ఢిల్లీ ఢమాల్...ముంబై తొలిగెలుపు!
ఐపీఎల్ -16 లీగ్ లో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ తొలివిజయం నమోదు చేసింది.
ఐపీఎల్ -16 లీగ్ లో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ తొలివిజయం నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ పై ఆఖరి బంతి విజయంతో ఊపిరి పీల్చుకొంది..
ఐపీఎల్ గత 15 సీజన్లలో ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్ ప్రస్తుత 16వ సీజన్ లీగ్ లో తొలి గెలుపు కోసం రెండు మ్యాచ్ ల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
పది జట్ల లీగ్ మొదటి రెండురౌండ్ల పోరులో బెంగళూరు, చెన్నై జట్ల చేతిలో పరాజయాలు చవిచూసిన ముంబై..మూడోరౌండ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తుదివరకూ పోరాడి 6 వికెట్ల విజయంతో ఊపిరి పీల్చుకొంది.
ఢిల్లీ భారీస్కోరు సాధించినా....!
న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముగిసిన లీగ్ 16వ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య ఢిల్లీ క్యాపిటల్స్ 19.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటయ్యింది. ప్రత్యర్థి ఎదుట 173 పరుగుల భారీలక్ష్యం ఉంచినా..తుదివరకూ పోరాడినా పరాజయం తప్పలేదు.
హోంగ్రౌండ్లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీకి చక్కటి ఆరంభం దక్కినట్లే కనిపించింది. గత మూడు మ్యాచ్‌ల్లో వరుసగా విఫలమవుతూ వచ్చిన డాషింగ్ ఓపెనర్ పృథ్వీ షా ధాటిగా ఆడుతూ 3 బౌండ్రీలతో 15 పరుగులు సాధించి అవుటయ్యాడు.మరోవైపు కెప్టెన్ కమ్ ఓపెనర్ వార్నర్ తన ట్రేడ్ మార్క్ షాట్లతో ఆడటంతో ఢిల్లీ స్కోరుబోర్డు పరుగులెత్తింది.
నిలదొక్కుకొంటున్న తరుణంలో పృథ్వీ షా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మనీశ్ పాండే (26; 5 ఫోర్లు) బ్యాట్ ఝళిపించి 5 బౌండ్రీలతో 26 పరుగులకు అవుటయ్యాడు.
ఇదే అదనుగా ముంబై స్పిన్నర్లు పట్టుబిగించారు. ఢిల్లీ వికెట్ల వెంట వికెట్ కోల్పోతూ ఉక్కిరిబిక్కిరయ్యింది. జూనియర్ ప్రపంచకప్ ఆటగాడు, అరంగేట్రం బ్యాటర్ యష్ ధుల్ (2), రావ్‌మన్ పావెల్ (4), లలిత్ యాదవ్ (2) ఒకరి తరువాత ఒకరిగా వెనుదిరగడంతో ఢిల్లీ 98 పరుగులకే 5 వికెట్లు నష్టపోయి పీకలోతు కష్టాలలో కూరుకుపోయింది.
వార్నర్, అక్షర్ హాఫ్ సెంచరీలు...
అయితే..జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించే బాధ్యతను కెప్టెన్ వార్నర్, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తమ భుజాలపైన వేసుకొన్నారు. పోరాటయోధుడు డేవిడ్ వార్నర్ 47 బంతుల్లో 6 బౌండ్రీలతో 51 పరుగులు సాధించాడు. గత నాలుగుమ్యాచ్ ల్లో వార్నర్ కు ఇది మూడో హాఫ్ సెంచరీ కావడం విశేషం.
మరో వైపు స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (25 బంతుల్లో 4 బౌండ్రీలు, 5 సిక్సర్లతో 54 పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు.
పేసర్ బెహ్రన్‌డార్ప్ వేసిన 19వ ఓవర్లో ఢిల్లీ వెంట వెంటనే నాలుగు వికెట్లు కోల్పోయింది. దూకుడుమీదున్న అక్షర్ తొలి బంతికి క్యాచ్ ఔట్ కాగా.. వార్నర్ ఆ వెనుకే పెపీలియన్ చేరాడు. లోయర్ ఆర్డర్లో కుల్దీప్ యాదవ్ (0) రనౌట్ కాగా.. చివరి బంతికి అభిషేక్ పొరెల్ (1) కూడా దొరికిపోయాడు. చివరకు ఢిల్లీ 19.4 ఓవర్లలో 172 పరుగుల స్కోరుతో ఇన్నింగ్స్ ముగించింది. ముంబై బౌలర్లలో లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా 4 వికెట్లు, జాసెన్ బెహ్రన్‌డార్ఫ్ మూడు వికెట్లు పడగొట్టారు.
