Telugu Global
Sports

వీడిన వానముప్పు, నేడు ఐపీఎల్ టైటిల్ ఫైట్!

ఐపీఎల్-16వ సీజన్ ఫైనల్స్ వానదెబ్బతో రిజర్వ్ డే రోజున జరగటానికి రంగం సిద్ధమయ్యింది. వానముప్పు వీడినట్లేనని, రాత్రి 7-30కి మ్యాచ్ ప్రారంభంకానుందని నిర్వాహక సంఘం ప్రకటించింది.

వీడిన వానముప్పు, నేడు ఐపీఎల్ టైటిల్ ఫైట్!
X

ఐపీఎల్-16వ సీజన్ ఫైనల్స్ వానదెబ్బతో రిజర్వ్ డే రోజున జరగటానికి రంగం సిద్ధమయ్యింది. వానముప్పు వీడినట్లేనని, రాత్రి 7-30కి మ్యాచ్ ప్రారంభంకానుందని నిర్వాహక సంఘం ప్రకటించింది.

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను గత 7వారాలుగా అలరిస్తూ వచ్చిన ఐపీఎల్ -16వ సీజన్ ఫైనల్ కు వానముప్పు తొలిగినట్లేనని వాతావరణశాఖ ప్రకటించింది.

సూపర్ సండే ఫైట్ గా జరగాల్సిన ఈ టైటిల్ పోరు..అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా కురిసిన కుండపోత వర్షం కారణంగా మరుసటి( సోమవారానికి )రోజుకు వాయిదా పడింది.

నిబంధనల ప్రకారం వర్షంతో మ్యాచ్ జరిగే అవకాశం లేకపోతే..రిజర్వ్ డే నాడు నిర్వహిస్తామని గతంలోనే ఐపీఎల్ బోర్డు ప్రకటించింది.

దంచికొట్టిన వాన.....

డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన ఐపీఎల్ టైటిల్ సమరం కుండపోతగా కురిసిన వర్షంతో ఒక్కబంతి పడకుండానే నిలిచిపోయింది.

ఫైనల్స్ ప్రారంభానికి ముందు నుంచే అహ్మదాబాద్‌లో భారీ వర్షం కురిసింది. అప్పుడప్పుడు వరుణుడు కాస్త శాంతించినట్లు కనిపించడంతో మ్యాచ్‌ ప్రారంభించేందుకు నిర్వాహక సంఘం ఏర్పాట్లు చేసినా.. తిరిగి వర్షం మొదలుకావడంతో అది సాధ్యపడలేదు.

పిచ్ తో సహా గ్రౌండ్ లోని కీలక ప్రాంతాలను కవర్లతో కప్పి ఉంచినా..అవుట్ ఫీల్డ్ మాత్రం వాననీటితో నిండిపోయింది. దీంతో అంపైర్లు, మ్యాచ్ రిఫరీ పలుమార్లు

పరిశీలించిన అనంతరం మ్యాచ్‌ను కనీసం 5 ఓవర్లపాటైనా నిర్వహించే అవకాశం లేకుండా పోయిందని, నిబంధనల ప్రకారం రిజర్వే డేకి వాయిదా వేయటం మినహా వేరేదారిలేదని ప్రకటించారు.

రెండుజట్ల శిక్షకులు, కెప్టెన్లతో సంప్రదించిన అనంతరం రాత్రి 11 గంటలకు.. మ్యాచ్‌ రెఫరీ జవగల్‌ శ్రీనాథ్‌ మ్యాచ్‌ రిజర్వ్‌ డేకు వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

టికెట్ల కొన్న అభిమానులకు ఊరట...

ఐపీఎల్ టైటిల్ సమరం చూడటానికి స్టేడియంలోని లక్ష టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు ఊరట కలిగేలా నిర్వాహక సంఘం నిర్ణయం తీసుకొంది.

టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులు.. తమ వద్దనున్న టికెట్లతోనే సోమవారం మ్యాచ్‌కు హాజరుకావొచ్చని ప్రకటించారు. సోమవారం కూడా వర్షం కారణంగా మ్యాచ్‌ సాగకపోతే.. లీగ్‌ దశలో ఎక్కువ పాయింట్లు సాధించిన గుజరాత్‌ టైటాన్స్‌ను విజేతగా ప్రకటించే అవకాశం ఉంది.

ఈరోజు పూర్తిస్థాయిలో మ్యాచ్...

నేటికి వాయిదా పడిన ఐపీఎల్ ఫైనల్స్ కు ఎలాంటి వానముప్పులేదని, పూర్తిస్థాయిలో 40 ఓవర్లపాటు మ్యాచ్ కొనసాగుతుందని నిర్వాహక సంఘం ప్రకటిచింది.

వాతావరణ శాఖ నివేదిక ప్రకారం..మ్యాచ్ జరిగే సమయంలో వానపడే అవకాశం కేవలం 3 శాతం మాత్రమే ఉండడంతో నిర్వాహక సంఘంతో పాటు, రెండుజట్ల ఆటగాళ్లు, కోట్లాదిమంది అభిమానులు ఊపిరి పీల్చుకొన్నారు.

ఒకవేళ రిజర్వ్ డే ( సోమవారం )నాడు సైతం వర్షంతో మ్యాచ్ కు అంతరాయం కలిగితే..విజేతను నిర్ణయించడానికి 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహిస్తారు. అదీ సాధ్యం కాకపోతే..

సూపర్ ఓవర్ విధానం ప్రకారం మ్యాచ్ ఫలితాన్ని తేల్చనున్నారు. సూపర్ ఓవర్ వేయటానికీ వాతావరణం అనుకూలించకుంటే..లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టునే విజేతగా ప్రకటించనున్నారు.

మొత్తం 70 లీగ్ మ్యాచ్ లు, 14 రౌండ్లలో గుజరాత్ టైటాన్స్ జట్టు 10 విజయాలు 4 పరాజయాలు, 20 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలవడం ద్వారా ప్లే-ఆఫ్ రౌండ్ కు చేరుకోగలిగింది.

మరోవైపు..చెన్నై సూపర్ కింగ్స్ 14 రౌండ్లలో 8 విజయాలు, 5 పరాజయాలతో 17 పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ రెండోస్థానంలో నిలిచింది.

రాత్రి 7-30 కి ప్రారంభమయ్యే టైటిల్ సమరంలో విజేతగా నిలిచిన జట్టుకు 20 కోట్ల రూపాయలు, రన్నరప్ జట్టుకు 13 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ సొంతం కానుంది.

First Published:  29 May 2023 1:54 PM IST
Next Story