస్తాదులను లైంగికంగా వేధించిన బ్రిజ్ భూషణ్ ను తక్షణమే అరెస్టు చేయాలంటూ 1150 మంది మాజీ ప్రముఖుల బృందం ఓ లేఖను విడుదల చేసింది.
ఈ బృందంలో మాజీ సివిల్ సర్వెంట్లు, న్యాయకోవిదులు, బ్యూరోక్రాట్లు, విఖ్యాత రచయుతలు, ఇతర ప్రముఖులు ఉన్నారు.
దేశానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన మహిళావస్తాదులను లైంగికంగా వేధించిన వ్యక్తిని ఇంకా ఎందుకు కటకటాలవెనుక వేయలేదని వారు తమ లేఖలో నిలదీశారు. పైగా తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టిన బాధిత వస్తాదులపై ఢిల్లీపోలీసులు దాష్టీకం చేయటం ఏంటని ప్రశ్నించారు.
2023 జనవరి 18 నుంచి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వస్తాదుల బృందం నిరసన దీక్ష నిర్వహిస్తూ వస్తోంది.
దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్నా..అంతర్జాతీయంగా భారత క్రీడారంగ పరువు మంటకలుస్తున్నా..కేంద్ర ప్రభుత్వం మాత్రం తన ఎంపీ పై ఈగవాల కుండా కాపాడుకొంటూ వస్తోంది.
నిరసన దీక్ష చేపట్టిన వస్తాదుల కుటుంబాలన్నీ బీజెపీ వ్యతిరేక ఓటర్లు కావడంతో మోడీ సర్కార్ ఏమాత్రం పట్టించుకోడం లేదని కూడా ప్రచారం జోరుగా సాగుతోంది.