ఉత్కంఠ పోరులో ధోనీ పోరాడినా రాజస్థాన్ దే గెలుపు!
ఐపీఎల్ రౌండ్ రాబిన్ లీగ్ మరో కీలక పోరులో చెన్నై కెప్టెన్ ధోనీ తుదివరకూ పోరాడినా రాజస్థాన్ రాయల్స్ చేతిలో 3 పరుగుల ఓటమి తప్పలేదు.
ఐపీఎల్ రౌండ్ రాబిన్ లీగ్ మరో కీలక పోరులో చెన్నై కెప్టెన్ ధోనీ తుదివరకూ పోరాడినా రాజస్థాన్ రాయల్స్ చేతిలో 3 పరుగుల ఓటమి తప్పలేదు...
ఐపీఎల్ -16వ సీజన్లో ఉత్కంఠభరిత మ్యాచ్ ల పరంపర కొనసాగుతోంది.గత మూడుమ్యాచ్ లుగా ఒకదానిని మించి మరొకటి రసపట్టుగా సాగుతోంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఆఖరి బంతి వరకూ సస్పెన్స్ థ్రిల్లర్లా సాగిన లీగ్ 17వ మ్యాచ్ లో మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో నాలుగుసార్లు విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ పై సంచలన విజయం సాధించింది.
ధోనీ మ్యాచ్ లో రాయల్ షో...
ఐపీఎల్ ఎవర్ గ్రీన్ స్టార్, చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం మహేంద్రసింగ్ ధోనీ సారథిగా జరిగిన ఈ 200వ మ్యాచ్ ను చిరస్మరణీయంగా మిగుల్చుకోవాలనుకొన్న ఆతిథ్యజట్టుకు నిరాశే మిగిలింది.
కీలక టాస్ నెగ్గి ముందుగా చెన్నైజట్టు ఫీల్డింగ్ ఎంచుకోడంతో..బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగుల స్కోరు సాధించింది.
డాషింగ్ ఓపెనర్
జోస్ బట్లర్ 36 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్స్‌లతో 52 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. వన్ డౌన్ దేవ్‌దత్ పడిక్కల్ (38 పరుగులు, 26 బంతుల్లో, 5 ఫోర్లు) సైతం ధాటిగా ఆడి కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ 22 బంతుల్లో 2 సిక్సర్లు, ఓ బౌండ్రీతో సహా 30 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. డెత్ ఓవర్లలో హేట్‌మేయర్ 18 బంతుల్లో 2 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేయడంతో రాజస్థాన్ రాయల్స్ ప్రత్యర్థి ఎదుట 176 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచగలిగింది.
చెన్నై బౌలర్లలో రవీంద్రా జడేజా , ఆకాష్ సింగ్ , తుషార్ దేశ్‌పాండ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఆఫ్ స్పిన్నర్ మోయిన్ అలీకి ఓ వికెట్ దక్కింది.
చెన్నైకి రాజస్థాన్ స్పిన్నర్ల పగ్గాలు..
176 పరుగుల విజయలక్ష్యంతో చేజింగ్ కు దిగిన చెన్నైకి రాజస్థాన్ స్పిన్ త్రయం అశ్విన్, చాహల్, ఆడం జంపా..మిడిల్ ఓవర్లలో పగ్గాలు వేశారు. సూపర్ హిట్టర్లు ధోనీ, జడేజా క్రీజులో నిలిచినా...సూపర్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 172 పరుగులు మాత్రమే చేయగలిగింది.
సూపర్ కింగ్స్ కి ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే గట్టి దెబ్బ తగిలింది. సూపర్ ఫామ్ లో ఉన్న డాషింగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (8) ను సీమర్ సందీప్ శర్మ పడగొట్టాడు. గత మ్యాచ్ లో ముంబైపై చెలరేగి ఆడిన అజింక్యా రహానే 31 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. రెండో వికెట్ కు ఓపెనర్ డేవిడ్ కాన్వేతో కలసి కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు .రహానే (19 బంతుల్లో 31, 2 ఫోర్లు, 1 సిక్సర్) తో కలిసి డెవాన్ కాన్వే (38 బంతుల్లో 50, 6 ఫోర్లు) లు చెన్నైని గాడిలో పెట్టారు.
అయితే..మిడిల్ ఓవర్లలో రాయల్స్ స్పిన్ త్రయం అశ్విన్, చాహల్, ఆడం జంపా వ్యూహం ప్రకారం బౌల్ చేసి చెన్నైని అదుపులో ఉంచగలిగారు.
