హెడ్డర్ గోల్స్‌లో రొనాల్డో ప్రపంచ రికార్డు!
ఆధునిక ఫుట్ బాల్‌లో రికార్డుల రారాజు క్రిస్టియానో రొనాల్డో మరో అరుదైన ఘనత సాధించాడు. హెడ్డర్ గోల్స్ సాధనలో తానే కింగ్‌నని చాటుకున్నాడు.
ప్రపంచ ఫుట్ బాల్ మేటి స్ట్రయికర్లలో ఒకడిగా ఇప్పటికే పలు అరుదైన రికార్డులు నెలకొల్పిన పోర్చుగల్ కమ్ అల్ నాజర్ క్లబ్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో మరో రికార్డును తన ఖాతాలో వెసుకున్నాడు. ప్రొఫెషనల్ సాకర్ లీగ్ లో వరుసగా 22వ సీజన్ లోనూ గోల్ సాధించిన తొలి, ఏకైక ప్లేయర్ గా నిలిచాడు. అంతర్జాతీయ ఫుట్ బాల్ లో పోర్చుగల్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న రొనాల్డో.. సౌదీ అరేబియా లీగ్ లో అల్ నాజర్ క్లబ్ కు నాయకత్వం వహిస్తున్నాడు.
మ్యూలర్ ను మించిన రొనాల్డో..
ఫుట్ బాల్ చరిత్రలో అత్యధిక హెడ్డర్ గోల్స్ సాధించిన ప్లేయర్ గా ఇప్పటివరకూ జర్మన్ ఆల్ టైమ్ గ్రేట్ గెర్డ్ మ్యూలర్ పేరుతో ఉన్న 144 గోల్స్ రికార్డును 38 సంవత్సరాల క్రిస్టియానో రొనాల్డో తెరమరుగు చేశాడు. ట్యునీసియా క్లబ్ మోనాస్టిర్ తో జరిగిన కీలక పోరులో అల్ నాజర్ క్లబ్ 2-1 గోల్స్ విజయం సాధించడంలో క్రిస్టియానో రొనాల్డో ప్రధానపాత్ర వహించాడు. స్కోరు 1-1తో సమమైన తరుణంలో రొనాల్డో.. ఆట 74వ నిమిషంలో లభించిన హెడ్డర్ ను గోలుగా మలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఎవర్ గ్రీన్ క్రిస్టియానో రొనాల్డో..
ప్రత్యర్థి గోల్ సమీపంలో గాల్లోకి 10 అడుగుల ఎత్తున ఎగిరి తలతో బంతిని నెట్టడంలో రొనాల్డోకు సాటి ఎవరూ లేరు. తన కెరియర్ లో గత 22 సంవత్సరాలుగా లీగ్ సాకర్ ఆడుతూ వస్తున్న రొనాల్డో ఇప్పటికే ఐదుసార్లు ప్రతిష్టాత్మక బాలోన్ డి ఓర్ ట్రోఫీలు అందుకున్నాడు. వరుసగా 22 సంవత్సరాలపాటు ప్రతిసీజన్ లోనూ గోల్ సాధిస్తూ వచ్చిన మొనగాడిగా నిలిచాడు. రొనాల్డో ఇప్పటి వరకూ మొత్తం 145 హెడ్డర్ గోల్స్ తో అగ్రస్థానంలో నిలిచాడు. వయసు మీద పడుతున్న తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని, తన ఆటతీరు గతంలో మాదిరిగానే..అంతకు మించిన పరిణతితో సాగుతోందని రొనాల్డో చాటుకొంటూ వస్తున్నాడు. గతంలో యూరోపియన్ సాకర్ క్లబ్ లు మాంచెస్టర్ యునైటెడ్,యువెంటస్, రియల్ మాడ్రిడ్ క్లబ్ ల తరఫున ఆడుతూ వచ్చిన రొనాల్డో గత ఏడాది నుంచి సౌదీ అరేబియన్ క్లబ్ అల్ నాజర్ కు ఆడుతున్నాడు.
రెండున్నర ఏళ్ళకు 2వేల కోట్లు..
క్రిస్టియానో రొనాల్డో వచ్చే రెండున్నర సంవత్సరాల పాటు సౌదీక్లబ్ తరఫున ఆడటానికి 2వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. ఏడాదికి 800 కోట్ల రూపాయలు వేతనంగా అందుకోనున్నాడు. క్రిస్టియానో రొనాల్డోకి ఏడాదికి 75 మిలియన్ పౌండ్లు చొప్పున చెల్లిస్తారని, ఈ కాంట్రాక్టు మన రూపాయలలో 2వేల కోట్లకు సమానమని సాకర్ వర్గాలు అంటున్నాయి.
సరైన సమయంలో..
యూరోప్ నుంచి ఆసియా లీగ్ కు రావడాన్ని క్రిస్టియానో రొనాల్డో సమర్థించుకున్నాడు. ఆసియాలో సాకర్ ప్రమాణాలు అనూహ్యంగా పెరిగాయని, భవిష్యత్ ఆసియాదేనని చెప్పాడు. ఇటీవలే ముగిసిన ప్రపంచకప్ లో జపాన్, కొరియా, సౌదీ అరేబియా జట్ల ఆటతీరే దానికి నిదర్శనమని రొనాల్డో చెప్పాడు. యూరోపియన్ లీగ్ ఫుట్ బాల్ లో తాను దాదాపుగా అన్ని విజయాలు చవిచూశానని.. ఇక అక్కడ సాధించాల్సింది ఏమీలేదని తేల్చి చెప్పాడు.
పోర్చుగల్ కు యూరోపియన్ ఫుట్ బాల్ టైటిల్ ను అందించిన క్రిస్టియానో రొనాల్డోకి ఐదు వేర్వేరు ప్రపంచకప్ టోర్నీలలో గోల్స్ సాధించిన అరుదైన రికార్డు ఉంది. 2009- 2018 వరకూ రియల్ మాడ్రిడ్ తరపున స్పానిష్ లీగ్ లో ఆడిన రొనాల్డో రెండు లాలీగా టైటిల్స్, రెండు స్పానిష్ కప్పులు, నాలుగు చాంపియన్స్ లీగ్ టైటిల్స్, మూడు ప్రపంచ క్లబ్ టైటిల్స్ సాధించాడు. 2021 నుంచి మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ కు ఆడిన రొనాల్డో.. ఆ క్లబ్ మేనేజర్ ఎరిక్ టెన్ హాగ్ తో పొసగక కాంట్రాక్టు రద్దు చేసుకున్నాడు. రియల్ మాడ్రిడ్ క్లబ్ తరపున 451 మ్యాచ్ లు ఆడి 800కు పైగా గోల్స్ సాధించిన ఘనత రొనాల్డోకి ఉంది. యువెంటస్ క్లబ్ తరఫున మూడేళ్లపాటు ఇటాలియన్ సాకర్ లీగ్ లో ఆడిన రొనాల్డో రెండు సీరీ ఏ టైటిల్స్ తో పాటు కోపా ఇటాలియా ట్రోఫీని మూడేళ్లపాటు తన జట్టుకు అందించాడు.