Telugu Global
Sports

భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ సెంచరీ!

భారత క్రికెట్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. లక్నో వేదికగా ఇంగ్లండ్ తో ప్రపంచకప్ 6వ రౌండ్ మ్యాచ్ ద్వారా రికార్డుల్లో చేరాడు.

భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ సెంచరీ!
X

భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ సెంచరీ!

భారత క్రికెట్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. లక్నో వేదికగా ఇంగ్లండ్ తో ప్రపంచకప్ 6వ రౌండ్ మ్యాచ్ ద్వారా రికార్డుల్లో చేరాడు.

భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ఇప్పటి వరకూ పరుగులు, సిక్సర్లు, సెంచరీలతో రికార్డుల మోత మోగిస్తూ వారేవ్వా! అనిపించుకొన్నాడు. అయితే..భారత కెప్టెన్ గా తొలిసారిగా ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. హేమాహేమీల సరసన నిలిచాడు.

100 మ్యాచ్ ల్లో నాయకత్వం...

2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ 6వ రౌండ్ మ్యాచ్ లో భారత్ కు నాయకత్వం వహించడం ద్వారా రోహిత్ శర్మ కెప్టెన్ గా వందమ్యాచ్ ల శతకం పూర్తి చేశాడు.

లక్నోలోని అటల్ బిహారీ స్టేడియం వేదికగా ఇంగ్లండ్ తో మ్యాచ్ ద్వారా ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు. గతంలో ఇదే ఘనతను సాధించిన భారత ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్ల వరుసలో రోహిత్ చోటు సంపాదించాడు.

క్రికెట్ మూడు ( టెస్టులు, వన్డేలు, టీ-20 ) ఫార్మాట్లలోనూ కలిపి ఇప్పటి వరకూ భారత్ కు రోహిత్ వంద మ్యాచ్ ల్లో నాయకత్వం వహించాడు.ధర్మశాల వేదికగా న్యూజిలాండ్ తో ముగిసిన ప్రపంచకప్ 5వ రౌండ్ మ్యాచ్ వరకూ 99 మ్యాచ్ ల్లో కెప్టెన్ గా వ్యవహరించిన రోహిత్...ఇంగ్లండ్ తో 6వ రౌండ్ మ్యాచ్ ద్వారా 100 మ్యాచ్ ల క్లబ్ లో చోటు సంపాదించాడు.

అగ్రస్థానంలో మహేంద్రసింగ్ ధోనీ....

భారత క్రికెట్ చరిత్రలో అత్యధికంగ 332 మ్యాచ్ ల్లో కెప్టెన్ గా వ్యవహరించిన తిరుగులేని రికార్డు మహేంద్ర సింగ్ ధోనీ పేరుతో ఉంది. ఆ తర్వాతి స్థానంలో మహ్మద్ అజరుద్దీన్ కొనసాగుతున్నాడు.

భారత్ కు మూడు వన్డే ప్రపంచకప్ టోర్నీలలో నాయకుడిగా వ్యవహరించిన అజర్ 221 మ్యాచ్ ల్లో కెప్టెన్ గా ఉన్నాడు. 213 మ్యాచ్ ల్లో భారత కెప్టెన్ గా విరాట్ కొహ్లీ మూడోస్థానంలో ఉన్నాడు.

సౌరవ్ గంగూలీ 196 మ్యాచ్ ల్లోనూ, కపిల్ దేవ్ 108 మ్యాచ్ ల్లోనూ, రాహుల్ ద్రావిడ్ 104 మ్యాచ్ ల్లోనూ భారత్ కు కెప్టెన్లుగా వ్యవహరించారు. 100వ మ్యాచ్ లో భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ 7వ స్థానంలో కొనసాగుతున్నాడు.

మాస్టర్ సచిన్ టెండుల్కర్ 98 మ్యాచ్ ల్లో భారత కెప్టెన్ గా వ్యవహరించాడు. సచిన్ నాయకత్వంలో భారత్ 27 విజయాలు, 52 పరాజయాల రికార్డుతో ఉంది.

విరాట్ నుంచి రోహిత్ చేతికి పగ్గాలు...

2017లో భారత వైస్ కెప్టెన్ గా తన ప్రస్థానం ప్రారంభించిన రోహిత్ శర్మ 2021 నుంచి భారతజట్టు పగ్గాలను విరాట్ కొహ్లీ నుంచి అందుకొన్నాడు.2021 సీజన్లో దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికైన భారతజట్టుకు రోహిత్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు.

2022 డిసెంబర్ లో భారతజట్టు పూర్తిస్థాయి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ 5 టెస్టులు, 29 వన్డేలు, 39 టీ-20 మ్యాచ్ ల్లో భారత్ కు విజయాలు అందించాడు.

ప్రస్తుత ప్రపంచ క్రికెట్ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా పేరున్న రోహిత్ నాయకత్వంలో భారత్ ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో విఫలమైనా...టెస్టులీగ్ లో రన్నరప్ గా నిలువగలిగింది.

ఆసియాకప్ క్రికెట్ టైటిల్ ను రోహిత్ నాయకత్వంలో భారత్ పలుమార్లు గెలుచుకోగలిగింది. రోహిత్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలవడం విశేషం.

భారత్ వేదికగా నాలుగోసారి జరుగుతున్న 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీలో భారత్ ను విజేతగా నిలపాలన్న పట్టుదలతో రోహిత్ ప్రస్తుతం నాయకత్వ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాడు.

First Published:  29 Oct 2023 9:48 AM GMT
Next Story