సెమీస్ కు ముందే భారతజట్టుకు వార్నింగ్!
ఐసీసీ వన్డే ప్రపంచకప్ లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిది విజయాలతో అగ్రస్థానంలో నిలిచిన భారత్ కు నాకౌట్ గండం పొంచి ఉంది.
ఐసీసీ వన్డే ప్రపంచకప్ లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిది విజయాలతో అగ్రస్థానంలో నిలిచిన భారత్ కు నాకౌట్ గండం పొంచి ఉంది. ఇప్పుడు టైటిల్ నెగ్గకుంటే మరో పుష్కరకాలం వేచిచూడక తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
భారతగడ్డపై నాలుగోసారి జరుగుతున్న 2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ తొలిదశ రౌండ్ రాబిన్ లీగ్ లో ఆతిథ్య భారత్ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగింది.
అంచనాలకు మించి రాణించడం ద్వారా 10 జట్ల లీగ్ లో నూటికి నూరు శాతం విజయాలతో టేబుల్ టాపర్ గా సెమీస్ చేరిన తొలిజట్టుగా నిలిచింది.
ఆ నాలుగు జట్ల నడుమే పోరు....
గత నాలుగువారాలుగా దేశంలోని 10 నగరాలు వేదికలుగా సాగిన 45 మ్యాచ్ ల రౌండ్ రాబిన్ లీగ్ లో మొత్తం 10 జట్లు తలపడితే..లీగ్ టేబుల్ మొదటి నాలుగుస్థానాలలో నిలవడం ద్వారా టాప్ ర్యాంకర్ భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్ కు చేరుకోగలిగాయి.
నిబంధనల ప్రకారం 18 పాయింట్లతో నంబర్ వన్ గా నిలిచిన భారత్ తో నాలుగోస్థానంలో నిలిచిన న్యూజిలాండ్ తొలి సెమీఫైనల్లో తలపడనుంది. రెండు, మూడు స్థానాలు సాధించిన దక్షిణాఫ్రికా- ఆస్ట్ర్రేలియాజట్లు నవంబర్ 16న కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.
లీగ్ దశలో హిట్..నాకౌట్ దశలో ఫట్!
అయితే..ప్రపంచకప్ టోర్నీలు మారినా భారతజట్టు తలరాత మాత్రం మారడం లేదు. లీగ్ దశలో వరుస విజయాలు సాధించడం, నాకౌట్ రౌండ్లలో చతికిల పడటం ఆనవాయితీగా వస్తోంది. అయితే..నాకౌట్ గండం ఆనవాయితీని ప్రస్తుత ప్రపంచకప్ లో తిరిగరాయాలన్న పట్టుదల రాహుల్ ద్రావిడ్ చీఫ్ కోచ్ గా, రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్న భారతజట్టులో కనిపిస్తోంది.
2003 ప్రపంచకప్ లో సౌరవ్ గంగూలీ నాయకత్వంలో లీగ్ దశలో అదరగొట్టి..టైటిల్ సమరంలో ఆస్ట్ర్రేలియా చేతిలో భారత్ ఘోరపరాజయం చవిచూసింది. గత ప్రపంచకప్ లో సైతం లీగ్ దశలో వరుస విజయాలు సాధించి..సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో కంగు తినాల్సివచ్చింది.
లీగ్ దశలో 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ను ఓడించిన భారత్ తిరిగి సెమీఫైనల్లో అదేజట్టుతో తలపడనుంది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా నవంబర్ 15న ఈ పోరు జరుగనుంది.
ఇప్పుడు కాకుంటే మరో 12 ఏళ్ల తర్వాతే...
భారతజట్టు ప్రస్తుత ప్రపంచకప్ లో అద్భుతంగా రాణిస్తోందని, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో గతంలో ఎన్నడూలేనంత నిలకడగా ఆడుతోందని విఖ్యాత కామెంటీటర్, మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి కితాబిచ్చారు. జట్టులోని ప్రధాన ఆటగాళ్లంతా తమ కెరియర్ లో అత్యుత్తమస్థాయికి చేరుకొన్నారని, 2011 తర్వాత ప్రపంచకప్ నెగ్గటానికి ఇంతకు మించిన సమయం మరొకటి లేదని అంటున్నారు.
ఇప్పుడు కాకపోతే..మరో ప్రపంచకప్ టైటి్ల్ కోసం 12 సంవత్సరాలపాటు వేచిచూడక తప్పదంటూ హెచ్చరించారు. లీగ్ దశలో కనబరచిన జోరునే నాకౌట్ దశలోనూ కొనసాగించాలని సూచించారు. ఏమరపాటు ఏమాత్రం తగదని సలహా ఇచ్చారు.
1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో తొలిసారిగా ప్రపంచకప్ నెగ్గిన భారతజట్టు ఆ తర్వాత రెండో టైటిల్ కోసం 2011 వరకూ వేచిచూడాల్సి వచ్చిందని, మరో టైటిల్ కోసం గత పుష్కరకాలంగా ఎదురుచూస్తూ వచ్చామని గుర్తు చేశారు.
టాప్ గేర్ లో 7గురు క్రికెటర్లు..
ప్రస్తుత భారతజట్టులోని కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ,రాహుల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అశ్విన్, షమీ, బుమ్రా తమ కెరియర్ లో అత్యుత్తమ ఫామ్ కు చేరుకోగలిగారని, వారి ప్రతిభకు యువఆటగాళ్ల దూకుడు జతకలసిన కారణంగానే..లీగ్ దశలో మిగిలిన తొమ్మిది ప్రత్యర్థిజట్లను భారత్ చిత్తు చేయగలిగిందని, ఇదేజోరును, దూకుడును నాకౌట్ రౌండ్లో కొనసాగించాలని సూచించారు.
ప్రత్యేకంగా భారత బౌలింగ్ ఎటాక్ పై ప్రశంసల వర్షం కురిపించారు. గత 50 సంవత్సరాల కాలంలో తనకు తెలిసి ఇదే అత్యుత్తమ బౌలింగ్ దళమంటూ కితాబిచ్చారు.