క్రిస్టియానో రొనాల్డోకి నిషేధం దెబ్బ!
పోర్చుగీసు సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకి నిషేధం షాక్ తగిలింది. సౌదీ సాకర్ క్లబ్ అల్-నాజర్ అరంగేట్రం కోసం మరికొద్దిరోజులపాటు వేచిచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.
పోర్చుగీసు సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకి నిషేధం షాక్ తగిలింది. సౌదీ సాకర్ క్లబ్ అల్-నాజర్ అరంగేట్రం కోసం మరికొద్దిరోజులపాటు వేచిచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది....
ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలోనే 2వేల కోట్ల రూపాయల అతిపెద్ద కాంట్రాక్టు సంపాదించిన పోర్చుగల్ కెప్టెన్, ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన సూపర్ స్ట్ర్రయికర్ క్రిస్టియానో రొనాల్డో పరిస్థితి ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా తయారయ్యింది.
గత ఏడాది వరకూ ఇంగ్లండ్ కు చెందిన మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ కు ఆడుతూ వచ్చిన రొనాల్డో తనజట్టు మేనేజర్ తో వచ్చిన అభిప్రాయ భేదాలతో అర్థంతరంగా కాంట్రాక్టును రద్దు చేసుకొని బయటపడ్డాడు.
ఆ తర్వాత నుంచి రొనాల్డో ప్రధాన ఆటగాడి స్థాయి నుంచి సబ్ స్టిట్యూట్ స్థాయికి పడిపోయాడు. చివరకు 2022 ఫీఫా ప్రపంచకప్ లో సైతం జట్టు మేనేజర్ సబ్ స్టిట్యూట్ ఆటగాడిగానే ఉపయోగించుకొన్నారు.
2వేల కోట్ల రూపాయల రికార్డు కాంట్రాక్టు..
37 సంవత్సరాల క్రిస్టియానో రొనాల్డో తన కెరియర్ లో అధికభాగం యూరోపియన్ క్లబ్ జట్లు యువెంటస్, లిస్బన్, రియల్ మాడ్రిడ్, మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ లకే ఆడుతూ వచ్చాడు. అయితే..తన కెరియర్ చరమాంకంలో మాత్రం సౌదీ అరేబియాలోని అల్ -నాజర్ క్లబ్ కు ఆడాలని నిర్ణయించుకొన్నాడు.
తమక్లబ్ కు ఆడినందుకు ఏడాదికి 800 కోట్ల రూపాయలు చెల్లిస్తామని సౌదీ క్లబ్ ప్రకటించడమే కాదు..రెండున్నర సంవత్సరాల కాంట్రాక్టు సైతం కుదుర్చుకొంది.
రొనాల్డోకి అట్టహాసంగా స్వాగత కార్యక్రమం, జెర్సీ ఆవిష్కరణ సైతం నిర్వహించింది.
అయితే..క్లబ్ తరపున తన అరంగేట్రం మ్యాచ్ కోసం గత కొద్దిరోజులుగా మ్రసూల్ పార్క్ లో నిర్వహించిన సన్నాహాక శిబిరంలో సైతం రొనాల్డో పాల్గొన్నాడు.తీరా..తొలిమ్యాచ్ ఆడటానికి సిద్ధమయ్యే సమయానికి ఫిఫా విధించిన రెండుమ్యాచ్ ల నిషేధం తెరమీదకు వచ్చింది.
రొనాల్డోపై 2 మ్యాచ్ ల నిషేధం...
అల్- తాయి క్లబ్ తో జరిగే మ్యాచ్ ద్వారా అల్ -నాజర్ జట్టు సభ్యుడిగా రొనాల్డో అరంగేట్రానికి రంగం సిద్ధమయ్యింది. మ్యాచ్ వేదికలోని 28వేల సీట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
అయితే..రొనాల్డోపై ఇప్పటికే రెండుమ్యాచ్ ల నిషేధం ఉందని అధికారులు గుర్తు చేశారు. గతంలో ఎవర్టన్ క్లబ్ కు చెందిన ఓ అభిమాని తనను సెల్ ఫోనుతో ఫోటో తీయటానికి ప్రయత్నించిన సమయంలో రొనాల్డో తలబిరుసుగా ప్రవర్తించడంతో పాటు..ఆ అభిమాని చేతిలో ఫోనును లాక్కోవటాన్ని సాకర్ సమాఖ్య తీవ్రంగా ప్రరిగణించింది.
ప్రపంచ ఫుట్ బాల్ సమాఖ్య నియమావళి ప్రకారం భారీజరిమానాతో పాటు రెండుమ్యాచ్ లు ఆడకుండా రొనాల్డోపై నిషేధం విధించారు.
తనకు విధించిన జరిమానాను రొనాల్డో ఇప్పటికే చెల్లించినా..రెండుమ్యాచ్ ల నిషేధాన్ని పూర్తి చేయకపోడంతో..దానిని ఇప్పుడు అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఫలితంగా అల్- నాజర్ క్లబ్ ప్రస్తుత సీజన్లో ఆడే మొదటి రెండుమ్యాచ్ లు ముగిసే వరకూ..తన తొలిమ్యాచ్ కోసం రొనాల్డో వేచిచూడక తప్పదు.
2022లో క్రిస్టియానో రొనాల్డోకి పట్టిన దరిద్రం 2023లో సైతం వెంటాడుతూ ఉండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.