ఒక దశలో 113 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన చెన్నైగెలుపు భారం సూపర్ హిట్టింగ్ జోడీ జడేజా- ధోనీల పైన పడింది. రవీంద్ర జడేజా (15 బంతుల్లో 25 నాటౌట్, 1 ఫోర్, 2 సిక్సర్లు), ధోని (17 బంతుల్లో 32 నాటౌట్, 1 ఫోర్, 3 సిక్సర్ల )తో ధాటిగా ఆడి పోరాడినా ఫలితం లేకపోయింది. మ్యాచ్ నెగ్గాలంటే ఆఖరి బంతికి 5 పరుగులు చేయాల్సిన చెన్నైని సీమర్ సందీప్ శర్మ ఓ సూపర్ యార్కర్ తో నిలువరించడంతో పాటు 2 పరుగులకే పరిమితం చేయటంతో రాజస్థాన్ 3 పరుగుల సంచలన విజయం సాధించగలిగింది. చెన్నై ఓపెనర్ కాన్వే ఫైటింగ్ హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్ గా నిలిస్తే..రాయల్స్ బౌలర్లలో అశ్విన్, చాహల్ చెరో 2 వికెట్లు, సందీప్ శర్మ, ఆడం జంపా చెరో వికెట్ పడగొట్టారు. రాజస్థాన్ రాయల్స్ విజయంలో ప్రధానపాత్ర వహించిన రవిచంద్రన్ అశ్విన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
2008 తర్వాత రాయల్స్ తొలిగెలుపు...
గతేడాది రన్నరప్ రాజస్థాన్ రాయల్స్ కు చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా 2008 తర్వాత ఇదే తొలిగెలుపు. గత ఆరుసీజన్లుగా చెన్నై వేదికగా ఆడిన మ్యాచ్ ల్లో పరాజయాలు చవిచూస్తూ వచ్చిన రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుత 2023 సీజన్ మ్యాచ్ లో మాత్రం 3 పరుగుల చిరస్మరణీయ విజయం సాధించగలిగింది.
2008 నుంచి 2023 సీజన్ తొలి అంచె పోరు వరకూ ఈ రెండుజట్లూ 26 మ్యాచుల్లో తలపడితే చెన్నై 15 సార్లు, రాజస్థాన్ 11 మ్యాచుల్లో విజేతలుగా నిలిచాయి. చెన్నైసూపర్ కింగ్స్ సారథిగా తన 200వ మ్యాచ్ లో విజయం సాధించాలన్న కెప్టెన్ ధోనీ ఉత్సాహంపై రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల సంచలన విజయంతో నీళ్లు చల్లినట్లయ్యింది.
మొహాలీ పంజాబ్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి 7-30కి ప్రారంభమయ్యే 18వ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ పోటీపడనుంది.
అశ్విన్, చాహల్ రెండేసి వికెట్లు తీయగా, ఆఖరి ఓవర్లో సందీప్‌శర్మ(1/30) అద్భుతం చేశాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన లోకల్ హీరో అశ్విన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
ధోనీ చెలరేగినా:
ఎన్నో మ్యాచ్‌లను తన అద్భుత బ్యాటింగ్‌తో ప్రత్యర్థుల నుంచి లాక్కున్న దిగ్గజ బ్యాటర్ మహేంద్రసింగ్ ధోనీకి చుక్కెదురైంది. రాజస్థాన్ నిర్దేశించిన లక్ష్యఛేదనలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(8) వికెట్ కోల్పోయిన చెన్నైని కాన్వె ఆదుకున్నాడు. రాయల్స్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ రహానే(31)తో కలిసి కొనసాగించాడు. రహానే ఒక రకంగా దూకుడు కనబర్చగా, కాన్వె సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి బ్యాటింగ్‌తో ఒకానొక దశలో మెరుగ్గా కనిపించిన కింగ్స్‌ను స్పిన్నర్లు అశ్విన్,చాహల్, జంపా కట్టడి చేశారు. ఈ త్రయం ధాటికి చెన్నై వరుస విరామల్లో వికెట్లు కోల్పోయింది. ఆఖరి ఓవర్లో విజయానికి 21 పరుగులు అవసరమైన దశలో ధోనీ రెండు భారీ సిక్స్‌లతో గెలుపుపై ఆశలు రేపినా..సందీప్‌శర్మ పదునైన యార్కర్లతో రాయల్స్‌కు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు.
200 రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ద్వారా ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున 200 మ్యాచ్‌ల్లో మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
సంక్షిప్త స్కోర్లు
రాజస్థాన్: 20 ఓవర్లలో 175/8(బట్లర్ 52, హెట్‌మైర్ 30 నాటౌట్, జడేజా 2/21, దేశ్‌పాండే 2/37), చెన్నై: 20 ఓవర్లలో 172/6(కాన్వె 50, ధోనీ 32 నాటౌట్, అశ్విన్ 2/25, చాహల్ 2/27)