Telugu Global
Sports

టీ-20 ల్లో దీప్తి శర్మ 100 వికెట్ల రికార్డు!

టీ-20 క్రికెట్లో వంద వికెట్ల మైలురాయిని చేరిన భారత తొలి క్రికెటర్ గా దీప్తి శర్మ అరుదైన రికార్డు నెలకొల్పింది. పురుషులు సాధించలేని రికార్డును దీప్తి సాధించింది.

టీ-20 ల్లో దీప్తి శర్మ 100 వికెట్ల రికార్డు!
X

టీ-20 క్రికెట్లో వంద వికెట్ల మైలురాయిని చేరిన భారత తొలి క్రికెటర్ గా దీప్తి శర్మ అరుదైన రికార్డు నెలకొల్పింది. పురుషులు సాధించలేని రికార్డును దీప్తి సాధించింది...

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో భారత పురుషులు సాధించలేని రికార్డును ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ సొంతం చేసుకొంది. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న 2023 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ గ్రూప్ లీగ్ లో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన పోరులో దీప్తి ఈ అరుదైన రికార్డు నమోదు చేసింది.

పురుషుల విభాగంలో యజువేంద్ర చాహల్, జస్ ప్రీత్ బుమ్రా లాంటి దిగ్గజ బౌలర్లు సాధించలేని ఘనతను 25 సంవత్సరాల దీప్తి సొంతం చేసుకొంది. 20 ఓవర్ల ఫార్మాట్లో..వంద వికెట్ల మైలురాయిని చేరిన భారత తొలిబౌలర్ గా చరిత్ర సృష్టించింది.

వెస్టిండీస్ తో జరిగిన రెండోరౌండ్ మ్యాచ్ లో దీప్తి 15 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టడం ద్వారా భారతజట్టుకు 6 వికెట్ల విజయం అందించింది. 2021 సీజన్లో టీ-20 అరంగేట్రం చేసిన దీప్తి కేవలం 89 మ్యాచ్ లు, 87 ఇన్నింగ్స్ లోనే 100 వికెట్ల మైలురాయిని చేరుకోగలిగింది.

యజువేంద్ర చహాల్ ను మించిన దీప్తి...

పురుషుల టీ-20లో అత్యధిక టీ-20 వికెట్లు పడగొట్టిన రికార్డు లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ పేరుతో ఉంది. చహాల్ 75 మ్యాచ్ ల్లో 91 వికెట్లతో బౌలర్ నంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. అయితే..మహిళల విభాగంలో దీప్తి 89 మ్యాచ్ ల్లో 100 వ వికెట్ ను పడగొట్టగలిగింది.

మహిళా టీ-20ల్లో భారత్ తరపున అత్యధికంగా 72 మ్యాచ్ ల్లో 98 వికెట్లు పడగొట్టిన రికార్డు పూనమ్ యాదవ్ పేరుతో ఉంది. ఆ రికార్డును దీప్తి ప్రస్తుత ప్రపంచకప్ ద్వారా తెరమరుగు చేసింది.

మహిళా టీ-20లో వంద వికెట్లు మైలురాయిని చేరిన 7వ బౌలర్ గా దీప్తి గుర్తింపు సంపాదించుకొంది. మహిళా టీ-20 చరిత్రలో వెస్టిండీస్ స్పిన్నర్ అనీసా మహ్మద్ 117 మ్యాచ్ ల్లో 125 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. పాక్ బౌలర్ నిదా ధర్ 121 వికెట్లు, ఆస్ట్ర్రేలియా మీడియం పేసర్ ఎలీస్ పెర్రీ 120 వికెట్లతో మొదటి మూడుస్థానాలలో నిలిచారు.

పురుషుల టీ-20ల్లో టిమ్ సౌథీ టాప్..

టీ-20 క్రికెట్ పురుషుల విభాగంలో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ 107 మ్యాచ్ ల్లో 134 వికెట్లు, బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ 109 మ్యాచ్ ల్లో 128 వికెట్లు, రషీద్ ఖాన్ 74 మ్యాచ్ ల్లో 122 వికెట్లు, న్యూజిలాండ్ లెగ్ స్పిన్నర్ ఇష్ సోధీ 91 మ్యాచ్ ల్లో 114 వికెట్లు, శ్రీలంక మాజీ పేసర్ లాసిత్ మలింగ 84 మ్యాచ్ ల్లో 107 వికెట్లతో ..టాప్-5 బౌలర్లుగా ఉన్నారు.

భారత క్రికెట్లో భువనేశ్వర్ కుమార్ 87 మ్యాచ్ ల్లో 90 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ 65 మ్యాచ్ ల్లో 72 వికెట్లు పడగొట్టడం ద్వారా..యజువేంద్ర చహాల్ తర్వాతి స్ధానంలో ఉన్నారు.

భారత టీ-20 చరిత్రలో పురుషుల కంటే ఓ మహిళే ( దీప్తి శర్మ ) ముందుగా వంద వికెట్ల మైలురాయిని చేరటం విశేషం.

First Published:  17 Feb 2023 11:32 AM IST
Next Story