Telugu Global
Sports

ప్రపంచకప్ లో రోహిత్ శర్మ రికార్డుల జాతర!

భారత్ వేదికగా నాలుగోసారి జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో కెప్టెన్ కమ్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సిక్సర్ల మోతతో పరుగులు వెల్లువెత్తిస్తూ రికార్డుల జాతర జరుపుకొంటున్నాడు.

ప్రపంచకప్ లో రోహిత్ శర్మ రికార్డుల జాతర!
X

భారత్ వేదికగా నాలుగోసారి జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో కెప్టెన్ కమ్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సిక్సర్ల మోతతో పరుగులు వెల్లువెత్తిస్తూ రికార్డుల జాతర జరుపుకొంటున్నాడు.

2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్థాయికి మించి రాణిస్తూ పరుగుల పండుగ, రికార్డుల జాతర చేసుకొంటున్నాడు.

6 మ్యాచ్ ల్లో 398 పరుగులు....

పదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా టాప్ ర్యాంకర్ భారత్ ఆడిన మొదటి ఆరురౌండ్ల మ్యాచ్ ల్లో ఆస్ట్ర్రేలియాతో మినహా మిగిలిన 5 మ్యాచ్ ల్లోనూ రోహిత్ చెలరేగిపోయాడు. ఓ సెంచరీ, 85, 87 స్కోర్లతో వీరవిహారం చేశాడు.

తనజట్టును ముందుండి నడిపించడమే కాదు..ఆరురౌండ్లలో ఆరుకు ఆరువిజయాలతో సెమీస్ బెర్త్ ఖాయం చేయడంలో రోహిత్ ప్రధానపాత్ర పోషించాడు. మొత్తం 6 మ్యాచ్ ల్లో రోహిత్ 398 పరుగులతో 63కు పైగా సగటు సాధించాడు.

2023 సీజన్లో 1000 పరుగుల రికార్డు...

లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియం వేదికగా ఇంగ్లండ్ తో ముగిసిన 6వ రౌండ్ మ్యాచ్ లో రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

బ్యాటింగ్ కు అనువుగా లేని పిచ్ పైన ప్రతిభావంతంగా ఆడి 101 బంతుల్లో 10 బౌండ్రీలు, 3 భారీసిక్సర్లతో 87 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ క్రమంలో ప్రస్తుత సీజన్లో 1000 పరుగుల మైలురాయిని చేరిన భారత రెండో క్రికెటర్ గా నిలిచాడు.

2023 సీజన్లో ఇప్పటికే యువఓపెనర్ శుభ్ మన్ గిల్ వెయ్యి పరుగులు సాధించిన భారత తొలి బ్యాటర్ ఘనతను సొంతం చేసుకొన్నాడు. విరాట్ కొహ్లీ సైతం ప్రస్తుత ప్రపంచకప్ లోనే వెయ్యి పరుగుల రికార్డు చేరే అవకాశం ఉంది.

18వేల పరుగుల 5వ భారత క్రికెటర్...

క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ కలిపి అంతర్జాతీయ క్రికెట్లో 18వేల పరుగులు సాధించిన భారత ఐదవ బ్యాటర్ గా రోహిత్ శర్మ రికార్డుల్లో చేరాడు. ఇంతకుముందే ఈ ఘనత సాధించిన భారత దిగ్గజ బ్యాటర్లలో మాస్టర్ సచిన్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కొహ్లీ ఉన్నారు.

ప్రపంచకప్ లో అత్యధిక సెంచరీల రికార్డు...

వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా 7 శతకాలు బాదిన ఏకైక బ్యాటర్ రోహిత్ శర్మ మాత్రమే. 2019 ప్రపంచకప్ లో 5 శతకాలతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన రోహిత్ ప్రస్తుత ప్రపంచకప్ లో అప్ఘనిస్థాన్ పై భారీశతకం సాధించడం ద్వారా తన ప్రపంచకప్ సెంచరీల సంఖ్యను ఏడుకు పెంచుకోగలిగాడు. పాకిస్థాన్ పై 86 పరుగులు, ఇంగ్లండ్ పై 87 పరుగుల స్కోర్లతో సెంచరీలకు చేరువగా వచ్చి రోహిత్ అవుటయ్యాడు. బంగ్లాదేశ్ పైన 48, న్యూజిలాండ్ పైన 46 పరుగుల స్కోర్లు సైతం రోహిత్ నమోదు చేశాడు.

మాస్టర్ సచిన్ ను మించిన రోహిత్....

ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీలలో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్ గా మాస్టర్ సచిన్ పేరుతో ఉన్న రకార్డును రోహిత్ శర్మ అధిగమించాడు. మాస్టర్ సచిన్ 45 మ్యాచ్ ల్లో 6 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలతో 2278 పరుగులతో 56.95 సగటు, 88.98 స్ట్ర్రయిక్ రేట్ నమోదు చేశాడు.

రోహిత్ శర్మ మాత్రం ఐసీసీ టీ-20, వన్డే ప్రపంచకప్ టోర్నీలలో భాగంగా ఆడిన 59 మ్యాచ్ ల్లో సచిన్ రికార్డును అధిగమించగలిగాడు.

కపిల్ రికార్డును అధిగమించిన రోహిత్..

ప్రపంచకప్ లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన భారత బ్యాటర్ గా కపిల్ దేవ్ పేరుతో ఉన్న రికార్డును సైతం రోహిత్ శర్మ అధిగమించగలిగాడు. అప్ఘనిస్థాన్ పైన రోహిత్ వన్డే ప్రపంచకప్ చరిత్రలో అతితక్కువ బంతుల్లో ( 72) శతకం బాదిన బ్యాటర్ గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.కేవలం 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, పవర్ ప్లే ఓవర్లు ముగియక ముందే 80 పరుగుల స్కోరును చేరుకోడం విశేషం.

జింబాబ్వే పై 1983 జూన్ 18న అలనాటి భారత కెప్టెన్ కపిల్ దేవ్ 175 పరుగుల స్కోరు సాధించిన సమయంలో 72 బంతుల శతకం నమోదు చేశాడు. ఆ రికార్డును నాలుగు దశాబ్దాల విరామం తర్వాత రోహిత్ 72 బంతుల సెంచరీతో అధిగమించగలిగాడు.

సిక్సర్లబాదుడులోనూ రోహిత్ రికార్డు...

ప్రస్తుత సీజన్లో 50కి పైగా సిక్సర్లు బాదిన ఓపెనర్ గాను రోహిత్ మరో రికార్డు నమోదు చేశాడు. ఇంగ్లండ్ తో జరిగిన 6వ రౌండ్ మ్యాచ్ లో సైతం రోహిత్ 3 సిక్సర్లు బాదాడు.

క్రికెట్ మూడు ఫార్మాట్లలోను అత్యధిక సిక్సర్లు ( 553 ) బాదిన వెస్టిండీస్ సునామీ ఓపెనర్ గేల్ రికార్డును రోహిత్ తన 554వ సిక్సర్ బాదటం ద్వారా మరో రికార్డు సొంతం చేసుకొన్నాడు.

భారత 4వ క్రికెటర్ రోహిత్...

వన్డే ప్రపంచకప్ లో వెయ్యి పరుగుల రికార్డు అందుకొన్న నాలుగో భారత క్రికెటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు. తన కెరియర్ లో 3వ ప్రపంచకప్ ఆడుతున్న రోహిత్ 1000 పరుగుల్లో 7 శతకాలు ఉన్నాయి. అంతేకాదు..ప్రపంచకప్ లో అత్యధిక స్కోర్లు సాధించిన బ్యాటర్ల వరుసలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును సైతం తెరమరుగు చేయగలిగాడు.

సచిన్ రికార్డుకూ తప్పని ఎసరు...

గత రెండు దశాబ్దాలుగా మాస్టర్ సచిన్ పేరుతో ఉన్న అత్యధిక ప్రపంచకప్ శతకాల (6) రికార్డుకు సైతం రోహిత్ ఎసరు పెట్టాడు. మాస్టర్ సచిన్ 1992 నుంచి 2011 ప్రపంచకప్ వరకూ 45 మ్యాచ్ లు ఆడి 41 ఇన్నింగ్స్ లో ఆరు శతకాలు బాదితే...రోహిత్ శర్మ మాత్రం 2015 ప్రపంచకప్ నుంచి 2023 ప్రపంచకప్ రెండోరౌండ్ మ్యాచ్ వరకూ కేవలం 19 ఇన్నింగ్స్ లోనే 7 శతకాలు సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ఇంగ్లండ్ వేదికగా ముగిసిన 2015 ప్రపంచకప్ లోనే రోహిత్ 5 శతకాలు బాదడం ద్వారా గతంలోనే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒకే ప్రపంచకప్ లో ఐదు సెంచరీలు బాదిన ఒకే ఒక్కడు రోహిత్ శర్మ మాత్రమే.

ఇప్పటి వరకూ ఆస్ట్ర్రేలియా మాజీకెప్టెన్ రికీ పాంటింగ్ పేరుతో ఉన్న 30 శతకాల రికార్డును సైతం రోహిత్ 31 సెంచరీతో అధిగమించాడు.

First Published:  30 Oct 2023 12:51 PM GMT
Next Story