ఢిల్లీ వరుసగా 5వ ఓటమి, బెంగళూరు, పంజాబ్ విజయాలు!
ఐపీఎల్ -16 లో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదో ఓటమితో లీగ్ టేబుల్ ఆఖరిస్థానానికి పడిపోయింది....
ఐపీఎల్ -2023వ సీజన్ లీగ్ పోటీలు ఆసక్తికరంగా సాగిపోతున్నాయి. 10 జట్లు, 70 మ్యాచ్ ల లీగ్ లో మ్యాచ్ మ్యాచ్ కూ ఆధిక్యత చేతులు మారిపోతూ వస్తోంది.
మొత్తం 10 జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ మినహా మిగిలిన 9జట్లు కనీసం ఒక్క రౌండ్ విజయమైనా సాధించడం ద్వారా పాయింట్ల పట్టికలో తమ ఖాతాను తెరువగలిగాయి.
ఢిల్లీకి ఇదేమి శాపం..!
రిషభ్ పంత్ కెప్టెన్ గా గత సీజన్ వరకూ ఐపీఎల్ అగ్రశ్రేణిజట్లలో ఒకటిగా కొనసాగిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుత సీజన్లో మాత్రం పాతాళానికి పడిపోయింది. కారుప్రమాదం దెబ్బతో కెప్టెన్ పంత్ జట్టుకు దూరం కావడంతో సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఢిల్లీ పగ్గాలు చేపట్టాడు.
ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ చీఫ్ కోచ్ గా, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ డైరెక్టర్ గా ఉన్న ఢిల్లీ జట్టు ప్రస్తుత సీజన్లో భాగంగా ఇప్పటి వరకూ ఆడిన ఐదుకు ఐదురౌండ్ల మ్యాచ్ ల్లోనూ పరాజయాలతో అట్టడుగుకు పడిపోయింది. కనీసం ఒక్కగెలుపూ సాధించని జట్టుగా మిగిలిపోయింది.
బెంగళూరు చేతిలోనూ పరాజయం..
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన 5వ రౌండ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఆతిథ్య రాయల్ చాలెంజర్స్ 23 పరుగులతో చిత్తు చేసింది.
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు..20 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగుల స్కోరు నమోదు చేసింది. మాజీ కెప్టెన్ కమ్ ఓపెనర్ విరాట్ కోహ్లీ (34 బంతుల్లో 50; 6 ఫోర్లు, ఒక సిక్సర్) సీజన్‌లో మూడో అర్ధసెంచరీ నమోదు చేసుకోగా.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (22; 3 ఫోర్లు, ఒక సిక్సర్), మహిపాల్ (26; 2 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (24; 3 సిక్సర్లు), షాబాజ్ అహ్మద్ (20 నాటౌట్; 3 ఫోర్లు) సాధించడంతో బెంగళూరు ప్రత్యర్థి ఎదుట 175 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, మిషెల్ మార్ష్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
టాపార్డర్ ఫ్లాప్...
175 పరుగుల విజయలక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ ప్లే ఓవర్లలోనే ఓపెనర్ పృథ్వీ షా, వన్ డౌన్ మిషెల్ మార్షల వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది. కెప్టెన్ కమ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సైతం 19 పరుగులకే వెనుదిరగడంతో జట్టు భారం మిడిలార్డర్ బ్యాటర్ మనీశ్ పాండేపైన పడింది.
యష్ ధుల్ (1), అభిషేక్ పొరెల్ (5), అక్షర్ పటేల్ (21) లాంటి కీలక ఆటగాళ్లు సైతం విఫలం కావడంతో మనీశ్ పాండే ఒంటరిపోరాటం చేశాడు. 38 బంతుల్లో 5 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో తుదివరకూ పోరాడినా ప్రయోజనం లేకపోయింది.
చివరకు ఢిల్లీజట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెంగళూరు బౌలర్లలో అరంగేట్రం బౌలర్ విజయ్ కుమార్ 3 వికెట్లు ,సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టారు. మెరుపు హాఫ్ సెంచరీతో పాటు ఫీల్డర్ గా మెరుపులు మెరిపించిన విరాట్ కొహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఢిల్లీకి ఇది వరుసగా ఐదో ఓటమి కాగా..బెంగళూరుకు నాలుగురౌండ్లలో రెండోగెలుపు.
లక్నో కు పంజాబ్ దెబ్బ...
లక్నో ఏక్నా స్టేడియం వేదికగా జరిగిన మరోపోరులో ఆతిథ్య లక్నో సూపర్ జెయింట్స్- పంజాబ్ కింగ్స్ జట్ల పోరు నువ్వానేనా అన్నట్లుగా సాగింది. గాయంతో కెప్టెన్ శిఖర్ ధావన్ దూరం కావడంతో..సామ్ కరెన్ స్టాండిన్ కెప్టెన్ గా పంజాబ్ తన అదృష్టం పరీక్షించుకొని సఫలమయ్యింది.
ఆఖరి ఓవర్ వరకూ పట్టుగా సాగిన ఈ పోరులో పంజాబ్ 2 వికెట్ల విజయంతో లక్నోను కంగు తినిపించింది.
ముందుగా బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగుల స్కోరు సాధించింది. కెప్టెన్ కెఎల్ రాహుల్ 74 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఓపెనర్లు రాహుల్ (56 బంతుల్లో 74; 8 ఫోర్లు, ఒక సిక్సర్), కైల్ మేయర్స్ (29; ఒక ఫోర్, 3 సిక్సర్లు) మినహా మిగిలిన లక్నో బ్యాటర్లు చెప్పుకోదగిన స్కోర్లు సాధించలేకపోయారు. .పంజాబ్ బౌలర్లలో పేస్ బౌలర్లు సామ్ కరన్ 3, కగిసో రబడ రెండు వికెట్లు, హర్‌ప్రీత్ బ్రార్, సికిందర్ రజా, అర్ష్‌దీప్ సింగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
సికిందర్ రజా ఆల్ రౌండ్ షో...
మ్యాచ్ నెగ్గాలంటే 160 పరుగులు చేయాల్సిన పంజాబ్ 19.3 ఓవర్లలో 8 వికెట్లకు 161పరుగుల స్కోరుతో విజేతగా నిలిచింది. జింబాబ్వే స్పిన్ ఆల్ రౌండర్ సికందర్ రజా (41 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మాథ్యూ షార్ట్ (34; 5 ఫోర్లు, ఒక సిక్సర్) పోరాడి తమజట్టు విజయంలో ప్రధాన పాత్ర వహించారు
డెత్ ఓవర్లలో బ్యాటింగ్ కు దిగిన షారుక్ ఖాన్ (10 బంతుల్లో 23 నాటౌట్; ఒక ఫోర్, 2 సిక్సర్లు) కీలక పరుగులతో లక్నోకు విజయం దక్కకుండా చేశాడు. లక్నో బౌలర్లలో యుధ్‌వీర్ సింగ్, రవి బిష్ణోయ్, మార్క్ వుడ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. సికందర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఐపీఎల్ లో సికిందర్ రజాకు ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం.
ఐదురౌండ్లలో పంజాబ్ కు ఇది మూడో గెలుపు కాగా..నాలుగురౌండ్లలో లక్నో సూపర్ జెయింట్స్ కు ఇది రెండో ఓటమి.
ఈ రోజు జరిగే డబుల్ హెడ్డర్ సమరంలో ముంబై ఇండియన్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. 3-30కి ప్రారంభమయ్యే మ్యాచ్ కు ముంబై వాంఖడే స్టేడియం, రాత్రి 7-30 మ్యాచ్ కు అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యమిస్తాయి.