రోహిత్ రెండేళ్ల తర్వాత....
173 పరుగుల విజయలక్ష్యంతో చేజింగ్ కు దిగిన ముంబైకి ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ- ఇషాన్ కిషన్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు.తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించారు కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన శైలిలో దూకుడుగా ఆడుతూ (45 బంతుల్లో 4 సిక్సర్లు, 6 బౌండ్రీలతో 65 పరుగుల స్కోరు సాధించాడు.
ఐపీఎల్ లో రోహిత్ కు గత రెండేళ్లలో ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 6 బౌండ్రీలతో 31 పరుగులకు రనౌట్ కాగా..
హైదరాబాదీ యంగ్ గన్ తిలక్ వర్మ 28 బంతుల్లోనే 4 సిక్సర్లు, సింగిల్ ఫోర్ తో 41 పరుగులు సాధించడం ద్వారా తనవంతు పాత్ర పోషించాడు.
360 హిట్టర్ సూర్యకుమార్ మరోసారి డకౌట్ తో నిరాశ పరిచాడు. ఇన్నింగ్స్ చివర్లో పరిస్థితి ఉత్కంఠను కలిగించినా...యువబ్యాటర్ కామెరూన్ గ్రీన్ (17 నాటౌట్), టిమ్ డేవిడ్ (13 నాటౌట్) జట్టును విజేతగా నిలిపారు. ముంబై కేవలం 4 వికెట్ల నష్టానికే 173 పరుగుల విజయలక్ష్యం సాధించగలిగింది.
ఢిల్లీ బౌలర్లలో ముఖేశ్ కుమార్ వికెట్లు తీశారు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఒక వికెట్ దక్కింది. ముంబై కెప్టెన్ రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
అరుదైన రికార్డులు...
ఈమ్యాచ్ లో పలు అరుదైన రికార్డులు నమోదయ్యాయి. ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ లో 600 బౌండ్రీలు సాధించిన రెండో బ్యాటర్ గా నిలిచాడు.
వార్నర్ 51 పరుగులు సాధించడం ద్వారా శిఖర్ ధావన్ పేరుతో ఉన్న అత్యధిక పరుగులు సాధించిన నాలుగో ఢిల్లీ బ్యాటర్ రికార్డును అధిగమించాడు.
ఢిల్లీ ఫ్రాంచైజీ తరపున వార్నర్ 2097 పరుగులు సాధించినట్లయ్యింది. శిఖర్ ధావన్ ఢిల్లీ తరపున 72 మ్యాచ్ ల్లో 2066 పరుగులు సాధించాడు.
విరాట్ ను మించిన రోహిత్...
ఢిల్లీ క్యాపిటల్ పై 65 పరుగులు స్కోరు సాధించడం ద్వారా ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ..33 మ్యాచ్ ల్లో 987 పరుగులు, 130కి పైగా స్ట్ర్రయిక్ రేట్ తో
విరాట్ కొహ్లీ పేరుతో ఉన్న రికార్డును తెరమరుగు చేశాడు. ఢిల్లీ ప్రత్యర్థిగా విరాట్ కొహ్లీకి 26 మ్యాచ్ ల్లో 925 పరుగులు సాధించిన రికార్డు ఉంది.
రోహిత్ శర్మ రెండేళ్ల విరామం తరువాత అర్థశతకం సాధించగలిగాడు. అంతేకాదు..ఐపీఎల్ లో 19వసారి మ్యాన్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు అందుకోగలిగాడు.
ముంబై లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా 4 వికెట్లు పడగొట్టడం ద్వారా ఢిల్లీ ప్రత్యర్థిగా అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు. చావ్లా 23 ఇన్నింగ్స్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రత్యర్థిగా 27 వికెట్లు సాధించాడు. అశ్విన్ పేరుతో ఉన్న 24 వికెట్ల రికార్డును చావ్లా అధిగమించాడు.
ప్రస్తుత సీజన్లో ఢిల్లీకి ఇది వరుసగా నాలుగో ఓటమి కాగా..ముంబైకి మూడురౌండ్లలో ఇదే తొలిగెలుపు.
చెన్నైచెపాక్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి 7-30కి జరిగే 17వ మ్యాచ్ లో మాజీ చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి.